జిల్లా కోర్టుకు త్వరలో వసతులు
- విద్యుత్ సమస్య పరిష్కారానికి జనరేటర్లు
- హైకోర్టు జడ్జి అశుతోష్ మొహంతా వెల్లడి
- బందరుతో అనుబంధం మరువలేను : మరో జడ్జి సత్యనారాయణమూర్తి
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : ఎంతో చరిత్ర కలిగిన జిల్లా కోర్టులో మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి అశుతోష్ మొహంతా అన్నారు. జిల్లా కోర్టులో విద్యుత్‌కోత సమస్యను తీర్చేందుకు త్వరలో జనరేటర్లు ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు.
జిల్లా కోర్టులో అసిస్టెంట్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టును హైకోర్టు న్యాయమూర్తి ఎం.సత్యనారాయణమూర్తి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.చక్రధరరావుతో కలిసి శనివారం ఆయన ప్రారంభించారు. అనంతరం ఇనగుదురుపేట పోలీస్‌స్టేషన్‌లో నమోదైన కేసుపై వాదనలు లాంఛనంగా ప్రారంభించి వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 1802 నుంచి మచిలీపట్నంలో జిల్లా కోర్టు ఉందని, బ్రిటీష్, ఫ్రెంచి దేశస్తులు ఇక్కడ న్యాయమూర్తులుగా పనిచేశారని చెప్పారు.
ఇక్కడి సీనియర్ల నుంచి ఎంతో నేర్చుకున్నా...
హైకోర్టు న్యాయమూర్తి ఎం.సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ తన స్వస్థలం మచిలీపట్నమేనన్నారు. జిల్లా కోర్టులో చాలా కాలం పాటు న్యాయవాదిగా పనిచేసినట్లు చెప్పారు. మచిలీపట్నం పురపాలక సంఘ స్టాండింగ్ కమిటీ న్యాయవాదిగా కూడా పనిచేశానన్నారు. ఇక్కడ పనిచేసే సీనియర్ న్యాయవాదుల నుంచి ఎంతో నేర్చుకున్నానని చెప్పారు. స్వస్థలమైన మచిలీపట్నాన్ని, తనతోపాటు పనిచేసిన న్యాయవాదులు, న్యాయమూర్తులను ఎన్నటికీ మరువనన్నారు.
న్యాయమూర్తుల పనితీరులో మార్పు వస్తేనే కేసులు త్వరితగతిన పరిష్కారానికి అవకాశం ఉంటుందని ఆయన చెప్పారు. అధిక శాతం న్యాయమూర్తులు చాంబర్‌కే పరిమితమవుతున్నారని, ఈ పద్ధతి విడాల్సిన అవసరముందని సూచించారు. జిల్లా కోర్టులో అసిస్టెంట్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ప్రారంభించటం శుభసూచకమన్నారు.
ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు...
జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి జి.చక్రధరరావు మాట్లాడుతూ జిల్లా కోర్టులో ఖాళీగా ఉన్న పోస్టులను త్వరితగతిన భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. మచిలీపట్నం బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బోగిరెడ్డి వెంకన్నబాబు సభకు స్వాగతం పలకగా అసోసియేషన్ అధ్యక్షుడు ఆరెపు వెంకటేశ్వరరావు సభకు అధ్యక్షత వహించారు. హైకోర్టు న్యాయమూర్తులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో కోర్టు ప్రాంగణంలో ఏర్పాటుచేసిన పార్కును హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు.