దుర్గగుడి ఈఓ వి.కోటేశ్వరమ్మ కార్యాలయం ఎదుట నిరీక్షిస్తున్న తాత్కాలిక ఉద్యోగులు
దుర్గగుడిలో ఉద్వాసనల పర్వం కొనసాగుతోంది.. ఇటీవల 150 మంది సెక్యూరిటీ సిబ్బందిని ఇంటికి పంపించిన అధికారులు తాజాగా మరో 14 మంది తాత్కాలిక సిబ్బందిపై వేటు వేశారు.. తమకు అనుకూలమైనవారిని నియమించుకునేందుకే అధికారపార్టీ నాయకులు ఇటువంటి తంత్రాలను ప్రయోగిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. ఎనిమిదేళ్లుగా తాము అమ్మవారి సన్నిధిలో సేవలందిస్తున్నామని.. వేతనం తక్కువైనా అమ్మ సన్నిధిలో సేవచేశామనే తృప్తితో జీవితాలను నెట్టుకొస్తున్నామని.. ఇప్పుడు హఠాత్తుగా పొమ్మంటే మా గతేం కావాలని సిబ్బంది వాపోతున్నారు..
సాక్షి,విజయవాడ: ‘బాబు వస్తే జాబు వస్తుంది’ అని చంద్రబాబు ప్రభుత్వం గత ఎన్నికల ముందు ప్రచారం చేసుకున్నారు. బాబు వచ్చాక కొత్త జాబులు రావడం మాట పక్కన పెడితే.. ఉన్న ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. దుర్గగుడిలో సెక్యూరిటీ విభాగంలో పనిచేస్తే 150 మంది సెక్యూరిటీ సిబ్బంది ఉద్యోగాలు పోయి ఘటన జరిగిన నెల కూడా కాక ముందే ఇప్పుడు లడ్డూ, పులిహోర విక్రయాల విభాగంలో తాత్కాలిక ఉద్యోగులుగా పనిచేస్తున్న 14 మంది ఉద్యోగాలు పోగొట్టుకున్నారు.
8 ఏళ్లుగా సేవలు
ఈ 14 మంది సిబ్బంది ఎనిమిదేళ్ల క్రితం దుర్గగుడిలోకి వచ్చారు. అప్పట్లో లడ్డూల విక్రయాలు బ్యాంకులు నిర్వహించేవి. తొలి ఆరేళ్లు ఆంధ్రాబ్యాంకు, ఎస్‌బీహెచ్ అంటూ బ్యాంకులు మారాయి కాని సిబ్బంది మాత్రం మారలేదు. రెండేళ్ల క్రితం బ్యాంకులను తప్పించి దేవస్థానమే స్వయం లడ్డూలు విక్రయాలు ప్రారంభించింది. అయితే సిబ్బందిని మాత్రం కొనసాగించారు. దేవస్థానం తరఫున ఇద్దరు పర్మినెంట్ ఉద్యోగుల పర్యవేక్షణలో ఈ 14 మంది సిబ్బంది రెండు షిప్టులలో విధులు నిర్వహించేవారు. మల్లికార్జున మహామండపం కింద భాగంలో మూడు కౌంటర్లు, శివాలయం వద్ద ఒక కౌంటర్, నటరాజ మండపం వద్ద మరొక కౌంటర్ నిర్వహించేవారు. లడ్డూలు, పులిహోర విక్రయాల్లో ఈ సిబ్బంది కీలకపాత్ర పోషించేవారు. ఏ రోజు సొమ్ము ఆరోజు దేవస్థానానికి జమ చేసేవారు.
గత ఈఓ జీతాలు పెంచితే....
బ్యాంకుల ఆధీనంలో సిబ్బంది పనిచేసేటప్పుడు నెలకు రూ.8,650 చొప్పున చెల్లించేవారు. అయితే గత ఈఓ ఎం. పద్మ వీరి సమస్యలను అర్ధం చేసుకుని రూ.12,000 జీతం పెంచారు. దీనికి తోడు జీఎస్‌టీ, పీఎఫ్ కలిపితే రూ.17వేలు వరకు అయ్యేది. లడ్డూల ప్రసాదాల విభాగాన్ని చక్క దిద్దుతుండగానే ఆమె బదిలీ జరిగింది. ఆమె స్థానంలో వచ్చిన కోటేశ్వరమ్మ 14 మంది సిబ్బందిపై వేటు వేశారు. తిరిగి ప్రసాదాల కౌంటర్ల నిర్వహణ బాధ్యత బ్యాంకులకు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో బ్యాంకులు ప్రసాదాలను విక్రయించేటప్పుడు భక్తుల నుంచి విమర్శలు రావడంతో దేవస్థానమే ఆ బాధ్యత చేపట్టింది . ఇప్పుడు తిరిగి బ్యాంకులకు అప్పగిస్తే.. గతంలో జరిగిన పరస్థితులు పునరావృతం కాదా? అనేది ప్రశ్న. అధికారపార్టీకి చెందిన కొంతమంది రాజకీయ నేతలు స్వలాభం కోసమే ఈ తొలగింపులు జరిగాయని, తరువాత తమకు అనుకూలమైన వారి వద్ద ముడుపులు తీసుకుని దేవస్థానంలో పోస్టింగ్‌లు ఇప్పిస్తారని ఇంద్రకీలాద్రిపై ప్రచారం సాగుతోంది. ఈఓ మారిన ప్రతిసారి అధికారపార్టీ నేతలకు ఇది మాములేనని భక్తులు చర్చించుకుంటున్నారు.
మా సిబ్బందిని వినియోగించుకుంటాం
ప్రస్తుతం మా వద్ద పనిచేసే 14 మంది పర్మినెంట్ సిబ్బంది ఖాళీగా వున్నారు. వీరి సేవలు వినియోగించుకునేందుకు 14 మందిని తొలగించాను. త్వరలోనే ప్రసాద విక్రయ బాధ్యతలను బ్యాంకుకు ఇచ్చిన తరువాత పర్మినెంట్ సిబ్బంది సేవలు వేరే విభాగంలో వినియోగించుకుంటాం.– కోటేశ్వరమ్మ, దుర్గగుడి ఈఓ
Comments
Please login to add a commentAdd a comment