రైతు కుటుంబంలో విద్యాకుసుమం
► ఐసీడబ్ల్యూఏ (సీఎంఏ) విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు
► పట్టుదల..ఆశయమే నడిపింది!
క్రమశిక్షణ.. పట్టుదల.. అంకితభావం.. లక్ష్యసాధనకు తపన.. ఇవి ఉంటే చాలు మనిషిని అత్యంత ఉన్నత శిఖరాలు అధిరోహించగలుగుతాడనడానికి నిదర్శనంగా నిలిచాడు జిల్లాలోని తొట్టంబేడు మండలం చోడవరం గ్రామానికి చెందిన రైతుబిడ్డ మోహన్‌కుమార్. జీవితంలో ఉన్నతస్థాయి చేరుకోవాలన్నదే అతడి లక్ష్యం.. సిద్ధాంతం. అతడు నమ్మిన ఆ సిద్ధాంతమే ఆ రైతుబిడ్డను పల్లె నుంచి ఐసీడబ్ల్యూఏ (సీఎంఏ) విభాగంలో జాతీయ స్థాయికి తీసుకెళ్లింది. చోడవరం గ్రామానికి చెందిన రైతు దంపతులు నాగరాజరెడ్డి, మంజుల సంతానం మోహన్‌కుమార్ ఈ నెల 3వ తేదీన విడుదల చేసిన ఐసీడబ్ల్యూఏ (సీఎంఏ) ఫైనల్ విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్‌ను సాధించాడు. ఈ సందర్భంగా అతడితో ముఖాముఖి.
ప్రశ్న: సీఏ చేయాలన్న కోరిక ఎలా కలిగింది?
జవాబు: నా తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తూ నన్ను కష్టపడి చదివించారు. వారి కష్టాన్ని ప్రత్యక్షంగా చూడడంతో ఎప్పటికైనా ఉన్నత స్థాయికి ఎదగాలన్న ఆలోచన నాలో కలిగింది. పదో తరగతి వరకు చిత్తూరు జిల్లాలోనే చదివాను. ఆ తరువాత ఒంగోలులో నా బంధువుల ఇంట్లో ఉంటూ ఇంటర్మీడియట్ పూర్తి చేశాను. ఇంటర్మీడియట్ చదివే సమయంలో సీఏ చేయాలన్న కోరిక నా లో కలిగింది. నేను సీఏ చేయడానికి నా తల్లిదండ్రుల కష్టం, ప్రోత్సాహం ఎనలేనిది.
ప్ర: సీఏ కోర్సును ఎందుకు ఎంచుకున్నారు? కోర్సుకు ఖర్చును ఎలా భరించారు?
జ: ఇంటర్మీడియట్ చదివే రోజుల్లో నా గమ్యాన్ని ఎంచుకున్నాను. అప్పట్లో నాకు ఇంజినీరింగ్ చదవాలన్న మక్కువ ఉండేది. అయితే ఆ రోజుల్లో సాఫ్ట్‌వేర్ భూమ్ అంతగా లేకపోవడంతో నేను సీఏ పూర్తి చేయాలనుకున్నాను. నా కుటుంబానికి ఆర్థిక స్థోమత లేనప్పటికీ కష్టపడి చదివితే మార్గం దొరుకుతుందన్న ఆలోచనతో ముందుకెళ్లాను. పై చదువులు పూర్తి చేసుకుని బెంగళూరులోని విప్రో సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేరాను. అక్కడ వచ్చే జీతంతో కోర్సు పూర్తి చేశాను.
ప్ర: జాతీయ స్థాయి మొదటి ర్యాంకు సాధనకు మీరు రూపొందించుకున్న ప్రణాళికలేవి?
జ: ఏకాగ్రత ఉంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. మొదట్లో సరైన అవగాహన లేకపోయినా కోర్సు ప్రాధాన్యత, భవిష్యత్ గురించి ఆలోచించి చదివాను. సోషల్ మా ధ్యమాలు, ఇతర ఎటువంటి ప్రలోభాల మాయలో పడకుండా కష్టపడి చదివాను. మెయిన్ పరీక్షలు రాసే ముందు రెండు సార్లు ప్రాక్టీస్ టెస్టులను పూర్తి చేయడం వలన జాతీయ స్థాయిలో ర్యాంకు సాధించగలిగాను.
ప్ర: చాలా మంది సీఏ అంటేనే భయపడుతుంటారు.. ఆ భయం తొలగడానికి మీరిచ్చే సలహా ఏమిటి?
జ: సామాన్యంగా సీఏ చాలా మంది భయపడడం వాస్తవమే. ఒక పాఠ్యాంశం ఫెయిల్ అయితే తిరిగి అన్నీ సబ్జెక్టులు రాయాలన్నా భయంతో చాలా మంది విద్యార్థులు సీఏ వైపు ఆసక్తి చూపడం లేదు. భయంతో చది వితే దేనినీ సాధించలేం. సీఏ అంటే భయపడాల్సినంత పనేమీ ఉండదు. మొదట్లో కొద్దిగా కష్టంగా ఉన్నప్పటికీ రానురాను ఆ కోర్సుపై మక్కువ పెంచుకోవచ్చు. సీఏ చేయడం వలన మంచి భవిష్యత్ ఉంటుందన్నదే నా అభిప్రాయం.
ప్ర: మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?
జ: ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం ఇంకా ఒక సంవత్సరం వరకు కొనసాగిస్తాను. ఆ తరువాత నేను సొంతంగా చా ర్టెడ్ అకౌంటెంట్‌గా స్థిరపడాలను కుం టున్నాను.