విజయనగరం మున్సిపాలిటీ : గట్టిగా గాలి వీచినా.. జోరు వర్షం కురిసి నా... ఎండలు మండినా.. వానలు కురవడం ఆలస్యమైనా.. విద్యుత్ సరఫరాలో కోతలే.. కోత లు. ఇదేమని అడిగితే అవసరానికి తగ్గ విద్యుత్ ఉత్పత్తి జరగటం లేదు.. గట్టిగా అడిగితే మాకేం తెలియదు కోతలన్నీ పై నుంచే... ఇదీ విద్యుత్ యంత్రాంగం నుంచి ఎదరవుతున్న సమాధానం. ఇక ఇటువంటి సమాధానాలకు చెక్ పడనుంది. అక్టోబర్ 2 నుంచి గృహ, పారిశ్రామిక రంగానికి వారి అవసరాల కోసం 24 గంటల విద్యుత్, వ్యవసాయానికి ఏడు గంటల విద్యుత్ సరఫరా అంది స్తామని సర్కారు ప్రకటించిం ది. ఇందుకు వినూత్న విధానాన్ని అమలు చేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఇకపై విద్యుత్ కోతలపై మాకేం తెలియదన్న సమాధానానికి చెల్లు చీటి పడనుంది. సిబ్బంది నిర్లక్ష్యాన్ని కూడా శాఖపై నెట్టేసే పరిస్థితికి తెరపడనుంది. జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) పరిధిలో విద్యుత్ సర్వీసులు 5లక్షల 70వేల వరకు ఉన్నట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. వీటన్నింటికి అక్టోబర్ 2 నుంచి 24 గంటల విద్యుత్ అందించాలన్నది సర్కా రు లక్ష్యం. జిల్లాలోని సుమారు 25 వేల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు ఏడు గంటల పాటు సరఫరా అం దించాలన్నది ఉద్దేశం. ఈ హమీ సమర్థ అమలుకు సంబంధించి న కసరత్తు చురుగ్గా సాగుతోంది.
తప్పుడు వివరాల నమోదు ఇక చెల్లదు..
ఇది వరకు సాంకేతిక లోపా లు, మరమ్మత్తుల పేరిట ఎడాపెడా కోతలు విధించే వారు. ఉన్నతాధికారుల కు వివరణ ఇచ్చుకోవాలన్న నెపంతో వీటిలో కొన్నిం టిని మాత్రమే ఉప కేంద్రం వద్దనున్న రిజిస్టర్‌లో నమోదు చేసేవారు. ఇప్పుడా పరిస్థితి ఉండదు. సిబ్బంది సేవల్లో లోపాల వల్ల విద్యుత్ సరఫరా నిలిపితే అందుకు గల కారణం కచ్చితంగా చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉప కేంద్రాల్లో ప్రత్యేక మీటర్లతో పాటు సిమ్ కార్డులున్న మోడెంలు ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ఆన్‌లైన్ ద్వారా అనుసంధానం చేయటం ద్వారా ఎంత సమయం సరఫరా ఉంది. ఎంత సమయం సరఫరా నిలిచిపోయిందన్న సమాచారం ఉపకేంద్రాల వారీగా కంప్యూటర్ ముందు కూర్చుంటే తెలిసిపోతుంది. కార్పొరేషన్ కార్యాల యంలో ఉన్న సర్వర్‌కు మోడెం కనె క్ట్ కావడం ద్వారా రాష్ట్ర వ్యాప్త నెట్‌వర్క్ అనుసంధానమై ఉంటుంది. విద్యుత్ సరఫరా ఉన్న సమయం పచ్చగా, విద్యుత్ లేని సమయం ఎర్రటి చారతో నిమిషాలు, సెక్షన్ ల తో సహా కంప్యూటర్‌లో చూపుతుంది. కింద స్థాయి అధికారి నుంచి ఉన్నతాధికారుల వరకు, ముఖ్యమంత్రి కూడా ఆన్‌లైన్‌లో గ్రామంలో విద్యుత్ సరఫరా 24 గంటలు ఇచ్చారా? లేదా? అనే విషయం తెలుసుకోవచ్చు.
జిల్లాలో 83 సబ్‌స్టేషన్ల పరిధిలో...
ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ పరిధిలో మొత్తం 83 సబ్‌స్టేషన్‌లు ఉండగా.. అందులో 299 ఫీడర్‌ల ద్వారా వ్యవసాయ, గృహావసర విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. ఇందులో విజయనగరం, బొబ్బిలి, పార్వతీపురం, సాలూరు మున్సిపాలిటీల్లో 54 ఫీడర్లు ఉండగా వాటి ద్వారా వినియోగదారులకు అందించే సేవలను ఇప్పటికే ఆన్‌లైన్‌కు అనుసంధానం చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మరో 245 ఫీడర్లకు సంబంధించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అనుసంధానం చేస్తున్నారు. దాదాపు అన్ని ఫీడర్లకు ఈ ప్రక్రియను పూర్తి చేయగా.. చిన్నపాటి లోపాలను సరిదిద్దే పనిలో ఉన్నారు.
లోపాలను అధిగమించడమే ధ్యేయం
గృహ, వ్యవసాయ అవసరాలకు 24 గంటల విద్యుత్ సరఫరా చేయడమే ధ్యేయంగా విద్యుత్ శాఖలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నాం. ప్రభుత్వం అక్టోబర్ 2 నుంచి రెండు సర్వీసులకు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో విద్యుత్ లోపాలు అధిగమించే క్రమంలో మోడెం విధానం అమలు చేస్తున్నాం. జిల్లాలో దాదాపు అన్ని ప్రాంతాల్లో ఈ ప్రక్రియ పూర్తి చేశాం. పలు ప్రాంతాల్లో చిన్నపాటి సాంకేతిక ఆటంకాలు ఉన్నాయి వాటిని కూడా సరి చేస్తున్నాం. ఈ ప్రక్రియ అంతా పూర్తయితే అంతా పారదర్శకంగా సాగుతోంది.
- సి.శ్రీనివాసమూర్తి, ఎస్‌ఈ, ఏపీఈపీడీసీఎల్, విజయనగరం ఆపరేషన్ సర్కిల్
తప్పుడు ప్రకటనలకు ఇక చెక్
Published Mon, Sep 8 2014 1:37 AM | Last Updated on Wed, Sep 5 2018 3:38 PM
Advertisement
Advertisement