ఆదోని టౌన్, న్యూస్‌లైన్: సబ్‌జైలులోని రిమాండ్ ఖైదీని తప్పించిన నకిలీ పోలీసుల గుట్టు రట్టయింది. దురాశకు పోయిన ఓ న్యాయవాది, కోర్టు క్లర్కు, కానిస్టేబుల్‌తో పాటు మరో నలుగురు ఈ కేసులో కటకటాలపాలయ్యారు. ఆదోనిలో డీఎస్పీ శివరామిరెడ్డి శుక్రవారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరి వివరాలను వెల్లడించారు. ఆదోని సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మహేష్‌ను గత నెల 17వ తేదీన పోలీసుల వేషధారణలోని ఇరువురు యువకులు నకిలీ పీటీ వారెంట్‌తో తప్పించడం తెలిసిందే.
20న సబ్‌జైలు సూపరింటెండెంట్ రత్నం ఫిర్యాదు మేరకు సీఐ శ్రీధర్ కేసు నమోదు చేశారు. కేసును ఛేదించేందుకు సీఐ, ఎస్‌ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు మహేష్‌ను తప్పించేందుకు సహకరించిన ఏడుగురిని శుక్రవారం అతని బావ శాంతరాజ్ ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. జైలులోని మహేష్‌ను కలిసేందుకు ఆదోని అరుణ్‌జ్యోతినగర్‌లో ఉంటున్న శాంతరాజ్ రోజూ సబ్‌జైలుకు వచ్చేవాడు. ఇలా అతనికి సెల్‌ఫోన్ అందజేశాడు. దానితో మహేష్ ఎమ్మిగనూరుకు చెందిన ముల్లాఖాజా, వెల్దుర్తి మండలం క్రిష్ణాపురానికి చెందిన న్యాయవాది సుంకిరెడ్డి, కల్లూరు మండలం పందిపాడుకు చెందిన హనుమంతుతో ఫోన్‌లో మాట్లాడుతూ జైలు నుంచి తప్పించుకునేందుకు పథకం రచించాడు.
న్యాయవాది సుంకిరెడ్డి నకిలీ పోలీస్‌గా, హనుమంతు హోంగార్డుగా యూనిఫాం ధరించి తనకు సహకరిస్తే ఒక్కొక్కరికి రూ.5లక్షలు ఇస్తానని ఆశ చూపాడు. నంద్యాల కోర్టులో క్లర్క్‌గా పని చేస్తున్న మధుసూదన్‌కు నకిలీ పీటీ వారెంట్ తీసుకొస్తే రూ.3లక్షలు ఇస్తానని ఎరవేశాడు. కారు డ్రైవర్ కృష్ణకు రూ.50వేలు ఇస్తానని నమ్మబలికాడు. పోలీస్ యూనిఫాం అందజేసిన మాధవరం పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ రఘునాథ్‌కు రూ.50వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. పక్కా ప్రణాళికతో మహేష్ గత నెల 17న ఆదోని సబ్‌జైల్ నుంచి తప్పించుకున్నాడు. జైలు నుంచి బయటకొచ్చిన మహేష్, అతని బావ శాంతరాజ్, నకిలీ పోలీసులు ఆర్టీసీ బస్సులో మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడి నుంచి డ్రైవర్ కృష్ణకు చెందిన ఇండికా కారులో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు.
అయితే 20 రోజులు గడుస్తున్నా ఒక్క పైసా కూడా చేతికందకపోవడంతో ఈ పథకంలో సహకరించిన ఏడుగురు.. మహేష్ బావ శాంతరాజ్ ఇంటికి చేరుకున్నాడని తెలిసి శుక్రవారం అతనితో గొడవకు దిగారు. అయితే అప్పటికే నిఘా వేసిన పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఎమ్మిగనూరు కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ కేసులో కీలకమైన నిందితులను అరెస్టు చేసిన సీఐ, ఎస్‌ఐలతో పాటు పోలీసులు చిన్న హుసేని, రాజశేఖర్, నాగరాజు, రవిలకు రివార్డులు అందజేసేందుకు ఎస్పీకి నివేదిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.