భవితకు భంగపాటు
సీఆర్‌డీఏలో శిక్షణ పొందిన 113 మంది విద్యార్థులు
ఉద్యోగాలు ఇవ్వకపోడమేగాక తాత్కాలిక రాజధాని నిర్మాణంలోనూ వీరికి మొండిచెయ్యే..
విద్యార్థులకు అండగా ఉంటామన్న ఎమ్మెల్యే ఆర్కే
అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఇంటికో ఉద్యోగం..ఉద్యోగం రాని నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 2 వేలు నిరుద్యోగ భృతి ఇదీ ఎన్నికలకు ముందు గ్రామ గ్రామాన టీడీల నాయకులు వేసి హామీల గాలం..రాజధాని ప్రాంతంలో వారికైతే అమరావతి నిర్మాణంలో భాగస్వాములను చేయడంతోపాటు ఉద్యోగమిచ్చి ఉపాధి పట్టం కడతాం..ఇదీ నిరుద్యోగుల భవితపై ఆశలు రేపుతూ నాయకులు పలికిన చిలక పలుకులు..తీరా చూస్తే ఉద్యోగాలూ లేవు..రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యమూ లేదు..కేవలం దక్కింది మాత్రం ముద్ద అన్నం పెట్టని తూతూమంత్రం శిక్షణ ఒక్కటే..
మంగళగిరి: సీఆర్‌డీఏ అధకారుల ప్రచారాన్ని ఏపీఎస్‌ఎస్‌డీసీ(ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) అధికారుల హామీలను నమ్మిన 113 మంది బీటెక్, ఎంసీఏ విద్యార్థులు 2015లో ఆరు నెలల శిక్షణకు హాజరయ్యారు. శిక్షణ కోర్సుల వారీ(సివిల్, మెకానిక్, ఐటీ, సీఎస్)గా ఉంటుందని అంతర్జాతీయ కంపెనీలతో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. శిక్షణ పూర్తవగానే సీఆర్‌డీఏలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వ ఉద్యోగంపై ఆశతో అప్పటికే చేస్తున్న ఉద్యోగాలు సైతం వదులుకుని శిక్షణలో చేరారు. తొలుత నాగార్జున యూనివర్సిటీ శిక్షణ ఇచ్చిన అధికారులు రిషితేశ్వరి ఘటనతో శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్లలోని గురుకులంలోకి మార్చారు. నెలలు గుడుస్తున్నా ఆశించిన కంపెనీలు కోర్సులు వారీగా శిక్షణ ఇవ్వ లేదు. మరో వైపు శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు ఉద్యోగ అవకాశాలు రాకపోవడంతో ఆగ్రహం చెంది తుళ్లూరు సీఆర్‌డీఏ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. దీంతో కంగుతిన్న అధికారులు తాము సీఆర్‌డీఏలో ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదని, ఏపీఎస్‌ఎస్‌డీసీ ప్రకటనలో తప్పు దొర్లిందని తాపీగా సెలవిచ్చారు. దీంతో హతాశులైన నిరుద్యోగులు అధికారుల తీరుపై మండిపడ్డారు. శిక్షణ పొందిన కాలానికి స్టైఫండ్ ఇవ్వలేదని, ఏడాది కాలన్ని కోల్పోయామని విన్నవించినా వీరి రోదన ఆలకించే వారే కరువయ్యూరు. కనీసం వివిధ విభాగాల్లో శిక్షణ పొందిన తమకు తాత్కాలిక రాజధాని నిర్మాణంలోనైనా అవకాశం కల్పించాలంటున్న వారి అభ్యర్థననూ పక్కన పెట్టారు. ఇదేనా రాజ ధాని విద్యార్థులపై ప్రభుత్వాన్నికున్న ప్రేమంటూ మండిపడుతున్నారు.
ప్రైవేటు ఉద్యోగం వదిలేసి వచ్చా
బీటెక్ పూర్తరుుంది. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తూ సీఆర్‌డీఏ ప్రకటనతో ఇక్కడ శిక్షణకు వచ్చా. కోరుకున్న కోర్సులో శిక్షణ ఇస్తామని చెప్పిన అధికారులు ఎలక్ట్రికల్ వైరింగ్‌లో శిక్షణ ఇచ్చారు. రాజధాని నిర్మాణంలో ఎలక్ట్రికల్ విభాగంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంటే అనుభవం అడిగారు. ప్రభుత్వం నిరుద్యోగులకు మోసం చేశాయి. - ముదిగొండ మధుప్రసాద్
శిక్షణ పూర్తరుునా పట్టించుకోలేదు
బీటెక్ ఈసీ పూర్తి చేసి, సీఆర్‌డీఏ శిక్షణలో ఐటీఐ సివిల్‌లో శిక్షణ తీసుకున్నా. ఏడాది కాలం శిక్షణలో స్టైఫండ్ ఇవ్వడంతోపాటు శిక్షణ పూర్తయిన వెంటనే ఉద్యోగ అవకాశం కల్పిస్తామని చెప్పారు. రాజధానిలో ప్రభుత్వం చెప్పేది ఏది చేయడం లేదు. అనేక మంది శిక్షణ తీసుకుని ఖాళీగా ఉంటున్నాం. - సురేంద్ర
ప్రభుత్వం మోసం చేస్తోంది
రాజధానిలో రైతులనేగాక ప్రతి ఒక్కరినీ ప్రభుత్వం మోసం చేస్తోంది. శిక్షణ పేరుతో యువకుల భవిష్యత్తును నాశనం చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న యువకులకు వెంటనే ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. శిక్షణ ఇచ్చిన ప్రభుత్వమే తాత్కాలిక రాజధాని నిర్మాణంలో అనుభవం అడ గడమేమిటి. యువకులకు అండగా నిలిచి వారికి న్యాయం జరిగే వరకూ పోరాడతాం. - ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే), ఎమ్మెల్యే