sub-jail
-
హమ్మయ్య.. ఒకడు దొరికాడు!
పరారీ ఖైదీ అరెస్ట్ తాడేపల్లిగూడెం రూరల్ : తాడేపల్లిగూడెం సబ్‌జైలు నుంచి పరారైన ఇద్దరు రిమాండ్ ఖైదీల్లో ఒకరిని అరెస్టు చేసినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. గురువారం వారు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పలు చోరీలకు పాల్పడిన నేరంపై స్థానిక సబ్‌జైలుకు సిర్రపు గణేష్, బుగత శివను రిమాండ్‌కు తరలించారు. ఈనెల 10న వీరు సబ్‌జైలు గోడ దూకి పరారయ్యారు. వీరిలో బుగత శివను బుధవారం చేబ్రోలు రైల్వేస్టేషన్ సమీపంలో సీఐ మూర్తి ఆధ్వర్యంలో పట్టణ ఎస్సై సీహె చ్ ఆంజనేయులు అరెస్టు చేశారు. గురువారం తాడేపల్లిగూడెం కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. శివను తణుకు సబ్‌జైలుకు తరలించినట్టు పట్టణ పోలీసులు తెలిపారు. -
ప్రశాంత నిలయంగా స్పెషల్ సబ్‌జైల్
కాకినాడ లీగల్æ: కాకినాడలో ఒక స్పెషల్ సబ్‌జైల్ ఉంది. ఇక్కడ ఖైదీలకు స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఆధునాతన వసతులు కల్పించారు. నేర స్వభావం నుంచి సమాజంలో గౌరవంగా బతికే విధంగా ఖైదీలలో మార్పు తీసుకొచ్చేందు జైలు అధికారులు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సబ్‌జైలు పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంటుంది. లోపలకు వెళితే ఇదొక జైలులా కాక సంస్కరణ కేంద్రంగా తలపించేలా ఉంటుంది. విశాలమైన గదులతోపాటు ఫ్యానులు ఉంటాయి. ఓంశాంతివారితో ఉదయం శాంతిసందేశంతోపాటు యోగా చేయిస్తున్నారు. జైలు లోక్ అదాలత్ నిర్వహించి కేసులను పరిష్కరిస్తారు. న్యాయ విజ్ఞాన సదస్సులు నిర్వహించి వివిధ అంశాలపై ఖైదీలకు అవగాహన కల్పిస్తున్నారు. మినరల్ వాటర్, రైస్ కుక్కర్లు, డైనింగ్ టేబుళ్లు, గార్డెన్, çషవర్‌బాత్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఖైదీల కోసం వచ్చే బంధు, మిత్రులకు కూర్చోడానికి షెల్టర్, మంచినీరు ఏర్పాటు చేశారు. ఉదయం లేచింది మొదలు సాయంత్రం వరకు ఎవరి పనులు వారు చకచక చేసుకుపోతారు. ఇటీవలే జైలు శాఖ జిల్లాలో స్పెషల్ సబ్‌జైల్‌కు అంబులెన్స్ సౌకర్యం కల్పించింది. అయితే అంబులెన్స్‌కు డ్రైవర్‌ను నియమించాల్సి ఉంది. ఖైదీల మెనుల్లో మార్పులు ఉదయం టిఫిన్, వారంలో రెండు రోజులు చపాతి, అందులో బంగాళదుంప కూర, మరో రెండు రోజులు గోదుమనూక, వరినూక ఉప్మా, రెండురోజులు పులిహోర, ఒక రోజు పొంగలి పెడుతున్నారు. నెలలో మొదటి ఆదివారం మధ్యాహ్నం మేక మాంసం, రెండు, మూడు, నాలుగు వారాలు కోడిమాంసం, మంగళవారం కోడిగుడ్డు ఇస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు రెండేసి రోజులు కందిపప్పు, శనగపప్పు, పెసరప్పుతో పాటు ఆకు కూర పెడుతున్నారు. సాయంత్రం కాయకూరల భోజనం పెడుతున్నారు. సత్ప్రవర్తనకు కృషి ఖైదీల ఆలోచనా విధానంలో మార్పు వచ్చేలా స్నేహభావంతో వ్యవహరిస్తున్నాం. మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు వారానికి రెండు రోజులు కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు వీలుగా ఫోన్ సౌకర్యం కల్పించాం. ఆశ్రమ వాతావరణం కల్పించి వారిలో సత్ప్రవర్తను తెచేందుకు కృషి చేస్తున్నాం. – కె.చిన్నారావు, జిల్లా సబ్‌జైలు అధికారి ప్రతిరోజు పర్యవేక్షిస్తున్నాం విధి నిర్వహణ, సేవాభావంతో నిరంతరం ఖైదీల సంక్షేమం కోసం పనిచేయడమే మా నిత్య విధి.అలాగే ఖైదీలకు పెట్టే భోజనం గురించి, ఖెదీల ఆరోగ్యం గురించి ప్రతి రోజు పర్యవేక్షిస్తాం. వారికి కావలసిన వసతులు కోసం నిరంతరం కృషి చేస్తున్నాం. – బి.బ్రహ్మయ్య, జైలర్, స్పెషల్ సబ్‌జైలు -
సబ్ జైలు నుంచి ఖైదీ పరారీ
