పోలీస్ స్టేషన్‌లో సర్వే చేసిన యువకులు
శ్రీకాకుళం , ఇచ్ఛాపురం రూరల్/ఇచ్ఛాపురం: సర్వేల పేరుతో ప్రతిపక్ష పార్టీకి సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు అధికార పార్టీ నేతలు మరో అడుగు ముందుకు వేశారు. వైఎస్సార్‌సీపీ బలం గా ఉన్న గ్రామాల్లోకి యువకులను పంపించి, సర్వేల పేరుతో ఆ పార్టీకి అనుకూలంగా ఉన్న వారి ఓట్లను తొలగించడమే లక్ష్యంగా పెట్టుకొంది. దీంతో విషయాన్ని తెలుసుకున్న గ్రామస్తులు ఆరా తీయడంతో అసలు విషయం బయటపడింది. వివరాల్లోకి వెళ్తే... ఇచ్ఛాపురం మండలం హరిపురం గ్రామానికి గుంటూరుకు చెందిన ‘పబ్లిక్ పాలసీ రీసెర్చ్ గ్రూప్’ పేరుతో బీటెక్ చదివిన యువకులు పి.దాస్(కర్నూలు), కె.విజ యకుమార్(అనంతపురం), కె.రోసిరెడ్డి(ఒంగో లు), కె.వినోద్, ఎస్‌కే ఫిరోద్, బి.అయ్యప్ప(గుంటూరు) సర్వేల పేరుతో ప్రతి ఇంటింటికీ సోమవారం వెళ్లారు. ‘మీరు ఏ పార్టీకి చెందిన వారు? వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటు వేస్తారు?’ అంటూ ఓటు కార్టు, ఆధార్‌కార్డు, ఫోన్ నంబర్ వివరాలను తమ వెంట తెచ్చుకున్న ట్యాబ్‌ల్లో నమోదు చేస్తుండటంతో స్థానికులకు అనుమా నం కలిగింది. దీంతో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నేత వడ్డిన తేజా, మున్సిపాలిటీకి చెందిన కాళ్ల భాను సర్వేను అడ్డుకొని వారిని ఇచ్ఛాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నియోజక సమన్వయకర్త పిరియా సాయిరాజ్, కవిటి, ఇచ్ఛాపురం మండల, మున్సి పాలిటీకి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు హుటాహుటిన పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు.
ఓటమి భయంతోనే..
దీనిపై పోలీసులు యువకులను ఆరా తీయగా.. తామంతా ‘పబ్లిక్ పాలసీ రీసెర్చ్ సంస్థ’కు చెందిన రాజకీయ సర్వే చేసేందుకు నియోజకవర్గానికి వచ్చామని తెలిపారు. సర్వే చేసినందుకు రోజుకు ఒక్కొక్కరికి రూ.800లు ఇచ్చేందుకు ఒప్పందంపై ట్యాబుల్లో సర్వే చేస్తున్నామని అంగీకరించారు. తామంతా ఇచ్ఛాపురం పట్టణంలోని ఓ లాడ్జీలో ఉంటూ ఈ సర్వేను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై పిరియా సాయిరాజ్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ప్రజల్లో బలంగా ఉన్న వైఎస్సార్ సీపీ ఓటర్లను తొలగించడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం బోగస్ సర్వేల పేరిట ఇటువంటి చర్యలకు పాల్పడుతుందని ఆరోపించపారు. ప్రభుత్వానికి ఓటమి భయం పట్టుకుందని, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర విజయవంతమైన నేపథ్యంలో టీడీపీ ప్రత్యేకంగా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో 17 మందితో కూడిన సర్వే చేస్తుందన్నారు. కేవలం ప్రతిపక్షానికి సానుభూతిపరుల ఇళ్లకు మాత్రమే వెళ్లి, వారి వివరాలు సేకరించినట్లు ఈ ట్యాబులే రుజువని పేర్కొన్నారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఇటువంటి సర్వేలను తిప్పికొట్టాలని సూచించారు. అలాగే ఎన్నికల కమిషన్ ఈ సర్వేలపై స్పందించి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ పిట్ట ఆనంద్, పిలక సంతు, ఉప్పాడ చినబాబు, పిలక యాదవరెడ్డి, శ్యామ్‌పురియా, రజనీకుమార్ దొళాయి, ఆదిరెడ్డి, బర్ల నాగభూషణ్ తదితరులు పల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment