ఎద్దులను, బండిని ఒడ్డుకు లాగుతున్న దృశ్యం
మద్దికెర : నీటిలో మునిగిపోతున్న ఎద్దులను, రైతుకుటుంబాన్ని అయ్యప్పమాలదారులు కాపాడారు. మండలకేంద్రం మద్దికెరలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలో గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షాలు కురిశాయి. దీంతో పొలంలో విత్తనం వేసేందుకు రైతు వెంకటేశులు కుటుంబంతో కలిసి ఎద్దుల బండిపై బయలుదేరాడు. మార్గంలోని రైల్వే అండర్ బ్రిడ్జి కింద దాదాపు నాలుగు అడుగుల లోతు నీరు నిలిచి ఉంది. మరో మార్గం లేకపోవడంతో అలాగే ముందుకు సాగాడు. మధ్యలోకి వెళ్లిన తర్వాత ఎడ్లు ముందుకు పోలేక బండిని వదిలేశాయి.
భయాందోళనకు గురైన రైతు గట్టిగా కేకలు వేయడంతో పక్కన మల్లప్ప దేవాలయంలో ఉన్న అయ్యప్పమాలదారులు భీమరాజు, ప్రసాద్‌తో పాటు మరో ముగ్గురు వచ్చి బాధిత రైతుకుటుంబాన్ని, ఎడ్లను, బండిని బయటకు తీసుకొచ్చారు. ఆ ప్రాంతంలో అయ్యప్పభక్తులు లేకుంటే ప్రాణపాయం జరిగేదని రైతు వెంకటేశులు తెలిపాడు. అవగాహన లేకుండా రైల్వే అండర్ బ్రిడ్జి నిర్మించడంతో వానాకాలంలో ఈ మార్గంగుండా వెళ్లాలంటే రైతులకు ఇబ్బందిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment