ఇలా ఉంటే ఎలా?
గుంటూరు : రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ వివరాలు వెబ్‌సైట్‌లో మినహా సీఆర్‌డీఏ కార్యాలయాల్లో అందుబాటులోకి రాకపోవడంపై వివిధ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. తమది హైటెక్ ప్రభుత్వమని పదేపదే చెప్పుకునే ముఖ్యమంత్రి చంద్రబాబు మాస్టర్ ప్లాన్‌ను వెబ్‌సైట్‌లో ఉంచిన రెండు రోజులకు కూడా సీఆర్‌డీఏ కార్యాలయాల్లో ప్రదర్శించక పోవడంపై పలువురు మండిపడుతున్నారు.
శనివారం రాత్రి పొద్దుపోయిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం హడావుడిగా రాజధాని మాస్టర్ ప్లాన్ వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచి నెలరోజుల్లో అభ్యంతరాలు తెలియచేయవచ్చని వివరించింది.
సోమవారం నుంచి సీఆర్‌డీఏ కార్యాలయాల్లో ప్రజల పరిశీలనకు, అభ్యంతరాల స్వీకరణకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు వివరించారు. అయితే వెబ్‌సైట్‌లోని వివరాలు ఇంగ్లిషులో ఉండడం, రైతులకు నెట్ పరిజ్ఞానం లేకపోవడంతో సోమవారం ఉదయం సీఆర్‌డీఏ కార్యాలయాలకు చేరుకున్నారు. నోటీసు బోర్డుల్లో మాస్టర్‌ప్లాన్ వివరాలు ఉంచకపోవడంతో అధికారులను సంప్రదించారు. ఒకటీ రెండు రోజుల్లో నోటీస్‌బోర్డుల్లో బహిరంగ పరుస్తామని చెప్పడంతో రైతులు నిరుత్సాహంతో తిరుగుముఖం పట్టారు.తుళ్ళూరు, గుంటూరు, తెనాలిలోని సీఆర్‌డీఏ కార్యాలయాలకు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలు వస్తూనే ఉన్నారు. వీరందరికీ అక్కడి సిబ్బంది సహనంతో సమాధానం ఇచ్చారు. కొందరి కోరిక మేరకు వెబ్‌సైట్‌లోని వివరాలు వెల్లడించేందుకు ప్రయత్నించారు. అయితే వచ్చిన వారంతా సమాచారాన్ని తమకూ చెప్పాలని డిమాండ్ చేయడంతో రోజు వారి విధులకు భంగం కలుగుతుందని వారిని పంపించి వేశారు.
దూర ప్రాంతాల నుంచి నేరుగా కార్యాలయాలకు రాకుండా ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకుని, అప్పుడు రావాలని సూచించారు.తుళ్ళూరులో సీఆర్‌డీఏ కమిషనర్ ఎన్. శ్రీకాంత్ అధికారులు, సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేయడంతో అది పూర్తయ్యే వరకు ప్రజలు నిరీక్షించారు. అయితే డిస్‌ప్లే ఏర్పాట్లు ఒకటి రెండు రోజుల్లో పూర్తి చేస్తామని, విజయవాడ నుంచి మాస్టర్ ప్లాన్‌కు సంబంధించి ప్రింట్ కాపీలు రాలేదని వివరించడంతో వారంతా తిరుగు ముఖం పట్టారు. గుంటూరు, విజయవాడలకు తరలివెళ్లిన రైతులు, మాస్టర్‌ప్లాన్ వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచడంతో రాజధాని గ్రామాలకు చెందిన రైతులు, నిరుద్యోగులు గుంటూరు, మంగళగిరి, విజయవాడల్లోని నెట్‌సెంటర్లకు చేరుకుని ప్రింట్ కాపీలు తీసుకున్నారు. ఇంగ్లిషులో ఉన్న ఆ కాపీలను మళ్లీ తమ సమీప బంధువులు, స్నేహితుల్లోని విద్యావంతుల వద్దకు తీసుకువెళ్లి తెలుగులో చెప్పించుకున్నారు. ఇలా పలువురు రైతులు ఇబ్బందులు పడ్డారు.
ముఖ్యంగా కోర్‌కేపిటల్ ప్రాంతానికి చెందిన ఉద్దండ్రాయునిపాలెం, లింగాయ పాలెం, తాళ్లాయపాలెం గ్రామాలపై అధికారులు, మంత్రులు రోజుకో విధమైన ప్రకటన చేయడంతో అక్కడి ప్రజలు ఎంతో ఆందోళనతో ఉన్నారు. తమ గ్రామాలు పూర్తిగా గల్లంతవుతాయనే ప్రచారంలోని వాస్తవాలను తెలుసుకునేందుకు గుంటూరు, విజయ వాడ నగరాలకు చేరుకుని మాస్టర్ ప్లాన్ వివరాలను తెలుసుకున్నారు. ఇప్పటికైనా రైతుల పరిస్థితిని అర్థం చేసుకుని మాస్టర్ ప్లాన్‌ను తెలుగులోకి అనువదించి నోటీసు బోర్డుల్లో బహిరంగ పరచాలని వివిధ వర్గాలు కోరుతున్నాయి.