కాటేసిన కరెంటు | farmer died with officers neglect | Sakshi
Sakshi News home page

కాటేసిన కరెంటు

Published Thu, Jan 16 2014 11:15 PM | Last Updated on Mon, Oct 1 2018 4:01 PM

farmer died with officers neglect

పాపన్నపేట/చేగుంట/ ఝరాసంగం,న్యూస్‌లైన్ : జిల్లాలో గురువారం జరిగిన వేర్వేరు సంఘటనలో కరెంట్ ముగ్గురిని బలితీసుకుంది. వరి నారుకు నీరు పార బెట్టేందుకు వెళ్లిన యువ రైతు విద్యుదాఘాతానికి గురికాగా.. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యానికి మరో ఇద్దరు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పాపన్నపేట మండలం దూమ్లా తండాకు చెందిన దరావత్ లాల్య, సాలి దంపతులకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఉన్న రెండెకరాల భూమిలో వరి, మొక్కజొన్న పంటలు వేసుకున్నారు.

వరి నారు ఎండిపోతుండడంతో బుధవారం సాయంత్రం నీరు పార బెట్టేందుకు పెద్ద కొడుకు ధరావత్ పీర్యా (25) తన భార్య శాంతితో కలిసి పొలం వద్దకు వెళ్లాడు. అయితే భార్య పొలంలో ఓ వైపు సేద తీరింది. మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చిన త్రీ ఫేస్ కరెంట్‌తో వడి నారుకు నీరు పెట్టాడు. అయితే రోజు లాగానే సాయంత్రం 6 గంటలకు పోయింది. దీంతో తెల్లవారుజాము 3 గంటల వరకు త్రీఫేస్ కరెంట్ రాదన్న ధీమాతో పీర్యా తన బోరుకు సంబంధించిన స్టార్టర్ డబ్బా వద్ద పాడైన కరెంట్ తీగలను మరమ్మతు చేసేందుకు పనులు ప్రారంభించాడు. అనుకోకుండా త్రీఫేస్ కరెంట్ రావడం, కాళ్ల కింద ఉన్న నీటి కారణంగా విద్యుదాఘాతానికి గురై క్షణాల్లో మృత్యువాతపడ్డాడు.

 కాగా కరెంటు పోయినా భర్త రాకపోవడంతో భార్య శాంతి మోటారు బోరు వద్దకు వెళ్లి చూడగా.. నీటిపై దుస్తులు తేలియాడుతూ కనిపించాయి. ఆందోళనకు గురైన శాంతి తండాకు వెళ్లి కుటుంబ సభ్యులను పిలుచుకుని వచ్చింది. అప్పటికే పీర్యా విగతజీవుడై కనిపించాడు. చేతికొచ్చిన కుమారుడు దుర్మరణం పాలు కావడంతో కన్నవారు కన్నీరు మున్నీరయ్యారు. కాగా కట్టుకున్నవాడు కళ్లముందే విద్యుదాఘాతానికి గురై మృతి చెందడంతో భార్య శాంతి గుండెలు బాదుకుంది. మృతుడికి అఖిల, నందు అనే చిన్నారులు ఉన్నారు.

 లైన్‌మన్ ప్రాణాన్ని బలిగొన్న ఏఈ నిర్లక్ష్యం
 విద్యుత్‌శాఖ ఏఈ నిర్లక్ష ్యంతో లైన్ మన్ ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఈ సంఘటన చేగుంట మండలం చెట్ల తిమ్మాయిపల్లిలో గురువారం చోటుచేసుకుంది. రామయంపేట మండలం నిజాంపేటకు చెందిన అనిల్ (28) చేగుంట మండలం చెట్ల తిమ్మాయిపల్లి లైన్‌మన్‌గా పనిచేస్తున్నాడు. రెండు రోజులుగా గ్రామంలో విద్యుత్తు సరఫరా ఆగిపోయింది. దీంతో విద్యుత్తు లైన్‌లను సరిచేయడానికి ఏఈ పెంట్యానాయక్ లైన్‌మన్ అనిల్‌ను తీసుకుని గ్రామానికి చేరుకున్నాడు.

