టేకులపల్లి, న్యూస్‌లైన్ : వైవాహిక జీవితం ఆరంభించి ఆరునెలలే అయింది...పెళ్లినాటి ముచ్చట్లు ఇంకా కొత్తగానే ఉన్నాయి...ఇంతలోనే కొత్తకాపురాన్ని సమస్యలు చుట్టుముట్టాయి...నవ్వుతూ, తుళ్లుతూ ఉండవలసిన ఆనవదంపతులు మానసిక క్షోభలో కూరుకుపోయారు...పంటకోసం చేసిన అప్పు శాపంలా వెంటాడుతుంటే జీవితంపై విరక్తి చెందారు....ఇద్దరూ ఈలోకాన్ని విడిచి వెళ్లిపోయారు. టేకులపల్లి మండలం తడికలపూడి పంచాయతీ కోక్యాతండాలో శుక్రవారం చోటుచేసుకున్న ఈ ఘటన ప్రతిఒక్కరినీ కదిలించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కోక్యాతండాకు చెందిన ధారావత్ దేనా, తారిల కుమారుడు ప్రసాద్ (25)కు ఆరు నెలల క్రితం భాగ్యనగర్‌తండాకు చెందిన శిరీష(23)తో వివాహం జరిగింది. వివాహానంతరం ప్రసాద్ వేరుకాపురం పెట్టాడు. ఉమ్మడిగా ఉన్న పదెకరాలను తీసుకుని అందులో పత్తిపంట వేశాడు. పెట్టుబడికి దాదాపు లక్షరూపాయల వరకూ అప్పుచేశాడు. అయితే విధి వక్రీకరించింది.
పకృతి కరుణించలేదు. పంట దిగుబడి సరిగా రాకపోవడంతో ప్రసాద్ కుంగిపోయాడు. అసలే కొత్తకాపురం...ఎదురుగా పెద్దమొత్తంలో అప్పు...ఆ దంపతులకు కంటిమీద కునుకు కరువైంది. శుక్రవారం రోజూలాగే దంపతులిద్దరూ పొలానికి వెళ్లి... మధ్యాహ్నం భోజనానికని ఇంటికొచ్చారు. ఆతరువాత ఏం జరిగిందో ఏమో కాని ఇద్దరు పొలానికి ఉపయోగించే గుళికలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. చాలాసేపటి వరకూ వారి ఇంటినుంచి అలికిడి రాకపోవడంతో చుట్టు పక్కల వారు వెళ్ళి చూసే సరికి నవ దంపతులిద్దరూ విగతజీవులై కనిపించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు పొలం నుంచి హుటాహుటిన వచ్చి విషయం తెలుసుకుని గుండెలు బాదుకున్నారు. వేరుకాపురం పెట్టి, వ్యవసాయం చేస్తున్న కొడుకు వృద్ధిలోకి వస్తాడనుకుంటే కోడలుతో సహా ఈలోకాన్నే విడిచిపోవడంతో ఆకుటుంబంలో విషాదం అలుముకుంది. విగతజీవులుగా మారిన ప్రసాద్, శిరీషలను చూసి ఇంత అన్యాయం చేశారా అంటూ వారు రోదిస్తున్న తీరు అందరినీ కలచివేసింది. పెళ్లైన ఆరునెలలకే ఆయుష్షు చాలించిన ఆ జంటను తలుచుకుని కోక్యాతండా యావత్తు తల్లడిల్లింది.
తల్లడిల్లిన కోక్యా తండా
Published Sat, Dec 21 2013 4:41 AM | Last Updated on Tue, Aug 21 2018 7:53 PM
Advertisement