కూరాడ డ్రెయిన్ 2012లో తవ్వినప్పటి దృశ్యం(ఫైల్), గొర్రిపూడి వద్ద తుల్యభాగ డ్రెయిన్‌లో డ్రెడ్జింగ్ పనిని ప్రారంభిస్తున్న మాజీ ఎమ్మెల్యే కన్నబాబు (ఫైల్)
సాక్షి, కరప (తూర్పు గోదావరి): రైతులకు వ్యవసాయంలో పంట, మురుగు కాలువలే ప్రముఖ పాత్ర వహిస్తాయి. సాగునీరు సక్రమంగా అందాలంటే పంట కాలువ సక్రమంగా ఉండాలి. పొలాల్లోని మురుగునీరు పోవాలన్నా, అధిక వర్షాలు, తుపాన్ల సమయంలో కురిసే వర్షాలకు పంటపొలాలు ముంపునకు గురవ్వకుండా ఉండాలన్నా మురుగు కాలువలు అవసరం. అటువంటి పంట, మురుగు కాలువలు రెండు దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఇరిగేషన్ అధికారులు, జిల్లా నాయకులు కానీ పట్టించుకోకపోవడం వల్ల కాలువలు తవ్వకానికి నోచుకునేవి కావు. అలాంటి సమయంలో అప్పటి ఎమ్మెల్యే కురసాల కన్నబాబు రైతుల ఇబ్బందిని గుర్తించి, ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి కాలువల ఆధునికీకరణ చేయించారు. ఆయన నాడు చేసిన కృషిని తలచుకొని నేడు రైతులు ఆయనకే ఈ ఎన్నికల్లో మళ్లీ ఓటు వేస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు.
మండలంలోని భూములన్నీ కూడా కాలువలకు శివారున, సముద్ర తీరాన ఉంటాయి. దీంతో కాలువలకు సాగునీరు వదిలినా పంటకాలువలు మేటవేసి, మూసుకుపోవడంతో పంటపొలాలకు సాగునీరందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు. తొలకరి సీజన్‌లో కూడా సాగునీటి సమస్య ఉండేది. దాళ్వా సీజన్‌లో అయితే రైతులు అష్టకష్టాలు పడేవారు. రాత్రింబవళ్లు కాలువగట్లపై తిరుగుతూ నరకయాతన పడుతూ పంటలు పండించుకునే పరిస్థితి. మురుగుకాలువలైతే తవ్వకానికి నోచుకోక వర్షాకాలం వచ్చిందంటే నీరులాగక కొద్దిపాటి వర్షానికి కూడా పంటపొలాలు ముంపునకు గురయ్యేవి. పంటకోతకు వచ్చే సమయం అక్టోబర్, నవంబర్ నెలల్లో వచ్చే తుపాన్లకు చేతికి అందివచ్చినా మునిగిపోయి నీటిపాలయ్యేది.
ఒక్కో సంవత్సరమైతే మొదటిపంట పూర్తిగా వర్షార్పణమయ్యేది. టీడీపీ హయాంలో అధికారపార్టీ నాయకులకు రైతులు ఎంతగా మొరపెట్టుకున్నా కాలువల పట్ల నిర్లక్ష్యంగా వ్యహరించేవారు. దీంతో రైతుకు ముంపు సమస్య తప్పేదికాదు. 2012లో అప్పటి ఎమ్మెల్యే, ప్రస్తుతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కురసాల కన్నబాబు రైతులు ఎదుర్కొంటున్న సమస్యను, ముంపునకు గురైనప్పుడు పంటపొలాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రభుత్వంతో పోరాడి అయినా నిధులు మంజూరు చేయించాలని నిర్ణయించారు. కన్నబాబు కృషి ఫలించడంతో అప్పటి ఇరిగేషన్ మంత్రి సుదర్శన్‌రెడ్డి స్పందించి రూ.60 కోట్లు మంజూరు చేశారు. తుల్యభాగ డ్రెయిన్‌లో పూడిక తొలగించేందుకు డ్రెడ్జింగ్ పనికి మరో రూ.10 కోట్లు మంజూరు చేయించారు.
