కొలిక్కిరాని ఇన్‌పుట్ సబ్సిడీ జాబితా
కాలయాపన చేస్తున్న అధికారులు
ఆందోళనలో రైతన్నలు
అనంతపురం అగ్రికల్చర్ : ఇన్‌పుట్ సబ్సిడీ జాబితా తయారీలో అధికారులు తాత్సారం చేస్తున్నారు. ఖరీఫ్ 2014 లో దెబ్బతిన్న పంటలకు సంబంధించి పెట్టుబడిరాయితీ (ఇన్‌పుట్‌సబ్సిడీ) కింద పరిహారం విడుదలై రెండు నెలలు గడుస్తున్నా, జాబితా ఇప్పటికీ కొలిక్కిరావడం లేదు. 2014 ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 5.81 లక్షల హెక్టార్లలో పంటలు దెబ్బతినగా, నష్టపోయిన 5.79 లక్షల మంది రైతులకు ఈ సంవత్సరం జూలై 22న ప్రభుత్వం రూ.567.32 కోట్లు ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల చేసింది. అయితే నకిలీ పాసుపుస్తకాలున్నాయంటూ కొన్ని రోజుల పాటు అధికారులు పాసుపుస్తకాల పరిశీలనలో మునిగిపోయారు.
పరిశీలన పూర్తయ్యాక 7,529 మంది రైతులను ఇన్‌పుట్ సబ్సిడీకి అనర్హులుగా పరిగణించి వారికి ఇవ్వాల్సిన రూ.7.64 కోట్లు పరిహారాన్ని ఇప్పటికే వెనక్కు పంపారు. ఆ తర్వాత మండలాల వారీగా రైతులకు సంబంధించిన పూర్తి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం ప్రారంభించారు. అయితే ఆన్‌లైన్‌లో నమోదు చేసే కార్యక్రమం కొలిక్కిరాక కుస్తీలు పడుతున్నారు. ఈ సారి ఆధార్ నంబరు తప్పనిసరి కావడంతో సమస్య ఏర్పడింది.
ఇష్టారాజ్యంగా ఆధార్ నంబర్లు నమోదు చేయడంతో జాబితాలు తప్పులతడకగా మారాయి. 80 శాతం అప్‌లోడ్ పూర్తైదని, రెండు మూడు రోజుల్లో రైతుల బ్యాంకు ఖాతాల్లో పరిహారం జమ చేస్తామని వ్యవసాయశాఖ అధికారులు 15 రోజులుగా చెబుతూ వస్తున్నారు. కానీ... వాస్తవ పరిస్థితులు వేరుగా కనిపిస్తున్నాయి. జాబితా పూర్తి కావడానికి ఇంకా 10 నుంచి 15 రోజులు పట్టే అవకాశాలు ఉన్నాయి. ఈ లెక్కన దసరా పండుగకు కానీ రైతుకు పరిహారం అందే పరిస్థితి లేదు.
ప్రస్తుతానికి రూ.460 కోట్ల పరిహారం ఇవ్వడానికి వీలుగా 4.75 లక్షల మంది రైతులకు సంబంధించి అన్ని వివరాలు సక్రమంగా ఉన్నట్లు జాబితా తయారు చేశారు. ఇంకా రూ.100 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీకి సంబంధించిన 97 వేల మంది రైతుల వివరాలు జత కావడం లేదు. ఇది కొలిక్కిరావాలంటే తీవ్రం గా శ్రమించాల్సిన పరిస్థితి నెల కొంది. ఈ నేపథ్యంలో ఈ ఏడా ది జిల్లాకు విడుదలైన మొత్తం రూ.567 కోట్ల పరిహారంలో చివరికి రూ.70 నుంచి 80 కోట్లు పంపిణీ కాకుండా ప్రభుత్వానికి వెనక్కి వెళ్లే పరిస్థితులు స్పష్టం గా కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్హులైన చాలామంది రైతులకు పరిహారం అందేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇంకెన్నాళ్లో?
Published Sat, Sep 26 2015 4:37 AM | Last Updated on Sun, Sep 3 2017 9:58 AM
Advertisement