యలమంచిలిలో నకిలీ కరెన్సీ!
విచ్చలవిడిగా రూ.1,000, 500 నోట్ల చలామణి
బ్యాంకులు, రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో గుర్తింపు కొరవడిన పోలీసు నిఘా
యలమంచిలి : ఇటీవల కాలంగా యలమంచిలి పట్టణం, పరిసర ప్రాంతాల్లో నకిలీ కరెన్సీ నోట్లు హల్‌చల్ చేస్తున్నాయి. రూ.500, రూ.1,000 నోట్లను చూస్తేనే ఇక్కడ వ్యాపారులు, ప్రజలు హడలిపోతున్నారు. బాగా తెలిసినవారైనా సరే ఈ నోట్లు ఇస్తే వ్యాపారులు ఒకటికి పదిసార్లు సరిచూసుకుంటున్నారు. వీటి బెడదతో కరెన్సీ నోట్లు అసలో? నకిలీయో? నిర్ధారించే పరికరాలను పలువురు వ్యాపారులు కొనుగోలు చేసుకుంటున్నారు. దీనిని బట్టి యలమంచిలి ప్రాంతంలో నకిలీ కరెన్సీ నోట్ల చలామణి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మూడేళ్లుగా ఇక్కడ పెద్ద ఎత్తున నకిలీ కరెన్సీ చేతులు మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. పట్టణంలో జల్సాలకు అలవాటు పడిన కొందరు యువకులకు నకిలీ నోట్ల ముఠా సభ్యులు భారీగా ఆశ చూపుతున్నట్టు కూడా చెప్పుకుంటున్నారు. రూ.10వేల అసలు నోట్లకు రూ.40 వేల నకిలీ కరెన్సీ ఎరచూపుతున్నారని, ఏజెంట్లు కొందరు అమాయకులైన యువకులను కూడా ఈ ఉచ్చులోకి లాగుతున్నారని తెలిసింది.
వారపు సంతలు, నగల దుకాణాలు, ప్రైవేట్ చిట్టీ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, పెట్రోల్ బంకులు, కూరగాయల దుకాణాలు, హోల్‌సేల్ వ్యాపారులకు దొంగనోట్లు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. నకిలీ కరెన్సీ చలామణితో సంబంధం ఉన్న కొందరు బాగా సంపాదించుకుంటున్నట్టు పట్టణంలో చర్చించుకుంటున్నారు. కొన్నేళ్ల క్రితం రోడ్డుపై కన్పించిన పరిచయస్తులను రూ.10 ఉంటే ఇవ్వండి సార్.. అంటూ చేయిచాచే ఒక యువకుడు నేడు రెండు అపార్ట్‌మెంట్లలో ప్లాట్లు కొనుగోలు చేయడం, తరచూ సరికొత్త ద్విచక్ర వాహనాలు కొనుగోలు చేసి విలాసవంతమైన జీవితం గడపడం వెనుక నకిలీ దందా ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. దొంగనోట్ల చలామణిపై పత్రికల్లో వార్తలొచ్చినప్పుడల్లా ఇంటిలిజెన్స్, స్పెషల్ బ్రాంచి పోలీసులు ఆరా తీయడం, సరైన ఆధారాలు దొరక్కపోవడంతో మిన్నకుండటం జరుగుతోంది.
పోలీసు భాషలో నకిలీ నోట్ల చెలామణి
కేసును గ్రేవ్ (పెద్ద నేరం)గా పరిగణిస్తారు. ఒకటి, రెండు నోట్లేకదా.. అని పోలీసులు తేలిగ్గా తీసుకుంటున్నారన్న విమర్శలున్నాయి. బ్యాంకులకు వచ్చే నకిలీ నోట్లపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఈ వ్యవహారంపై పోలీసులు పకడ్బందీగా ముందుకు వెళ్లేందుకు అవరోధాలు ఏర్పడుతున్నాయి.