2012లో కన్నబాబు ఇరిగేషన్ మంత్రిని పెదకొత్తూరు తీసుకొచ్చి కాండ్రేగుల డ్రెయిన్ ఆధునికీకరణ పనికి భూమిపూజ చేయించారు. ఈ నిధులతో శహపురం, జెడ్. భావారం, రాజు, జి.భావారం తదితర డ్రెయిన్లతో పాటు రావువారికాలువ, న్యూభీమన్నకర్రకాలువ, సంపరబోది, మెరకకాలువ, కేఎంజే కాలువ వంటి పంటకాలువలన్నింటినీ ఆధునీకరించారు. మండలంలోని చాలా మురుగుకాలువలు తుల్యభాగ డ్రెయిన్‌లో కలుస్తాయి. ఈ డ్రెయిన్ నీరు పటవలవద్ద సముద్రంలో కలుస్తుంది. ఈడ్రెయిన్‌లో నిత్యం నీరు పారుతూ ఉంటుంది. డ్రెయిన్ పూడికతీయాలంటే ప్రత్యేక యంత్రపరికరం ద్వారా (డ్రెడ్జింగ్) నీటిలోంచే పూడికతీత పని చేయించాల్సి ఉంటుంది. జిల్లాలో ఇరిగేషన్ చరిత్రలోనే మొదటిసారి రూ.10 కోట్లతో డ్రెడ్జింగ్ పనితో తుల్యభాగ డ్రెయిన్‌లో పూడిక తీయించారు.
ఈ ఆధునీకరణ పనులతో సాగునీటి కష్టాలు గట్టెక్కాయని, ముంపునీటి సమస్య తీరి రెండుపంటలు పండించుకో కలుగుతున్నామంటే మహానుభావుడు కన్నబాబు కారణం అని మండల రైతులు ఎన్నికల వేళ తలచుకుంటున్నారు. అటువంటి నాయకుణ్ణి ఈసారి ఎన్నికల్లో గెలుపించుకుంటామని రైతుకుటుంబాల వారు అంటున్నారు. రైతు కుటుంబంలోంచి వచ్చాం, రైతుపక్షపాతి అంటూ టీడీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకోవడమే కానీ రైతులకు చేసిందేమీ లేదని రైతులు అంటున్నారు. జిల్లాలో కాలువల ఆధునికీకరణ పనులకు శ్రీకారం చుట్టింది దివంగతనేత రాజశేఖర్‌రెడ్డి అని రైతులు స్మరించుకుంటున్నారు.
ముంపు సమస్య తీరింది
మండల పరిధిలోని పంటపొలాలు సముద్రతీర ప్రాంతాన ఉంటాయి. చాలా కాలం మురుగుకాలువలు తవ్వించకపోవడం వల్ల పూడుకుపోయాయి. కొద్దిపాటి వర్షానికి కూడా వరిచేలు మునిగిపోయి, నష్టం వాటిల్లేది. మాజీ ఎమ్మెల్యే కన్నబాబు కాలువలు ఆధునీకరించడం వల్లనే ముంపుసమస్య తీరింది. కన్నబాబును మరువలేము.
- రావుల ప్రసాద్, రైతు, మాజీ సర్పంచి, కూరాడ
పంట, మురుగు కాలువలు తవ్వించారు
1989 తర్వాత కాలువలను తవ్వించకుండా వదిలేశారు. కురసాల కన్నబాబు ఎమ్మెల్యేగా ఉండగా 2012లో పంట, మురుగు కాలువలు తవ్వించారు. తుల్యభాగ డ్రెయిన్‌లో పూడిక తీయించడంతో తొలకరి సీజన్‌లో ముంపు సమస్య తొలగింది. ఈ ప్రాంత రైతులు కన్నబాబు చేయించిన కాలువ పనులను ఇప్పటికీ తలచుకుంటున్నారు.
–బండే తాతాజీ, రైతు, కరప డీసీ మాజీ చైర్మన్, వేములవాడ
Comments
Please login to add a commentAdd a comment