ఎల్‌సీ తీసుకోకుండానే అనుమతి లభించిందని స్తంభం ఎక్కి సరిచేయాలని లైన్‌మన్‌ను ఏఈ పురమాయించాడు. దీంతో స్తంభానికి ఎక్కిన అనిల్ విద్యుదాఘాతానికి గురై కిందపడ్డాడు. వెంటనే అనిల్‌ను చికిత్స నిమిత్తం తూప్రాన్ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అనిల్ మృతి చెందాడని వైద్యులు తెలపారు. ఏఈ పెంట్యానాయక్ అనిల్ మృతదేహాన్ని మాసాయిపేట సబ్‌స్టేషన్‌కు తరలిస్తుండగా మృతుడి బంధువులు అడ్డుకున్నారు. అనంతరం ‘అనిల్ మృతికి నువ్వే కారణమని’ ఏఈపై దాడికి యత్నించారు. అయితే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాన్స్‌కో  ఏడీ శ్రీనివాస్‌రెడ్డి, డీఈ యాదగౌడ్‌లను రప్పించారు.

 ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రమాద విషయంలో ఏఈపై శాఖ పరమైన చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి సహకరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం పోలీసులు ఏఈ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. శాంతి భద్రతలను సీఐ గంగధర్‌తో పాటు తూప్రాన్  ఎస్‌ఐ నిరంజన్‌రెడ్డి, రామయంపేట ఎస్‌ఐ ప్రవీణ్, ట్రైనీ ఎస్‌ఐలు శేఖర్‌రెడ్డి, అజ్మతుల్లాలు పర్యవేక్షించారు.

 నాభర్తను ఏఈ వేధించేవాడు...
 చేగుంటకు బదిలీ అయిన రోజు నుంచి తన భర్త అనిల్‌ను ఏఈ పెంట్యానాయక్ వేధించేవాడని మృతుడి భార్య జ్యోతి రోదిస్తూ తెలిపింది. తన భర్త అనిల్ మృతికి ఏఈనే కారణమని ఆరోపించింది. మృతుడికి నాలుగేళ్ల లోపు గల కూతుళ్లు కీర్తన, సీయోనాలు ఉన్నారు.

 ఫ్యూజ్ వేసేందు వెళ్తూ..
 విద్యుత్ అధికారులు నిర్లక్ష్యంతో ఓ నిండు ప్రాణం బలైపోయిన సంఘటన గురువారం ఝరాసంగం మండలం ఎల్గోయి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఎల్గోయి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చంద్రయ్య (60) ఎల్గోయి గ్రామంలో పిండి గిర్ణి నడుపుతూ, చిన్న చిన్న విద్యుత్ పనులు చేస్తూ ఉండేవాడు. గ్రామానికి కొత్తగా ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు కావడంతో అధికారులపై మాట్లాడి దానిని ఏర్పాటు చేశాడు.

అయితే గ్రామానికి లైన్‌మన్ లేకపోవడంతో గురువారం ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆఫ్ చేయడంతో ఫ్యూజ్‌లు బిగిస్తుండడంతో విద్యుదాఘాతానికి గురై ట్రాన్స్‌ఫార్మర్‌పైనే ప్రాణాలొదిలాడు. ఇంటి నుంచి వెళ్లిన కొద్ది సేపటికే చంద్రయ్య మృతి చెందడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించాడు. మృతుడికి భార్య నీలమ్మతో పాటు కుమారులు ప్రభు, పండరి, దత్తు, శ్రీనివాస్‌లు ఉన్నారు.

 మృతుడి కుటుంబాన్ని ఆదుకోవాలి.
 విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లే చంద్రయ్య మృతి చెందాడని బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. విద్యుత్ అధికారులు వచ్చే వరకు మృతదేహాన్ని తీసేది లేదన్నారు. సమాచారాన్ని అందుకున్న ట్రాన్స్‌కో డీఈఈ కరీం, ఏడీ శ్రీనివాసచారి, ఏఈ సంతోష్‌లు గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో మాట్లాడారు.

మృతుడి కుటుంబానికి ప్రభుత్వ సాయం అందించడంతో పాటు కుమారుల్లో ఒకరికి విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జహీరాబాద్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement