సాక్షి, కొత్తగూడెం: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం.. పనులు పర్యవేక్షిస్తున్న అధికారులు, సిబ్బందికి బంగారు బాతుగా మారింది. ఏటా రూ.వందల కోట్లతో పనులు చేపడుతుండడంతో పైస్థాయి నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందినకాడికి దండుకుంటున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఈ పథకంలో రూ.3.5 కోట్లు స్వాహా అయితే కేవలం రూ.1.5 కోట్లు మాత్రమే రికవరీ చేయడం గమనార్హం.ఉపాధి హామీ పనులకు నిధులు పుష్కలంగా విడుదల అవుతుండడంతో అవినీతి ఏరులై పారుతోంది. మండల స్థాయి అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బంది తమ చేతివాటంతో పనులు చేయకుండానే.. రికార్డుల్లో చేసినట్లు చూపించి అందినంత స్వాహా చేస్తున్న పరంపర ఈ పథకం ప్రారంభం నుంచీ జిల్లాలో కొనసాగుతూనే ఉంది. జిల్లాలో ఆరు విడతలుగా నిర్వహించిన సామాజిక తనిఖీల్లో అధికారులు, సిబ్బంది చేతివాటం వెలుగులోకి వచ్చింది. జిల్లా వ్యాప్తంగా జరిగిన స్వాహాలో ఇంకా రూ.2 కోట్లు రికవరీ చేయాల్సి ఉంది.
అవినీతికి పాల్పడిన పెనుబల్లి, దమ్మపేట ఎంపీడీఓలను ఇటీవల సస్పెండ్ చేశారు. అలాగే 20 మంది టెక్నికల్ అసిస్టెంట్లు, 30 మంది ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల నుంచి తొలగించారు. ఈ పథకం ప్రారంభం నుంచి జిల్లాలో ఇప్పటి వరకు 500 మంది పైగా క్షేత్ర స్థాయి సిబ్బందిని విధుల నుంచి తప్పించారు. గతంలో పినపాక, కొత్తగూడెం, పెనుబల్లి, దమ్మపేట మండలాల్లో పనులు చేయకుండానే ఎక్కడికక్కడ బిల్లులు స్వాహా చేసి తమ మాయాజాలాన్ని ప్రదర్శించారు. నిధులు పక్కదారి పట్టిన మండలాల్లో ప్రత్యేకంగా విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విచారణకు ఆదేశిస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. తాజాగా కొత్తగూడెం మండలంలోని సుజాతనగర్ పం చాయతీ పరిధిలో సామాజిక తనిఖీ చేయగా సిబ్బంది రూ.3 లక్షల మేర అవినీతికి పాల్పడినట్లు బయటపడడం ఇందుకు నిదర్శనం. కూలీలకు వేతనాలు ఇవ్వకుండా నిధులు కాజేశారని తేలింది. ప్రతి ఏటా ప్రాజెక్టు డెరైక్టర్లు మారుతుండడం, పర్యవేక్షణ లోపంతో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.
సామాజిక తనిఖీలున్నా బెదరరు..
నిధులు స్వాహా అయినట్లు ఫిర్యాదు అందిన వెంటనే సామాజిక తనిఖీలు చేస్తున్నా సిబ్బంది చేతివాటం మాత్రం షరామామూలుగా మారుతోంది. ఈ తనిఖీలను అధికారులు పూర్తి స్థాయిలో చేయకపోవడం, నామమాత్రపు కేసులు పెట్టి వదిలేస్తుండడంతో ఉన్న సిబ్బంది నిధులు దండుకోవడానికి వెనకాడడం లేదనే ఆరోపణలొస్తున్నాయి. ఒక్కో మండలాల్లో రెండు నుంచి మూడు సార్లు సామాజిక తనిఖీలు చేస్తున్నా నిధుల స్వాహా తంతు కొనసాగుతూనే ఉంది. ఆ శాఖ ఉన్నతాధికారుల ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా కఠినంగా వ్యవహరిస్తేనే.. సిబ్బంది స్వాహా చేసిన డబ్బు రికవరీ అయ్యే అవకాశం ఉంది. అంతేకాకుండా కేసుల విషయంలో కూడా ఇదే తరహాలో దృష్టి పెడితే నిధుల స్వాహాకు కొంతమేరకైనా కళ్లెం వేయవచ్చు.
మళ్లీ పోస్టింగ్‌లు దక్కించుకునే యత్నం..
తొలగించిన కొంతమంది సిబ్బంది పైరవీలతో మళ్లీ పోస్టింగ్‌లు దక్కించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రధానంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధుల చుట్టూ తొలగించిన సిబ్బంది ప్రదక్షిణలు చేస్తున్నారు. రూ.లక్షల్లో మింగిన డబ్బు తమ వద్ద లేదని, ఇప్పుడు రికవరీ చేయకుండా సదరు ఆధికారులను ఆదేశించాలని.. స్వాహాకు పాల్పడినవారు ప్రజాప్రతినిధులకు చెప్పుకుంటున్నారు. దీంతో రాజకీయ నాయకుల నుంచి వస్తున్న ఒత్తిళ్లతో సామాజిక తనిఖీ విభాగం ఉన్నతాధికారులు రికవరీ చేయడానికి వెనకంజ వేస్తున్నట్లు తెలిసింది. సామాజిక తనిఖీలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పూర్తిస్థాయిలో రికవరీ చేయలేకపోతున్నారు. ఇలా ఉపాధి నిధులు దుర్వినియోగం అవుతున్నా సామాజిక తనిఖీలతో ఆయా సిబ్బంది బెదరక ఇంకా అవినీతి పాల్పడుతుండడంతో.. ఉపాధి హామీ పథకం అవినీతి ఊటగా మారింది.
రికవరీ చేస్తాం
ఇప్పటి వరకు జిల్లాలో ఏడు విడతలుగా ఆడిట్ పూర్తి చేశాం. సిబ్బంది స్వాహా చేసిన రూ.1.7 కోట్లు రికవరీ చేశాం. మిగిలిన నిధులను కూడా త్వరలో రికవరీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. అయితే ఉపాధి నిధులు స్వాహా చేసిన సిబ్బందిపై పోలీస్ కేసులు పెట్టాం. వేతనంలో కోత విధించి కొంత మేరకు రికవరీ చేయగలుగుతున్నాం. సోషల్ ఆడిట్ ద్వారానే ఏ స్థాయిలో నిధులు స్వాహా చేశారో తెలుస్తుంది. ఎవరి ఒత్తిళ్లకు లొంగి పనిచేయం. రికవరీలో నిక్కచ్చిగా వ్యవహరిస్తాం.
-టి.రమేష్‌బాబు, డ్వామా విజిలెన్స్ అధికారి
అవినీతి ఊట!
Published Mon, Dec 9 2013 5:49 AM | Last Updated on Sat, Aug 25 2018 5:17 PM
Advertisement
Advertisement