‘ఆధార్’ లేని రైతులు.. కరుణ చూపని సర్కారు | Farm Loan Waiver will Be Linked to Aadhar Card in AP | Sakshi
Sakshi News home page

‘ఆధార్’ లేని రైతులు.. కరుణ చూపని సర్కారు

Published Mon, Nov 3 2014 1:49 AM | Last Updated on Fri, May 25 2018 6:12 PM

‘ఆధార్’ లేని రైతులు.. కరుణ చూపని సర్కారు - Sakshi

‘ఆధార్’ లేని రైతులు.. కరుణ చూపని సర్కారు

‘అవసరం తీరాక’..అన్నట్లు కనిపిస్తోంది ప్రభుత్వం తీరు. అధికారం కోసం నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చి గద్దెనెక్కిన సర్కారు ‘ఏరుదాటాక’ చందంగా పాలన సాగిస్తుండడంతో అన్నదాతలకు అన్నీ కష్టాలే ఎదురవుతున్నాయి.
 
 విజయనగరం అర్బన్: సవాలక్ష నిబంధనలతో ఎట్టకేలకు ఐదునెలల తరువాత  ఆన్‌లైన్‌లో ఆదివారం తయారయిన రుణమాఫీ అర్హుల తుదిజాబితా రైతుల్ని టెన్షన్‌లో పెడుతోంది. ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన వాటిలో సుమారు 45 వేల మంది రైతుల ఖాతాలకు వివిధ కారణాలు చూపి రుణమాఫీకి అర్హతలేని జాబితాలో చేర్చారు. దీంతో రైతులు తమ ఖాతాలకు అర్హత లభించిందో లేదోనని ఆందోళన పడుతున్నారు.  తిరస్కరించిన పేర్లను మళ్లీ అర్హుల జాబితాలో చేర్చడానికి గ్రామస్థాయిలో రాజకీయాలు మొదలవుతాయేమోనని భయపడుతున్నారు. రుణమాఫీకి సంబంధించి అక్టోబర్ 19వ తేదీనాటికి అధికారులు, బ్యాంకర్లు సేకరించిన సమాచారాన్ని ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలలో ప్రభుత్వం చూపించిన ఏపీ స్టేట్ రెసిడెన్షియల్ డేటా హబ్ (ఏపీఎస్‌ఆర్‌డీహెచ్)లో అప్‌లోడ్ చేశారు.
 
 ఆధార్ కార్డును జతపరచకపోవడంతో ప్రాథమికంగా 30 వేల ఖాతాలను ఏపీఎస్‌ఆర్‌డీహెచ్ ప్రాథమిక దశలోనే తొలగించింది. అదేవిధంగా వివిధ సాంకేతిక కారణాల వల్ల మరో 15 వేల ఖాతాలను అనర్హులుగా చేశారు. అవిపోను మిగిలిన 2,74,699 ఖాతాల వరకు  రుణమాఫీకి అర్హత పొందినట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ సంబంధిత మండలాల జన్మభూమి కమిటీలను పంపించి గ్రామసభల్లో ఖాతాదారుల పూర్తి సమాచారం సేకరించి వాస్తవమా...కాదా  కరుణ చూపని సర్కారు అనేది నిర్ధారించుకున్న తరువాత తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. దీంతో జన్మభూమి కమిటీలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటాయోనని రైతుల్లో ఉత్కంఠ నెలకొంది.
 
  రుణమాఫీకి సంబంధించి ఆధార్ కార్డు తప్పనిసరి అని పేర్కొంటూ  ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. ఇదే సమయంలో కేవలం ఆధార్ కార్డు మాత్రమే కాకుండా రేషన్ కార్డును కూడా పొందుపరిచారు. ఒక కుటుంబంలో ఒకరికే రుణం వర్తిస్తుందంటూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఆధార్‌నంబర్, రేషన్ కార్డులోని సభ్యుల వివరాలను పోల్చుకోవడం ద్వారా కొంతమందిని రుణమాఫీ నుంచి తొలగించాలనేది ప్రభుత్వంలక్ష్యం. తాజాగా మరికొద్ది రోజులు అవకాశం కల్పించడంతో మరో చిక్కు వచ్చి పడింది. ఏపీ స్టేట్ రెసిడెన్షియల్ డేటాహబ్ పరిశీలించిన వాటిలో బ్యాంకర్లు పంపే సమయంలో కొన్ని పొరపాట్లు జరిగినట్లు గుర్తించారు. దీంతో వాటిని సరిచేసి తిరిగి పంపాలంటూ ఇప్పటికే బ్యాంకర్లను ప్రభుత్వం ఆదేశించింది.
 
 కుదింపే లక్ష్యంగా  కసరత్తు
 రుణాలు మాఫీ అవుతాయని ఆశించిన రైతుల ఆశలపై టీడీపీ ప్రభుత్వం నీళ్లు చల్లుతోంది. సాంకేతిక కారణాలు సాకుగా చూపుతూ రుణమాఫీ జాబితాల్లో రైతుల పేర్లు తొలగించేలా అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. రుణమాఫీ జీఓ ఆధారంగా డిసెంబర్ 2013 నాటికి బ్యాంకులకు బకాయిలు ఉన్నవారందరికీ (పంట, బంగారు రుణాలు) మాఫీ చేయాలి. దీనిపై 31 షరతులను విధించి ప్రభుత్వం బ్యాంకు సిబ్బందితో రుణమాఫీ జాబితాలు తయారు చేయించింది. అందులో ఆధార్‌కార్డు, రేషన్‌కార్డు, పట్టాదారు పాస్‌పుస్తకం నంబర్లు తప్పనిసరిగా నమోదు చేయించాలనే నిబంధన విధించింది. సహకారసంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులకు డీసీసీబీలో ఆన్‌లైన్ ఖాతాలు కూడా తెరిపించారు.
 
 ఎట్టకేలకు బ్యాంకుసిబ్బంది జాబితాలను జిల్లా అధికార యంత్రాంగానికి అందజేయగా, సాంకేతిక కారణాలు చూపి జాబితాలో 20 శాతం పేర్లను వెనక్కి పంపించింది. ఆధార్‌కార్డు నంబర్ తేడా ఉందని, రేషన్ కార్డుపేరు ట్యాలీ కాలేదని ఇలా ఎన్నో కారణాలను ఆ జాబితాలో నమోదు చేశారు. ఒక్క అక్షరం తేడా ఉన్నా లబ్ధిదారుల పేర్లను వెనక్కి పంపారు. దీంతో బ్యాంకు సిబ్బందికి ఏమీ పాలుపోక తలలు పట్టుకుంటున్నారు. ఆధార్, రేషన్‌కార్డుల్లో తేడా వస్తే తామె క్కడ సరిచేయగలమని వాపోతున్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరెడ్డి వాయిదాల్లో బకాయిలను మాఫీ చేసినపుడు బ్యాంకులు ఇచ్చిన జాబితాల ఆధారంగానే చేశారని, ఇన్ని ఆంక్షలు విధించలేదని బ్యాంకు అధికారులు అంటున్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement