కోలాహలంగా ఫ్లెమింగో ఫెస్టివల్
రెండోరోజున ఆటల పోటీల సందడి
సూళ్లూరుపేట: ఫ్లెమింగో ఫెస్టివల్-2015లో భాగంగా రెండోరోజు శనివారం సూళ్లూరుపేట ప్రభుత్వ హైస్కూల్ మైదానంలో ఆటలపోటీలను అత్యంత కోలాహలంగా నిర్వహించారు. నియోజకవర్గంలోని పురుషులకు, మహిళలకు వేర్వేరుగా క్రీడలను నిర్వహించారు. కబడ్డీ, వాలీబాల్, మహిళలకు త్రోబాల్ పోటీలను నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే క్రీడాపోటీలను ప్రారంభించారు. అనంతరం జిల్లాలోని పలు ప్రాంతాలనుంచి విద్యార్థులు, తిరుపతి, శ్రీకాళహస్తి, చెన్నై నుంచి వచ్చిన పలువురు పర్యాటకులు ఎగ్జిబిషన్ స్టాల్స్‌ను సందర్శించారు.
అ తర్వాత ఉచిత బస్సుల్లో అటకానితిప్పకు వెళ్లి పులికాట్‌లో ఆహారవేటలో ఉన్న విదేశీ వలస విహంగాలను వీక్షించారు. ఆ తర్వాత నేలపట్టు పక్షులు కేంద్రానికి వెళ్లి చెరువులోని చెట్లపై గూళ్లుకట్టుకుని విన్యాసాలు చేస్తున్న విహంగాలను తిలకించారు.
శనివారం మాత్రం సూళ్లూరుపేట మైదానం, బీవీపాళెంలో బోట్ షికార్, నేలపట్టుల్లో పక్షులను వీక్షించేందుకు పర్యాటకులు కిటకిటలాడుతూ కనిపించారు. దీనికి తోడు పులికాట్‌లో అత్యధికంగా విదేశీ వలస విహంగాలు దర్శనమివ్వడంతో సందర్శకులు పులకించిపోయారు. శ్రీహరికోట-సూళ్లూరుపేట మార్గానికి ఇరువైపులా పులికాట్ సరస్సులో ఫ్లెమింగోలు, పెయింటెడ్ స్టార్క్స్ ప్రకృతి ప్రియులకు కనువిందు చేశాయి.
బోటు షికారు... భలే హుషారు...
తడ మండలం భీములవారిపాళెం వద్ద బోటు షికారు ఏర్పాటు చేశారు. పులికాట్ సరస్సులో బోటు షికారు బాగుందని పర్యాటకుల అభిప్రాయం. నేలపట్టులో పక్షులను తిలకించడానికి జిల్లా నుంచి, తమిళనాడు నుంచి వేలాదిమంది పర్యాటకులు వచ్చారు.