సహకార బ్యాంక్ వద్ద నోటీసులు చూపించి ఆందోళన చేస్తున్న రైతులు
పెదకూరపాడు : రైతులకు రుణాలు ఇవ్వకుండానే ఇచ్చినట్టు బ్యాంక్ నగదు పుస్తకంలో చూపించి, సొసైటీ ఖాతాలోని రూ.58 లక్షలు గోల్‌మాల్ చేసిన సంఘటన పెదకూరపాడు మండలం పరసతాళ్లూరు ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘం పరిధిలోని గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పెదకూరపాడు శాఖలో చోటు చేసుకుంది.
వ్యాపారం పేరుతో ఖాతాలో నగదు డ్రా
2014లో సొసైటీ పేరుతో కాంప్లెక్స్ ఎరువుల వ్యాపారం చేసేందుకని చెప్పి సొసైటీ ఖాతాలో ఉన్న రూ.70 లక్షల్లో రూ.58 లక్షలు డ్రా చేశారు. కొన్నాళ్ల పాటు సొసైటీ పేరుతో ఎరువుల వ్యాపారం చేసిన పాలకవర్గం రెండు సంవత్సరాల్లోనే వ్యాపారం మూసివేసింది. అయితే బ్యాంక్ ఖాతాలో నుంచి తీసుకున్న రూ.50 లక్షలు బ్యాంక్ ఖాతాలో జమ చేయలేదు. సొసైటీలో రుణం తీసుకోని మండలంలోని గారపాడు, పరస, బలుసుపాడు, లింగంగుంట్ల, పెదకూరపాడు గ్రామాలకు చెందిన సొసైటీలో సభ్వత్వం ఉన్న వారిని 41 మంది పేర్లతో వారికి తెలియకుండా 2017–18 మార్చి, ఏప్రిల్, మే నెలల్లో ఒక్కొక్కరికి రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు రుణాలు ఇచ్చినట్టుగా బ్యాంక్ పుస్తకాల్లో చూపించి ఆ నగదుకు లెక్క సరిపెట్టారు.
వెలుగులోకి రాకుండా జాగ్రత్తలు
సొసైటీ పాలకవర్గానికి జరిగిన ఎన్నికల్లో టీడీపీ నేతలే గెలుపొందారు. అందులో చైర్మన్‌తో సహా ఎక్కువ మంది టీడీపీకి చెందిన వారే డైరెక్టర్లుగా ఉన్నారు. పైగా సొసైటీ చైర్మన్‌గా ఉన్న వ్యక్తి జీడీసీసీబీ డైరెక్టర్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. గోల్‌మాల్ వ్యవహారం బయటకు పొక్కకుండా ఇటు బ్యాంక్ అధికారులను, అటు సొసైటీ అధికారులను మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. బ్యాంక్‌లో గత ఏడాది పనిచేసిన నోడల్ అధికారి ఒకరు ఈ కుంభకోణంపై బ్యాంక్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అయినా నేటివరకు విచారణ చేపట్టకుండా బ్యాంక్ ఉన్నతాధికారులు మీనమేషాలు లెక్కించారు. గత బ్రాంచ్ మేనేజర్ ఈ విషయమై ప్రశ్నించడంతో ఆయన్ను పాలకపార్టీ నాయకులు బదిలీపై పంపించేశారని తెలుస్తోంది.
మూలధనమా...రుణమాఫీ నగదా?
2007లో దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో సొసైటీకి రూ.10 కోట్ల మేరకు రుణమాఫీ నిధులు వచ్చాయి. కానీ వాటిలో సుమారు. 9.30 కోట్ల మేరకు రైతులకు రుణమాఫీ చేసి మిగిలిన నగదు సొసైటీ పేరుతో పెదకూరపాడు సహకార బ్యాంక్‌లో డిపాజిట్ చేసినట్టు తెలిసింది. అప్పటికే మూలధనం మొత్తం రైతులకు రుణాలు ఇచ్చినట్టు తెలిసింది. బ్యాంక్‌లో జమచేసిన నగదు రుణమాఫీ నగదుగా పలువురు రైతులు చెబుతున్నారు.
నోటీసులు రాకుండా పరపతివినియోగించిన నేతలు
ఈ కుంభకోణంపై బ్యాంక్ నోడల్ అధికారి ఇచ్చిన నివేదిక ప్రకారం విచారణ చేసేందుకు రైతులకు గతంలో ఒకసారి నోటీసులు ఇవ్వగా ఆ నోటీసులు రైతుల వద్దకు చేరకుండా అధికార పార్టీ నేతలు అడ్డుకున్నారని తెలిసింది. దీంతో అసిస్టెంట్ రిజిస్ట్రార్, సబ్ డివిజన్ కో–ఆపరేటివ్ ఆఫీసర్ నిరంజన్ రైతులకు రెండవ విడత నోటీసులు ఇచ్చారు.
రైతుల్లో ఆందోళన
తమకు తెలియకుండా, తాము ఎక్కడా సంతకాలు చేయకుండా, తమ పేరుతో రుణాలు తీసుకున్నట్టు తెలిసి నోటీసులు అందుకున్న సొసైటీ సభ్యులు విస్తుపోయారు. బ్యాంకు చుట్టూ తిరిగినా రుణాలు ఇవ్వని బ్యాంక్ సిబ్బంది, కనీసం బ్యాంకుకు కూడ వెళ్లకుండా తమకు రుణాలు ఇచ్చినట్టు, వాటి రికవరీకి నోటీసులు రావడంతో లబోదిబోమంటున్నారు.
మూడు రోజుల పాటు విచారణ
రైతులకు నోటీసులు ఇచ్చిన నిరంజన్ మూడు రోజుల పాటు రైతులను విచారించనున్నట్టు తెలిపారు. మొదటి రోజు గారపాడు గ్రామానికి చెందిన రైతులను, మిగిలిన రోజులు పరస, లింగంగుంట్ల, బలుసుపాడు, పెదకూరపాడుకు చెందిన రైతులను విచారించనున్నారు. మొదటి రోజు విచారణలో గారపాడు గ్రామానికి చెందిన రైతులు రుణాల సంగతి తమకు తెలియదని, బ్యాంక్ పుస్తకాల్లో ఉన్న సంతకాలు తమవి కావని తెలిపారు.
రుణాల సంగతి మాకు తెలియదని చెప్పారు
బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారుల ఆదేశాలతో విచారణ చేపట్టాం. పరసతాళ్ళూరు సొసైటీ పరిధిలో 41 మంది సభ్యులకు సుమారు రూ.50 లక్షలకు పైగా రుణాలు ఇచ్చినట్టు బ్యాంక్ నగదు పుస్తకంలో రాసి ఉంది. బ్యాంక్ సిబ్బంది ఫిర్యాదు మేరకు రైతులకు నోటీసులు అందించాం.అందులో భాగంగా రైతులను విచారణకు పిలవగా, వారు తాము సొసైటీలో సభ్యులమే కానీ, తాము ఎలాంటి రుణాలు తీసుకోలేదని చెప్పారు. ఇదే విషయాన్ని రికార్డు చేసి రైతులకు చదివి వినిపించి సంతకాలు తీసుకుంటున్నాం. –నిరంజన్, ఆసిస్టెంట్ రిజిస్ట్రార్,సబ్ డివిజన్ ఆఫీసర్, సత్తెనపల్లి
Comments
Please login to add a commentAdd a comment