తూర్పుగోదావరి ,అల్లవరం (అమలాపురం): ఏ దేవుడి శాపమో.. ఏ జన్మలో చేసుకున్న పాపమో యావత్ కుటుంబానికి దృష్టి గ్రహణం ఏర్పడింది. తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక దరిద్రం అనుభవిస్తున్నారు. తరాలు మారినా తలరాతలు మారడం లేదన్న బాధను దిగమింగుకుని జీవచ్ఛవంగా బతుకుతున్నారు. అల్లవరం మండలం బోడసకుర్రు మత్స్యకార గ్రామంలో చింతా వెంకటేశ్వరరావు కుటుంబాన్ని దృష్టి లోపం వెంటాడుతోంది. కుటుంబంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా అందరికి చూపు సమస్య తలెత్తింది. బయటకు వెళ్లాలన్నా, కడుపు నింపుకోవాలన్నా ఎవరో ఒకరి సాయం కావాలి. చేయూత లేకుంటే బయట ప్రపంచం చూడలేని పరిస్థితి.
వెంకటేశ్వరరావుకు చిన్నతనం నుంచే కంటి చూపు సమస్య ఉంది. ఉన్న చూపుతోనే చేపల వేట ద్వారా సంపాదించి కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే విధి వక్రీకరించింది. చేపల వేట సాగిస్తున్న సమయంలో నత్తగుల్ల ఎడమ కంటికి తగిలి శాశ్వతంగా చూపు లేకుండా చేసింది. మరో రెండేళ్ల వ్యవధిలో కుడి కన్ను పాడై శాశ్వతంగా అంధుడిగా మిగిలిపోయాడు. తన కడుపున పుట్టిన పిల్లలు కూడా ఒకొక్కరూ కంటి చూపు కోల్పోతుండడంతో కన్నీరు మున్నీరవుతున్నాడు. రక్తం పంచుకుని పుట్టిన చెల్లి పాలెపు బేబి (30), కుడుపున పుట్టిన కుమారుడు చింతా రాజు(27) కుమార్తె చింతా రత్నకుమారి (20), ఏ పాపం తెలియని మనవరాలు చింతా వర్షిత (7) ఇలా ఐదుగురిని అంధత్వం వెంటాడుతోంది.
పుట్టుకతో ఎవరూ గుడ్డివారు కాదు. వయస్సు పెరిగే కొద్ది దృష్టి లోపం బయటపడుతోంది. తన చెల్లిలిని ఊబలంక గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. పెళ్లయిన రెండేళ్లకే కంటి చూపు కోల్పోయింది. చూపు లేదన్న సాకుతో కట్టుకున్న భర్త వది లేసి ఒంటరిని చేశాడు. పండంటి బిడ్డకు జన్మనిస్తే పోలి యో చుక్కల రూపంలో శిశువును మృత్యువు కబళించింది. గత్యంతరం లేక అంధుడైన తన అన్న వెంకటేశ్వరరావు ఆశ్రయంలో కాలం గడుపుతోంది.
పార్వతే ఇంటి ఇలవేల్పు
అటువంటి కుటుంబానికి అన్ని తానై రోజు వారీ కూలి డబ్బులతో బతుకు బండిని లాగుతోంది పార్వతి. విశ్రాంతి తీసుకోవలసిన సమయంలో రెక్కల కష్టాన్ని ధారపోసి కుటుంబాన్ని పోషిస్తోంది.
కాగా వెంకటేశ్వరరావుకి మాత్రమే ప్రభుత్వం పింఛను పంపిణీ అందిస్తున్నారు..
వెంకటేశ్వరరావు నుంచి మూడో తరం వరకూ మేనరికం పెళ్లిళ్లు జరగలేదని బాధిత కుటుంబం సాక్షికి తెలిపింది. సరైన సమయంలో వైద్యులకు చూపించినా లోపం లేదని చెబుతున్నారని వాపోయారు. వర్షితను స్కూల్లో చేర్పించిన తర్వాత దృష్టి లోపం ఉందని గుర్తించామని తల్లి తెలిపింది. కాకినాడ, రాజమండ్రి నగరాల్లో కంటి ఆస్పత్రికి తీసుకు వెళ్తే ఏ సమస్యా లేదని వైద్యులు తెలిపారన్నది. పెద్ద ఆస్పత్రులకు తీసుకెళ్లి వైద్యం చేయించే స్థోమత లేకపోవడంతో ఇంటిలోని అందరూ చూపు కోల్పోతున్నారని భోరున విలపించారు.
జన్యుపరమైన లోపాలు సవరించలేం
జన్యుపరమైన లోపాలు, మేనరికం వల్ల వచ్చే కంటి సమస్యలు తలెత్తితే నివారణ కష్టతరం. కంటిలో రెగ్మోంటోస్ సమస్య తలెత్తితే ఎంత ఖరీదైనా వైద్యం అందించి నా కంటి చూపు సాధ్యంకాదు. వయసు పెరిగే కొద్దీ నరాలు శక్తి కోల్పోయి కంటి చూపు శాశ్వతంగా పోయే ప్రమాదముంది. గ్లొకోమా సమస్య తలెత్తితే ఆపరేషన్ ద్వారా కంటి చూపు తేవచ్చు. తక్కువ బరువులో పిల్లలు పుట్టినప్పుడు కంటి నరాలు బలహీనంగా ఉం టాయి దీనినే రెటినోపతి ప్రీమెచ్యూరిటీ అం టారు. పిల్లలు తక్కవ బరువుతో పుట్టినప్పుడు ఆర్‌ఓపీ స్కీనింగ్ నిర్వహిస్తే కంటి సమస్యలను గుర్తించి తధ్వారా చికిత్స అందించవచ్చు.
-కడలి ప్రసాద్, కంటి వైద్య నిపుణులు, సత్యా నేత్రాలయ, అమలాపురం
Comments
Please login to add a commentAdd a comment