వీరబల్లి (వైఎస్సార్ జిల్లా) : పట్టాదార్ పాస్ పుస్తకంలో దొర్లిన తప్పులను సవరించాలని చెప్పులరిగిపోయేలా తిరుగుతున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో ఒక రైతు తహశీల్దార్ కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు యత్నించాడు. వీరబల్లి మండలం ఉప్పరపల్లి గ్రామానికి చెందిన వెంకట్రామరాజు అనే రైతుకు చెందిన పట్టాదార్ పాస్‌పుస్తకంలో అధికారులు తప్పుడు సమాచారం నమోదుచేశారు. దాంతో తనకు రావాల్సిన 50 వేల రూపాయల రుణం రాకుండాపోయింది. సదరు రైతు చాలా రోజులుగా వీరబల్లి తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులెవరూ పట్టించుకోవడంలేదు. రేపు, మాపు అంటూ కాలయాపన చేస్తున్నారు. దీంతో విసిగిపోయిన వెంకట్రామరాజు మంగళవారం ఉదయం పురుగుల మందు సీసాతో తహశీల్దార్ కార్యాలయానికి వచ్చాడు.
అధికారులను ప్రాధేయపడినా కసురుకోవడంతో మనస్థాపానికి గురైన రైతు కార్యాలయం ముందు పురుగులమందు తాగేందుకు ప్రయత్నించాడు. గమనించిన సిబ్బంది వెంటనే పురుగులమందు సీసాను రైతు నుంచి లాక్కుని కార్యాలయంలో దాచారు. డిప్యూటీ తహశీల్దార్ శిరీష కలుగజేసుకుని రెండు రోజుల్లో పట్టాదార్ పాసుపుస్తకంలో మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. వెంకట్రామరాజు కుటుంబసభ్యులను పిలిపించి రెండు రోజుల్లో పనిచేస్తామని, వెంకట్రామరాజు అఘాయిత్యానికి పాల్పడకుండా చూడాలని కోరారు. అధికారి హామీ మేరకు సదరు రైతును కుటుంబసభ్యులు ఇంటికి పిలుచుకువెళ్లారు.
తహశీల్దార్ కార్యాలయం వద్ద రైతు ఆత్మహత్యాయత్నం
Published Tue, Sep 8 2015 4:54 PM | Last Updated on Thu, Apr 4 2019 2:50 PM
Advertisement