ఒకప్పుడు టీడీపీని భుజాన మోసిన సామాజిక వర్గాలకు నేడు ఆ పార్టీ తగిన గుర్తింపు ఇవ్వలేదని సీనియర్ నాయకులు మథనపడుతున్నారు.
- సిట్టింగ్ ఎమ్మెల్యేకే చోడవరం టికెట్
- మెజార్టీ ఓటర్లున్న సామాజికవర్గాలను విస్మరించిన చంద్రబాబు!
చోడవరం, న్యూస్‌లైన్ : ఒకప్పుడు టీడీపీని భుజాన మోసిన సామాజిక వర్గాలకు నేడు ఆ పార్టీ తగిన గుర్తింపు ఇవ్వలేదని సీనియర్ నాయకులు మథనపడుతున్నారు. మెజార్టీ ఓటర్లున్న కులాలను పదేళ్లుగా ఆ పార్టీ పక్కన పెట్టడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి చోడవరం నియోజకవర్గంలో వెలమ సామాజికవర్గానికి చెందిన గూనూరు మిలట్రీ నాయుడుకు ఐదుసార్లు టికెట్టు ఇచ్చారు. మూడు సార్లు ఆయన గెలుపొందారు.
ఎన్టీ రామారావు ఉన్నంతకాలం జిల్లాలో సామాజిక సమీకరణాలు పక్కన పెట్టి చోడవరం టికెట్టు మాత్రం మిలట్రీకే ఇచ్చారు. అప్పటి నుంచి మిలట్రీ సామాజికవర్గానికి చెందిన వారంతా టీడీపీతోనే ఎక్కువ శాతం ఉన్నారు. ఇక ఈ నియోజకవర్గంలో అత్యధికంగా 90వేలకుపైగా ఓటర్లు ఉన్న కాపు సామాజిక వర్గానికి, సుమారు 30 వేల మంది ఉన్న యాదవులకు ఆ పార్టీ ఎప్పుడూ ఎమ్మెల్యే టికెటు ఇవ్వలేదు. ఒక పర్యాయం స్థానికం కాని గంటా శ్రీనివాసరావుకు మాత్రం ఇచ్చింది.
చంద్రబాబు పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఆ పార్టీ నుంచి మిలట్రీ తప్పుకున్నారు. అప్పటి నుంచి ఆయన సామాజికి వర్గానికి చెందిన ప్రస్తుత ం గోవాడ సుగర్ ఫ్యాక్టరీ చైర్మన్‌గా ఉన్న గూనూరు మల్లునాయుడు, ఆయన అన్న గూనూరు పెదబాబు టీడీపీని భుజాన వేసుకొని మోస్తున్నారు. ఈ పరిస్థితుల్లో 2009 ఎన్నికల్లో చోడవరం టికెట్టు తనకే ఇవ్వాలని గూనూరు మల్లునాయుడు కాపు సామాజికవర్గం నుంచి బత్తుల తాతయ్యబాబు దరఖాస్తు చేసుకున్నారు.
వచ్చే ఎన్నికల్లో చూద్దామని వీరికి చంద్రబాబు చెప్పడంతో మల్లునాయుడు వెనక్కి తగ్గారు. అధినేత ఇచ్చిన హామీ మేరకు ఈసారి ఎలాగైనా టికెట్టు తనకే వస్తుందని గంపెడాశలు పెట్టుకున్నారు. పార్టీని అంటిబెట్టుకొని గోవాడ సుగర్స్, పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ గెలవడానికి అన్నివిధాలా శ్రమించి మంచి ఫలితాలు సాధించారు. అయ్యన్నపాత్రుడు మద్దతుతో చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చారు.
అయినా ఫలితం లేకపోయింది. రెండో సారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్ రాజు కే పార్టీ టికెట్టు ఇచ్చింది. పార్టీ పుట్టిన దగ్గర నుంచి భుజాన మోస్తున్న తమను కాదని కనీసం ఒక్కశాతం కూడా ఓట్లు లేని రాజుకి టిక్కెట్టు ఇవ్వడం మల్లునాయుడు జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన అనుచరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయనతోపాటు బత్తులతాతయ్యబాబు, వియ్యపు అప్పారావుతోపాటు మరింతకొంత మంది సీనియర్లు చంద్రబాబు తీరుపై ఆగ్రహం వ్యక్తం వెల్లగక్కుతున్నట్టు తెలిసింది.
ఎమ్మెల్యే అయిన తర్వాత తన సొంత ప్రయోజనాల కోసం కొంత కాలం పార్టీని పట్టించుకోకుండా వదిలేసిన రాజును స్వయాన చంద్రబాబే మందలించిన విషయాన్ని ఆ పార్టీ శ్రేణుల్లో చర్చించుకుంటున్నారు. రాజును ప్రకటించిన తర్వాత ఆయనతో సమవుజ్జీగా ఉన్న ఆ పార్టీ నాయకులంతా అంటీముట్టనట్టు ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.