వినుకొండ : రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అసెంబ్లీ సమావేశాల్లో దుర్భాషలాడిన అధికార పార్టీ శాసనసభ్యుడుపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో శాసనసభ స్పీకర్ చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ డిమాండ్ చేశారు. శాసన సభాధిపతి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సభ్యుల హక్కులను కాలరాస్తున్నారని ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నార న్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్‌చార్జి బొల్లా బ్రహ్మనాయుడుతో కలిసి సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ సభ్యులు సభలో మాట్లాడితే వాస్తవాలు బయటకు వస్తాయన్న భయంతోనే కుట్రపూరితంగా అధికారపక్షం గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రధాన ప్రతి పక్షనాయకులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సభలో మాట్లాడుతుంటే ప్రసంగం పూర్తికాకుండానే బొండా ఉమామహేశ్వరరావు, మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, అచ్చెన్నాయుడు తదితరులను మధ్యలో మాట్లాడేందుకు స్పీకర్ ఎలా అవకాశం ఇచ్చారని ప్రశ్నించారు. జగన్‌ను దూషించడం తప్ప వారు మాట్లాడిన మాటల వలన రాష్ట్ర ప్రజలకు ఏమైనా ప్రయోజనం చేకూరిందా? అని ప్రశ్నించారు. అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలను సభలో ఆవిధంగా మాట్లాడించింది ముఖ్యమంత్రి చంద్రబాబేనని ఆరోపించారు. అధికార పార్టీ నాయకులు తప్పులను గ్రహించి సభ సంప్రదాయాలను కాపాడాలని ఆయన హితవు పలికారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ధ్వజమెత్తారు. బ్మహ్మనాయుడు మాట్లాడుతూ ప్రజల సమస్యలు విస్మరించిన స్థానిక నాయకులు జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. పట్టణ ప్రజలు ఏళ్ల తరబడి తాగునీటి సమస్య పరిష్కారానికి నోచుకోక పోవడం వలన తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. మున్సిపల్ కమిషనర్ టీడీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
అధికారులు గ్రామాల్లో పర్యటించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి మూలె వెంకటేశ్వరరెడ్డి, జిల్లా కార్యదర్శి చింతలచెర్వు వెంకిరెడ్డి, అమ్మిరెడ్డి అంజిరెడ్డి, పట్టణ కన్వీనర్ ఎన్ శ్రీను, శావల్యాపురం మండల కన్వీనర్ చుండూరు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.