ఆందోళన చేస్తున్న బంధువులు
సాక్షి, గుంటూరు ఈస్ట్ : జీజీహెచ్ ప్రసూతి వార్డులో డెలివరీ అనంతరం వైద్య సిబ్బంది మృత శిశువుని తల్లికి అప్పజెప్పడంతో బాధిత మహిళ బంధువులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. బాధితుల వివరాల మేరకు.. గుజ్జనగుండ్లలో గోపి, నందిని దంపతులు నివసిస్తున్నారు. నందిని కాన్పు నిమిత్తం ఈ నెల 5వ తేదీ జీజీహెచ్ ప్రసూతి వార్డుకు వచ్చింది. స్కానింగ్ అనంతరం వైద్యులు ఆమెను వార్డులో చేర్చుకున్నారు. అప్పటి నుంచి వరుసగా మూడు రోజులు నందిని కడుపు నొప్పితో బాధపడింది. దీనిపై నందిని తల్లి వైద్యులను సంప్రదించగా ప్రమాదం లేదని చెబుతూ వచ్చారు. మంగళవారం ఉదయం 9 గంటలకు నందినికి స్కానింగ్ చేయాలని వైద్యులు నిర్ధారించారు. అయితే స్కానింగ్ సాయంత్రం 5 గంటలకు చేశారు. అనంతరం అత్యవసరంగా డెలివరీ చేయడంతో మృత శిశువు ప్రసవించింది. నందిని ఆరోగ్యం విషమించడంతో వైద్యులు చికిత్స చేస్తున్నారు. నందిని తల్లిదండ్రులు, బంధువులు ప్రసూతి వార్డు వెలుపల ఆందోళనకు దిగారు. నందిని గర్భంలో శిశువు మృతి చెందడాన్ని వైద్యులు ఆల్యంగా గుర్తించారని ఆరోపించారు.
రూ. 1500 తీసుకున్నారు
నందిని బంధువులు ఆందోళన చేస్తుండగా.. మరో బాలింత బంధువు షేక్ జాన్‌బీ తమకు జరిగిన అన్యాయం గురించి మీడియా ముందు వివరించింది. షేక్ నజ్మా అనే గర్భిణి ఈ నెల మూడో తేదీ ప్రసూతి వార్డులో బిడ్డకు జన్మనిచ్చింది. ఆ సమయంలో వైద్య సిబ్బంది తన వద్ద రూ.1500 తీసుకున్నట్లు జాన్‌బీ ఆరోపించింది.
బిడ్డ వ్యర్థాలు మింగడమే కారణం
శిశువు మృతి చెందడంపై ఆర్‌ఎంవో ఆదినారాయణ వివరణ ఇస్తూ నందిని కాన్పు ఈ నెల ఏడో తేదీగా వైద్యులు నిర్ధారించారని, కడుపులో నొప్పి కారణంగా ఆమెను ఐదో తేదీనే వార్డులో చేర్చుకున్నారని తెలిపారు. గర్భస్థ శిశువు వ్యర్థ పదార్థాలు తీసుకున్న కారణంగా లన్స్‌లోకి ప్రవేశించి మృతి చెందినట్లు వెల్లడించారు. నందిని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment