ఓ వాహనదారుడు పోలీసులకు టోకరా వేశాడు.
మర్రిపాలెం (విశాఖపట్నం): ఓ వాహనదారుడు పోలీసులకు టోకరా వేశాడు. జరిమానాగా రూ.100ల నకిలీ నోట్లు అప్పగించి బురిడీ కొట్టించాడు. ఈ వింత అనుభవం విశాఖ నగరంలోని బిర్లా జంక్షన్‌లోని కంచరపాలెంలో ట్రాఫిక్ పోలీసులకు ఎదురైంది. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న ఓ వాహనదారుడిని ట్రాఫిక్ పోలీసులు ఆపారు. తగిన పత్రాలు చూపకపోవడంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించాడని ఎస్‌ఐ కేసు నమోదు చేశాడు. అపరాధ రుసుంగా రూ.200 చెల్లించడంతో విడిచిపెట్టారు.
పోలీస్ స్టేషన్‌లో డబ్బు అప్పగించే సమయంలో పరిశీలించగా ఆ నోట్లు నకిలీవిగా నిర్థారించారు. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. నకిలీ నోట్లు అని తెలిసి అపరాధ రుసుం చెల్లించాడా? లేక సదరు వాహనదారుడికి ఎవరైనా నకిలీ నోట్లు అంటగట్టారా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ ఆధారంగా అతడి వివరాలు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు.