సైలెన్సర్లను మార్పు చేసిన బుల్లెటు
గుంటూరు: ఇష్టానుసారంగా బుల్లెట్లను మార్పులు, చేర్పులు చేస్తూ రోడ్లపై మితి మీరిన వేగంతో హల్‌చల్ సృష్టిస్తున్న వాహనాలపై పోలీస్, రవాణా శాఖాధికారులు డేగకన్ను వేశారు. జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగాబుల్లెట్లకు పెద్దగా శబ్దం వచ్చేలా నకిలీ సైలెన్సర్లను ఏర్పాటు చేసి ‘మోత మోగిస్తున్నారు’ శీర్షికతో బుధవారం ’సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై ఆయా శాఖల ఉన్నతాధికారులు సీరియస్‌గా స్పందించారు. అర్బన్, రూరల్ జిల్లాల ఎస్పీలు సీహెచ్ విజయారావు, సీహెచ్ వెంకటప్పల నాయుడులు సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ’సాక్షి’ పత్రికలో ప్రచురితమైన విధంగా రోడ్లపై వాహనాలు నడుస్తున్నట్లు, నకిలీ సైలెన్సర్లు తయారీ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
ఒక వేళ అలాంటివి ఎక్కడ ఉన్నా వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పారు. ఎస్పీల ఆదేశాల మేరకు పోలీసులు బుల్లెట్ల రాకపోకలపై దృష్టి సారించారు. అదే విధంగా డీటీసీ రాజారత్నం కూడా స్పందించి బుల్లెట్ల రాకపోకలపై నిఘా ఉంచి సైలెన్సర్లు మార్పు చేసిన వాహనాలను సీజ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఓ వైపు పోలీసులు, మరో వైపు రవాణా శాఖాధికారులు ప్రధాన రహదారులపై నిఘా పెట్టడంతో భారీ శబ్దంతో పాటు మితిమీరిన వేగంతో నిబంధనలను బేఖాతరు చేస్తున్న వాహన యజమానులు బుధవారం తమ బుల్లెట్లను రోడ్డెక్కెనివ్వలేదు. జిల్లాలోని మంగళగిరి, తెనాలి, గుంటూరు, నరసరావుపేట ప్రాంతాల్లో కూడా సైలెన్సర్లను మార్పు చేసిన యువత వాహనాలను బయటకు తీసే సాహసం చేయలేదు.
దుకాణాల మూసివేత
’సాక్షి’లో ప్రచురితమైన కథనం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గంటల వ్యవధిలోనే రెండు శాఖల అధికారులు రంగంలోకి దిగడంతో నకిలీ వ్యాపారులు, మెకానిక్‌ల గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఎక్కడ తమ పేరు బయటకు వస్తుందోనని హడలిపోతున్నారు. తెనాలికి చెందిన మెకానిక్ తన దుకాణంలో ఉన్న సైలెన్సర్లను హడావుడిగా రహస్య ప్రాంతాలకు తరలించాడు. తన పేరు బయటకు రాకుండా ఉంచేందుకు పోలీస్ అధికారులతో మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. అందుకు ప్రతిఫలం కూడా చెల్లించేందుకు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అతన్ని తప్పించేందుకు పోలీస్ అధికారులు భరోసా ఇచ్చి వెంటనే దుకాణం మూయించి వేసి పంపినట్లు సమాచారం.
ఇదే తరహాలో విజయవాడలోని నకిలీ సైలెన్సర్లు విక్రయిస్తున్న వ్యాపారికి కూడా సమాచారం అందించడంతో అతను కూడా దుకాణంలో ఉన్న వాటిని అతని గోడౌన్‌కు తరలించినట్లు తెలిసింది. మంగళగిరి, నరసరావుపేటల్లోని మెకానిక్‌లు వారు సైలెన్సర్లు విక్రయించిన బుల్లెట్ల యజమానులకు సమాచారం అందించి బయటకు బుల్లెట్‌ను తీసుకురావద్దని చెప్పి వారు దుకాణాలను మూసి వేశారు. ఏది ఏమైనా రెండు శాఖల ఉన్నతాధికారులు ఇదే విధానంలో నిఘా కొనసాగించేలా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే రోడ్డుపై వాహనాలు ప్రశాంతంగా రాకపోకలు కొనసాగించడంతో పాటు గుండెజబ్బు రోగులకు కొంత ఊరట నిచ్చినట్లు ఉంటుందని ప్రజలు వాపోతున్నారు. నిబంధనలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర వాసులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment