హైదరాబాద్ : నాచారం పరిధిలోని సప్తగిరి లాడ్జిలో శనివారం ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేశారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల ప్రకారం... సరూర్ నగర్ మండలం హస్తినాపూర్‌కు చెందిన శ్రీనివాస్, అనితలు భార్యాభర్తలు. వీరికి సాయికార్తీక్ అనే కుమారుడు ఉన్నాడు. కాగా వీరు శుక్రవారం మధ్యాహ్నం మల్లాపూర్‌లోని సప్తగిరి లాడ్జిలో రూమ్ నెం.114లో దిగారు. ఒక్క రోజే ఉంటామని లాడ్జి నిర్వాహకుడికి చెప్పారు. లాడ్జి రూమ్ శనివారం మధ్యాహ్నం ఖాళీ చేయాల్సి ఉంది. అయితే ఖాళీ చేయాల్సిన సమయం దగ్గరపడటంతో నిర్వాహకులు ఫోన్ చేయగా శ్రీనివాస్ ఎంతకీ స్పందించలేదు. అనుమానం వచ్చి వెళ్లి చూడగా కుటుంబసభ్యులందరూ రక్తపు మడుగులోపడి ఉన్నారు. ఏదో విషం తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లుగా గుర్తించి... హుటాహుటిన వారిని ఈసీఐఎల్‌లోని తులసీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారిలో ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.