ఇంటికి స్టిక్కర్లు అతికిస్తున్న డ్వాక్రా మహిళలు(ఫైల్) , ప్రచారం కోసం స్టిక్కర్లు
బద్వేలు: ముఖ్యమంత్రి ప్రచార యావను చూసి ప్రజలు విస్తుపోతున్నారు. ఇదేం బడాయంటూ నవ్వుకుంటున్నారు. మనం ఎవరికైనా మేలు చేస్తే సాయం పొందిన వ్యక్తులు కృతజ్ఞతలు చెబుతారు. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు వింతగా ఉంది. సీఎం చంద్రబాబు చేసింది గోరంత చెప్పుకునేది కొండంతగా మారింది. దీంతో పాటు మరీ కోరి కృతజ్ఞతలు చెప్పించుకుంటున్నారని మహిళలు గుసగుసలాడుకుంటున్నారు. సీఎం తీరుతో అధికారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని గాలికొదిలి డ్వాక్రా సంఘాలను నట్టేట ముంచారు. మాఫీ చేస్తారనే ఉద్దేశంతో వారు కంతులు కట్టడం మానేశారు. దీంతో వడ్డీలు, వాటి మీద జరిమానాలు కలిసి తడిపి మోపెడయ్యాయి. ఈ నేపథ్యంలో చాలా సంఘాలు నిర్వీర్యం కాగా మరికొందరు మధ్యలోనే సంఘాలను నుంచి వైదోలగాల్సి వచ్చింది.
పసుపు, కుంకుమ పేరుతో రూ.10 వేలు :
ఈ నేపథ్యంలో డ్వాక్రా మహిళలు బాబు సర్కారుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని తప్పించుకుని వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఒక్కో సభ్యురాలికి పెట్టుబడి నిధి (పసుపు, కుంకుమ) పేరుతో రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. తీరా సంతోషించే లోపు దీన్ని ఒకే పర్యాయం ఇవ్వడం లేదని నాలుగు విడతలుగా ఇస్తామని చెప్పారు. ఏటా రెండు వేల రూపాయలు వంతున ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఏడాది నాలుగో విడత నిధులు విడుదల చేశారు. ఇందులో కూడా చాలా సంఘాల సభ్యులకు ఇవి కూడా అందలేదు. ఇచ్చిందే అంతంతమాత్రం. మళ్లీ ప్రకటనలు, ప్రచార్భాటాలు చేస్తుండటంపై ఇప్పటికే బాబు సర్కారుపై తీవ్ర విమర్శలున్నాయి.
ఇంటింటికి డప్పు :
రెండు నెలల కిందట నాలుగో విడత నిదులు మంజూరు చేశారు. జిల్లాలో 32 వేల సంఘాలుండగా వాటిలో 3,21,473 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. 2018 అక్టోబరులో నాలుగో విడతకుగాను రూ.64.29 కోట్లు అవసరం. తామేదో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు కలరింగ్ ఇవ్వడం ప్రారంభించారు. ‘ఆడపడుచులకు ధన్యవాదాలు... ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు... సీఎం సర్‌కు ధన్యవాదాలు’ అనే స్టిక్కర్లను పంపిణీ చేసి ప్రతి డ్వాక్రా మహిళ ఇంటికి అంటించమని ఆదేశించారు. అసలు నిధులే అందని వారు చాలా మంది ఉన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో ఆశలుపెట్టి అప్పుల పాలు చేశారని, ఇప్పుడు స్టిక్కర్లు ఏంటని పలువురు నిలదీస్తున్నారు. దీంతో సంఘాల లీడర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.
బలవంతపు అభినందనలు :
దీంతో పాటు గ్రామ సహాయకుల జీతాలు పెంచామని, డ్వాక్రా సంఘాల వీఓలకు గౌరవ వేతనం పెట్టామని.. ఇలా రకరకాల వర్గాలతో సీఎం చంద్రబాబు చిత్ర పటాలకు బలవంతపు క్షీరాభిషేకాలు చేయిస్తున్నారు. జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి విజయవాడకు వీఆర్‌ఏలను తరలించి అభినందన సభ ఏర్పాటు చేయించుకున్నారు. తాము అడిగిన దానిలో కనీసం 50 శాతం కూడా చేయకుండానే తమతో అభినందన సభలు ఆయా వర్గాల ప్రజలు వాపోతున్నారు. డ్వాక్రా మహిళలు, మెప్మా సిబ్బందితో కూడా క్షీరాభిషేకాలు చేయించుకున్నారు. తమకు ఇష్టం లేకున్నా అడిగి మరీ డప్పు కొట్టించుకుంటున్నారని ఆయా వర్గాలు చర్చించుకుంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment