కోత్తే కూలి డబ్బులు రావు..దున్నేత్తాను..
అమలాపురం : ప్రతి వరిదుబ్బుకూ.. నేలతల్లి కానుకగా ఇచ్చిన కాసులపేరుల్లా పసిడివన్నె కంకులు ఊగుతూ ఉండాల్సిన తరుణంలో ఆ పంటచేను..దొంగలు పడ్డ ఇంటిలా మారిపోయింది. పదిరోజుల్లో కోతకు వచ్చి, రైతు ఆశలను పండించాల్సిన పైరు..ఎండిపోయింది. కళ్లంలో పంటను నూర్చి బంగరు గింజల్ని చూసి మురిసిపోవాలనుకున్న ఆ రైతు కళ్లలో నీరు కమ్ముకుంది.
రాత్రంబగళ్లు కంటిని రెప్పలా కాసి, బిడ్డను తల్లిలా సాకి పెంచిన పంట తెగులు బారినపడి..కష్టం, పెట్టుబడి కోల్పోయే స్థితిలో నిర్వేదానికి గురైన ఆ రైతు దక్కే కాసిన్ని గింజలను కూడా వదులుకుంటున్నాడు. మట్టిని పిండి, పెంచిన పైరును ఆ మట్టిలోనే కలిపేయాలనుకుంటున్నాడు. ముమ్మిడివరం మండలం మహిపాల చెరువుకు చెందిన మట్టా నాగేశ్వరరావు దుస్థితి ఇది. మూడున్నర ఎకరాల కౌలు భూమిలో నాగేశ్వరరావు వరి పండించాడు. మరో పది రోజుల్లో పంటను కోత కోయించి వచ్చిన ధాన్యాన్ని మార్కెట్‌కు తరలించాల్సి ఉంది.
ఈ సమయంలో ఎండాకు (బ్యాక్టీరియా) తెగులు పైరును ఆశించింది. నాగేశ్వరరావు ఆశలను నాగుపాములా కాటేసింది. ఎండాకు తెగులు దెబ్బకు చేను మొత్తం ఎండిపోయినట్టు మారిపోయింది. పాలుపోసుకుని గింజ గట్టిపడుతున్న సమయంలో ఆశించిన ఈ తెగులు వల్ల వరి కంకులు కూడా మాడిపోయినట్టయ్యాయి. గింజలు తప్పతాలుగా తయారయ్యాయి. సాధారణంగా సుడిదోమ, ఎండాకు తెగులు, మాగుడు తెగులు.. వంటివి చేలను ఆశించినా ఉధృతి అక్కడక్కడా మాత్రమే ఉంటుంది. అయితే నాగేశ్వరరావు చేను మొత్తం దెబ్బ తింది. మరో చోట మరికొంత సొంత భూమిలో వరి సాగు చేసిన నాగేశ్వరరావుకు అక్కడా చేదు అనుభవమే మిగిలింది.
ఆ చేలను సుడిదోమ ఆశించడంతో దిగుబడి గణనీయంగా పడిపోనుంది. ఈ ఏడాది పెట్టుబడులు కూడా రావని బెంగటిల్లుతున్న ఆ రైతు.. ఎండాకు తెగులు సోకిన పైరు గురించి నిర్వేదంతో ఇలా అంటున్నాడు : ‘ఈ చేను కోత్తే ఏటి లాబం? కూలి డబ్బులు కూడా వచ్చేలా లేవు. దున్నేసి దాళ్వా ఏసేత్తాను. ఎకరాకు 22 యేలు పెట్టుబడయ్యింది. శిస్తుతో కలిపితే 33 యేలు. రుణాలు పోతాయని పాత అప్పు కట్లేదు. బ్యాంకోళ్లు అప్పు ఇవ్వం పొమ్మన్నారు. బీమా కూడా లేదు. పెట్టిందంతా మట్టిలో కలిసి పోయింది’. ఈ నిర్వేదం నాగేశ్వరరావుదే కాదు.. డెల్టాలో పంట చేతికి అందే వేళ తెగుళ్ల బారిన పడి తీవ్రంగా నష్టపోయిన వేలమంది రైతులది కూడా. ప్చ్!