పది రోజుల క్రితం ఆ కుటుంబంలో ప్రారంభమైన కలహాలకు తోడికోడళ్లు బలయ్యారు.
గన్నవరం : పది రోజుల క్రితం ఆ కుటుంబంలో ప్రారంభమైన కలహాలకు తోడికోడళ్లు బలయ్యారు. కూలి పనులకు వెళ్లి వచ్చిన తోడికొడళ్లను అత్త గంటల తరబడి ఇంటి బయటే ఉంచడం గొడవలకు దారితీసింది. ఆ రోజు నుంచి వారిమధ్య కొనసాగిన వివాదం ఆత్మహత్యలకు ఉసికొల్పింది. ఇది మండలంలోని బుద్ధవరం శివారులో రాజీవ్‌నగర్ కాలనీలో జరిగిన తోడికోడళ్లయిన మురళీరమణమ్మ, ఝాన్సీల జంట ఆత్మహత్యలకు సంబంధించి పోలీసుల విచారణలో బంధువులు ఈ వివరాలు తెలియజేశారు. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ కేసుకు సంబంధించి దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు.
రెండు మృతదేహాలకు గురువారం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో తహశీల్దార్ ఎం.మాధురి పర్యవేక్షణలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం పోలీసులు మృతదేహాలను బంధువులకు అప్పగించగా, వారు ఇళ్లకు తీసుకువెళ్లారు. బాల్య స్నేహితులు, తోడికోడళ్లయిన మురళీ రమణమ్మ, ఝాన్సి మృతదేహాలకు అంత్యక్రియలను కుటుంబసభ్యులు ఒకేసారి నిర్వహించారు.
పదిరోజుల నుంచే..
ఉమ్మడి కుటుంబంలో అందరూ కలిసిమెలసి ఉంటున్నప్పటికి పదిరోజుల క్రితం ఇంటి వద్ద జరిగిన ఓ సంఘటన అత్త, తోడికొడళ్ల మధ్య చిచ్చుపెట్టింది. ఇద్దరూ కోడళ్లతో పాటు మట్టి పనికి వెళ్లిన అత్త ముందుగానే ఇంటికి చేరుకుంది. అయితే కొడళ్లు ఇంటికి వచ్చినప్పటికీ సుమారు మూడు గంటల పాటు తలుపు తీయకపోవడంతో బయటే వేచి ఉన్నారు. అత్త వైఖరితో వారు విభేదించారు. అప్పటి నుంచి వీరిపై అత్తతో పాటు మామ వేధింపులు మొదలయ్యాయి. క్రమంగా వీరిమధ్య దూరం పెరిగి తరచూ గొడవలు చోటు చేసుకున్నాయి. చివరకు అత్త చిత్రహింసలు తాళలేక క్షణికావేశంలో ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
లొంగిపోయిన అత్తమామలు
కోడళ్ల ఆత్మహత్యకు కారకులైన అత్తమామలు నక్కా భూలక్ష్మి, వెంకటేశ్వరరావులు గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. వీరిని పోలీసులు శుక్రవారం కోర్టులో హాజరుపరచనున్నట్లు సమాచారం.