యువరైతు ఆత్మహత్య | Farmer commits suicide in Adilabad | Sakshi
Sakshi News home page

యువరైతు ఆత్మహత్య

Published Sat, Oct 19 2013 3:14 AM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM

Farmer commits suicide in Adilabad

భైంసా, న్యూస్‌లైన్ : అతివృష్టి అన్నదాత ప్రాణాలు తీస్తోంది. రెండు నెలల క్రితం కురిసిన వర్షాల ప్రభావంతో కొన్నిచోట్ల మొక్కలు కుళ్లిపోగా, మరికొన్ని చోట్ల కలుపు, తెగుళ్లు సోకి దిగుబడి తగ్గింది. సాగు కోసం చేసిన అప్పులు తీర్చేమార్గం లేక రైతులు మృత్యుఒడికి చేరుకుంటున్నారు. తాజాగా భైంసా మండలం ఇలేగాం గ్రామానికి చెందిన మైసర్ భోజన్న(అంకుశ్)(26) గురువారం పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నాడు. యువరైతు ఆత్మహత్య ఇలేగాం గ్రామాన్ని విషాదంలో ముంచింది. కుటుంబీకులు గుండెలు అవిసేలా రోదిస్తున్నారు.
 
 దర్జాగా బతికిన కుటుంబం
 ఇలేగాం గ్రామానికి చెందిన మైసర్ సాయన్న-పోసాని దంపతులకు పదెకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమిని సాగు చేస్తూ దర్జాగా బతుకుతున్నారు. వీరికి ఐదుగురు కూతుళ్లు, ఒక కుమారుడు. కూతుళ్లందరు పెళ్లీడుకు రాగానే కష్టాలు మొదలయ్యాయి. అదే తరుణంలో నమ్ముకున్న వ్యవసాయం నట్టేట ముంచింది. వరుస పంటనష్టంతో దర్జాగా బతికిన రైతు కుటుంబం అప్పులతో బక్కచిక్కింది. ఒకప్పుడు పెద్ద రైతుగా పేరున్న సాయన్న చివరకు గ్రామంలో పాలేరు పని చేశాడు. పాలేరుగా పనిచేస్తూ తనకున్న పదెకరాల భూమిని కౌలుకు ఇచ్చేశాడు. అప్పోసొప్పో చేసి నలుగురు ఆడపిల్లల పెళ్లిళ్లు చేశాడు. చిన్నతనం నుంచి గారాబంగా పెరిగిన కొడుకు భోజన్న తండ్రి కష్టం చూడలేకపోయాడు. ఇంటర్మీడియెట్‌తోనే చదువును ఆపేసి కుటుంబ బాధ్యతలను నెత్తిన వేసుకున్నాడు.
 
 ఎదుగుతున్న క్రమంలోనే..
 పుస్తకం పక్కన పెట్టి పగ్గం చేతబట్టిన భోజన్న వ్యవసాయ పనులు చేస్తూ కౌలులో ఉన్న పదెకరాల్లో ఐదెకరాలు వెనక్కి తీసుకున్నాడు. చిన్న అక్క పెళ్లి చేసి ఇందిరమ్మ పథకంలో ఇల్లు కట్టుకున్నాడు. అప్పులు తీరుస్తూ వయస్సు పైబడ్డ తల్లిదండ్రులను పోషిస్తూ మూడు, నాలుగు ఏళ్లు పంటలు పండించాడు. ఈయేడు జూన్‌లో పెళ్లి చేసుకున్నాడు. పంటల కోసం చేసిన పాత అప్పులకు తోడు ఈ రెండేళ్లలో పంట కోసం తీసుకొచ్చిన అప్పులు పెరిగాయి. రెండేళ్లుగా ఆశించిన స్థాయిలో పంట దిగుబడిరాలేదు. గతేడాది పంట పండకపోయినా గుండె నిబ్బరం చేసుకుని ఈ ఏడు ముందుకుసాగాడు. ఇలేగాంలో ప్రైవేటు వ్యక్తుల వద్ద రూ. 1.60 లక్షల అప్పు తీసుకున్నాడు. పత్తి విత్తనాల కోసం దుక్కి దున్నించేందుకు ట్రాక్టర్ల కోసం ఎరువులు, పురుగుల మందుల కోసం మరో రూ. 60 వేల అప్పు తీసుకున్నాడు. రూ. 2.20 లక్షల మేర అప్పు పేరుకుపోవడంతో యువరైతు డీలాపడ్డాడు.
 
 కురిసిన వర్షంతో..
 ఈ ఏడు ఖరీఫ్‌లో బాగానే వర్షాలు కురిశాయి. కలుపు పెరిగింది. అయినా ఈ యువ రైతు అధైర్యపడలేదు. ఐదెకరాల్లో వేసిన పత్తిని అమ్మి అప్పులు తీర్చాలని భావించాడు. ఇటీవల పై-లీన్ తుపాన్ యువ రైతు ఆశలపై నీల్లు చల్లింది. తుపాన్ ప్రభావంతో వారం రోజులపాటు కురిసిన భారీ వర్షాలు పత్తి పంటను ఎరుపు రంగుకు మార్చేశాయి. ఎదుగుతున్న పత్తి కర్రలు కళ్లముందే వాడిపోయాయి. చేసేదేమిలేక భైంసాకు వచ్చి పురుగుల మందు తీసుకెళ్లాడు. పిచికారి చేసి నాలుగు, ఐదు రోజులు చూశాడు. పంటలో ఎలాంటి మార్పు కనిపించలేదు. తెగుళ్ల ప్రభావం తగ్గలేదు. ఎదగకుండా నిలిచిన పత్తిని చూసి చలించాడు. వృద్ధాప్యం పై బడ్డ తల్లిదండ్రులను ఎలా సాకాలో తెలియక తీసుకొచ్చిన అప్పులు ఎలా తీర్చాలో మార్గం కనిపించక ఆత్మహత్య చేసుకున్నాడు.
 
 ఇలేగాంలో విషాదం
 నాలుగు రోజుల ముందే ఐదుగురు కూతుళ్లు, అల్లుళ్లు, మనువళ్లతో పండగ సంబరం జరుపుకున్న కుటుంబంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. అందరిలో చిన్నవాడై బాగోగులు చూస్తున్న క్రమంలోనే అప్పుల ఊబిలో చిక్కి మృతి చెందిన తీరు గ్రామస్తులను కలిచివేసింది. గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో యువ రైతు భోజన్న పురుగుల మందు తాగాడు. గమనించిన గ్రామస్తులు భైంసా ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక వైద్య సేవలు చేసిన అనంతరం నాందేడ్ ఆస్పత్రికి తీసుకువెళ్లాలని వైద్యులు చెప్పారు. దీంతో గురువారం రాత్రి నాందేడ్ వెళ్లారు. అక్కడి ఆసుపత్రికి తీసుకువెళ్లగానే మృతి చెందినట్లు వైద్యులు తెలపడంతో కుటుంబీకులు బోరున విలపించారు. భైంసా ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. ఐదు నెలల క్రితమే వివాహం జరిగింది. మృతుని భార్య, తల్లిదండ్రులు, అక్కలు రోదించిన తీరు అక్కడికి వచ్చిన వారిని కలిచివేసింది. తండ్రి మైసర్ సాయన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు భైంసారూరల్ ఎస్సై గుణవంత్‌రావు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement