అనంతపురం అర్బన్:
జిల్లాలో రైతుల బలవన్మరణాలపై మాజీ ఎంపీ, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకటరామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలకు పరిహారం అందజేసి వారిని ఆదుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కోరారు. ఈ మేరకు సీఎంకు ఆయన లేఖ రాశారు. ఈ వివరాలను శుక్రవారం ఆయన తన స్వగృహంలో విలేకరులకు వివరించారు.
జిల్లాలో ఏర్పడిన తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల ప్రజలు తాగు, సాగునీటికి కటకట పడుతున్నారన్నారు. పశుగ్రాసం లేని కారణంగా జిల్లాలో రైతులు తమ పాడి పశువులను కబేళాలకు అమ్ముకునే దారుణమైన పరిసస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రుణాలు దక్కని పరిస్థితి ఉందన్నారు. ఆత్మసస్థైర్యం, ఆత్మాభిమానాన్ని కోల్పోతున్న రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వాలు అందజేసిన విధంగా సహాయాన్ని అందించి రైతు సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరినట్లు ఆయన వివరించారు.
సీఎంకు ఎంపీ పంపిన లేఖలోని వివరాలిలా...
‘గత ఎన్నికలకు ముందు మీరు ‘మీ కోసం’ అంటూ అనంతపురం జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించారు. అప్పట్లో మీరు రైతులను అన్ని రకాల రుణాల బాధల నుంచి విముక్తులను చేస్తామని ప్రకటించిన విషయాన్ని మీ దృష్టికి తెస్తున్నామన్నాను. మీ హామీ నేటికీ అమలుకు నోచుకోక పోవడంతో జిల్లా రైతాంగం అనేక విధాలుగా ఆర్ధిక ఇబ్బందులకు గురయ్యారు.. గురువుతూనే ఉన్నారు.
వ్యవసాయ సంక్షోభంతో రైతులు అప్పుల ఊబిలో కూరుకు పోయారు. బయట పడలేని దుర్భర స్ధితిలో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది మే నుంచి 59 మంది ఆత్మహత్య చేసుకున్న రైతుల వివరాలు మీ దృష్టికి రావడం లేదని భావిస్తున్నాను. జిల్లాలో జరుగుతున్న ఆత్మహత్యల స్థితిగతులను త్రిసభ్య కమిటీతో విచారణ జరిపించండి. అదేవిధంగా ఆత్మహత్యలు చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి వెంటనే ఆర్ధిక పరిహారాన్ని అందించి, రైతు కుటుంబాలను ఆదుకోండి’
ఆత్మహత్యల రైతు కుటుంబాలను ఆదుకోండి
Published Sat, Nov 8 2014 2:26 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement