గుంటూరు: గుంటూరు మిర్చి యార్డులో నెలరోజులకుపైగా ధరల పతనంతో కడుపు మండిన రైతన్నలు మంగళవారం రహదారిపై బైఠాయించి ఆందోళన చేశారు. రైతు సంఘాలు, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో గుంటూరు మిర్చి యార్డు - చికలకలూరిపేట రహదారిపై ఆందోళన చేశారు. కమిషన్, మచ్చుల పేరుతో మిర్చియార్డులో అధిక వసూళ్లని అరికట్టాలని, రైతుబంధు పధకం ద్వారా కోల్డ్ స్టోరేజీలో రుణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
రైతు తాను తీసుకుని వచ్చిన మిర్చికి గిట్టుబాటు ధర కోసం సెక్యూరిటీ గార్డులు కర్రతో దాడి చేశారని సత్తెనపల్లి, నకరికల్లు మండలానికి చెందిన రైతు కోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. గంటకుపైగా వారు రహదారిపై బైఠాయించడంతో పెద్దఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, ఉపాధ్యక్షుడు కృష్ణయ్య, కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి జమలయ్య, జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్. లక్ష్మణరావు, ప్రకాశం జిల్లా రైతు సంఘం నాయకులు వెంకట్రావ్, హన్మంతరావు తదితరులు పాల్గొన్నారు.