రేపల్లె : రేపల్లె పట్టణంలోని సబ్‌జైలు నుంచి బుధవారం రిమాండ్ ఖైదీ పరారయ్యాడు. సబ్ జైలర్ మోహనరావు కథనం ప్రకారం.. సత్తెనపల్లి మండలం బడుగుబండకు చెందిన కుంచాల నాగరాజు దొంగతనం కేసులో 5 నెలల నుంచి రిమాండ్ ఖైదీగా సబ్‌జైలులో ఉంటున్నాడు. బుధవారం మధ్యాహ్నం భోజన అనంతరం మరుగుదొడ్డికని వెళ్లిన నాగరాజు ఎంతకూ రాలేదు.Sఅనుమానం వచ్చి మరుగుదొడ్డిలో చూడగా నాగరాజు కనిపించలేదని, చుట్టు పక్కల వెతికినా ఫలితంలేదన్నారు. మరుగుదొడ్డికి వెళ్లే నెపంతో పక్కనే ఉన్న గోడ దూకి పారిపోయాడని గ్రహించి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామని మోహనరావు తెలిపారు. అతని కోసం విస్తత గాలింపు చర్యలు చేపట్టినట్టు చెప్పారు. -
నకిలీ పోలీసుల ఆటకట్టు
ఆదోని టౌన్, న్యూస్‌లైన్: సబ్‌జైలులోని రిమాండ్ ఖైదీని తప్పించిన నకిలీ పోలీసుల గుట్టు రట్టయింది. దురాశకు పోయిన ఓ న్యాయవాది, కోర్టు క్లర్కు, కానిస్టేబుల్‌తో పాటు మరో నలుగురు ఈ కేసులో కటకటాలపాలయ్యారు. ఆదోనిలో డీఎస్పీ శివరామిరెడ్డి శుక్రవారం టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వీరి వివరాలను వెల్లడించారు. ఆదోని సబ్‌జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన మహేష్‌ను గత నెల 17వ తేదీన పోలీసుల వేషధారణలోని ఇరువురు యువకులు నకిలీ పీటీ వారెంట్‌తో తప్పించడం తెలిసిందే. 20న సబ్‌జైలు సూపరింటెండెంట్ రత్నం ఫిర్యాదు మేరకు సీఐ శ్రీధర్ కేసు నమోదు చేశారు. కేసును ఛేదించేందుకు సీఐ, ఎస్ఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు మహేష్‌ను తప్పించేందుకు సహకరించిన ఏడుగురిని శుక్రవారం అతని బావ శాంతరాజ్ ఇంటి వద్ద అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. జైలులోని మహేష్‌ను కలిసేందుకు ఆదోని అరుణ్‌జ్యోతినగర్‌లో ఉంటున్న శాంతరాజ్ రోజూ సబ్‌జైలుకు వచ్చేవాడు. ఇలా అతనికి సెల్‌ఫోన్ అందజేశాడు. దానితో మహేష్ ఎమ్మిగనూరుకు చెందిన ముల్లాఖాజా, వెల్దుర్తి మండలం క్రిష్ణాపురానికి చెందిన న్యాయవాది సుంకిరెడ్డి, కల్లూరు మండలం పందిపాడుకు చెందిన హనుమంతుతో ఫోన్లో మాట్లాడుతూ జైలు నుంచి తప్పించుకునేందుకు పథకం రచించాడు. న్యాయవాది సుంకిరెడ్డి నకిలీ పోలీస్‌గా, హనుమంతు హోంగార్డుగా యూనిఫాం ధరించి తనకు సహకరిస్తే ఒక్కొక్కరికి రూ.5లక్షలు ఇస్తానని ఆశ చూపాడు. నంద్యాల కోర్టులో క్లర్క్‌గా పని చేస్తున్న మధుసూదన్‌కు నకిలీ పీటీ వారెంట్ తీసుకొస్తే రూ.3లక్షలు ఇస్తానని ఎరవేశాడు. కారు డ్రైవర్ కృష్ణకు రూ.50వేలు ఇస్తానని నమ్మబలికాడు. పోలీస్ యూనిఫాం అందజేసిన మాధవరం పోలీస్‌స్టేషన్‌లో పని చేస్తున్న కానిస్టేబుల్ రఘునాథ్‌కు రూ.50వేలు ఇచ్చేందుకు ఒప్పందం చేసుకున్నాడు. పక్కా ప్రణాళికతో మహేష్ గత నెల 17న ఆదోని సబ్‌జైల్ నుంచి తప్పించుకున్నాడు. జైలు నుంచి బయటకొచ్చిన మహేష్, అతని బావ శాంతరాజ్, నకిలీ పోలీసులు ఆర్టీసీ బస్సులో మహబూబ్‌నగర్ జిల్లా సరిహద్దుకు చేరుకున్నారు. అక్కడి నుంచి డ్రైవర్ కృష్ణకు చెందిన ఇండికా కారులో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. అయితే 20 రోజులు గడుస్తున్నా ఒక్క పైసా కూడా చేతికందకపోవడంతో ఈ పథకంలో సహకరించిన ఏడుగురు.. మహేష్ బావ శాంతరాజ్ ఇంటికి చేరుకున్నాడని తెలిసి శుక్రవారం అతనితో గొడవకు దిగారు. అయితే అప్పటికే నిఘా వేసిన పోలీసులు వీరందరినీ అదుపులోకి తీసుకున్నారు. నిందితులను ఎమ్మిగనూరు కోర్టులో హాజరుపరిచారు. రాష్ట్రంలోనే సంచలనం సృష్టించిన ఈ కేసులో కీలకమైన నిందితులను అరెస్టు చేసిన సీఐ, ఎస్ఐలతో పాటు పోలీసులు చిన్న హుసేని, రాజశేఖర్, నాగరాజు, రవిలకు రివార్డులు అందజేసేందుకు ఎస్పీకి నివేదిస్తున్నట్లు డీఎస్పీ వెల్లడించారు.