మిర్చి రాయితీకి తాలు మెలిక
► చిన్నమచ్చ ఉన్నా కొనుగోలు చేయని వ్యాపారులు
► తొలిరోజు 67 వేల బస్తాల రాక
► రాయితీ ఇచ్చింది 2 వేల బస్తాలకే
► ఆగ్రహం వ్యక్తం చేస్తున్న రైతులు
ప్రభుత్వం ప్రకటించిన మిర్చి రాయితీ పథకానికి తాలు కాయలు కొనుగోలు చేయబోమని మెలిక పెట్టడంపై రైతులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువ ధరకే పంటంతా తెగనమ్ముకున్నాక రాయితీ ఇస్తామనడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. మిరప చివరి కోతలు తాలు కాయలే వస్తాయని, వాటికి రాయితీ నగదు ఇవ్వకపోతే ఎలా అని రైతులు ప్రశ్నిస్తున్నారు.
సాక్షి, అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం మిర్చి రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు హడావుడిగా ప్రకటించిన రాయితీ పథకంపై గందరగోళం నెలకొంది. బుధవారం అర్ధరాత్రి వరకు సాగు పత్రాల విషయంలో వ్యవసాయ అధికారులకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందలేదు. రాష్ట్రంలోని కర్నూలు, ప్రకాశం తదితర జిల్లాల నుంచి వచ్చిన రైతులు నానా అగచాట్లు ఎదుర్కొన్నారు. పత్రాల కోసం రైతులు వ్యవసాయశాఖ అధికారుల వద్దకు వెళ్లినా సరిగా స్పందించకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మిరప రాయితీ పథకాన్ని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు గురువారం ఉదయం 10.30 గంటలకు ప్రారంభించినప్పటికీ అందుకు తగ్గ ఏర్పాట్లు కనిపించలేదు.
తొలిరోజు 2 వేల బస్తాలకే రాయితీ పథకం వర్తింపు...
మార్కెట్ యార్డులో 67 వేల బస్తాలకు పైగా మిర్చి అమ్మకాలు చేపట్టారు. ఇందులో రాయితీ పథకం వర్తింపులోకి కేవలం 2 వేల బస్తాలు వచ్చినట్లు సమాచారం. కొందరు వ్యాపారులు సరకు కొనుగోలు చేసి రైతుల ముసుగులో సరకును మార్కెట్ యార్డుకు తరలించినట్లు సమాచారం. ప్రభుత్వం 15 లక్షల క్వింటాళ్ల సరకు ఉందని అంచనా వేసినప్పటికీ అంత సరుకు లేదని రైతు సంఘాలు చెబుతున్నాయి. మిర్చి యార్డులో ఉదయం సరకును పరిశీలిస్తే చివరి కోత కావడంతో దాదాపు ఎక్కువ శాతం తాలు కాయలే ఉన్నట్లు తెలిసింది.
దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందస్తుగానే తాలు సరకుకు రాయితీ వర్తించదని మెలిక పెట్టడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం రాయితీ కల్పిస్తే ఇంతకు మునుపు సరకు అమ్మిన రైతులతో పాటు, కోల్డ్‌స్టోరేజీల్లో నిల్వ ఉంచినవారికి, ప్రస్తుతం సరకు అమ్ముతున్నవారికి కలిపి అందరికీ క్వింటాలుకు రూ.1500 చొప్పున రాయితీ కల్పించాల్సిందేనని ముక్తకంఠంతో అన్నదాతలు డిమాండ్ చేస్తున్నారు.
ఎంతో ఆశతో వచ్చాం
నేను మూడు ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశాను. కేవలం 30 క్వింటాళ్ల లోపే దిగుబడి వచ్చింది. ఎకరాకు రూ.1.25 లక్షల పెట్టుబడి పెట్టాను. సరకు తెచ్చేందుకు క్వింటాకు రూ.400 ఖర్చు అయింది. కోత కూలీల కోసం రూ.15 వేలు పైగా ఖర్చు చేశాను. అయితే సరకును తాలు కింద వేసి వ్యాపారులు క్వింటా రూ.1500కు అడుగుతున్నారు. ప్రభుత్వ రాయితీ కూడా వర్తించదని చెబుతున్నారు. ఎంతో ఆశతో వస్తే నిరాశే ఎదురైంది. దీంతో అంత పెట్టుబడి గంగ పాలు కాగా, అదనంగా ఖర్చులకు డబ్బులు ఎక్కడ నుంచి తేవాలో అర్థంకావడం లేదు. -షేక్ మొహమ్మద్ హుస్సేన్, టంగుటూరు, బనగానపల్లె మండలం
వ్యవసాయాధికారి లేరు
వ్యవసాయ అధికారి గుంటూరులో మీటింగ్‌కు వచ్చారంట. ఆఫీసుకు తాళం వేసి ఉంది. ప్రభుత్వం రాయితీ ఇస్తుందని సరకును మార్కెట్ యార్డుకు తెచ్చాను. తీరా వచ్చిన తర్వాత ఇక్కడ సరకు దించాలో, వెనక్కు తీసుకెళ్లాలో దిక్కుతోచడం లేదు. మళ్లీ అచ్చంపేటకు వెళ్లి సర్టిఫికెట్లు తెచ్చుకోవాల్సిందే. సాగు పత్రం తీసుకు రమ్మనడంతో ఇబ్బందులు పడుతున్నాం. -నడింపల్లి శ్రీనివాసులు, అచ్చంపేట, కొత్తపల్లి గ్రామం, గుంటూరు జిల్లా
రైతుల గతి ఇంతే
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రైతులకు ఎప్పుడూ సుఖం లేదు. చంద్రబాబు ‘వ్యవసాయం దండగ’ అన్న మాదిరే సాగుతోంది. ఇప్పుడు పండుగ చేస్తామని చెబుతున్నప్పటికీ మార్పు లేదు. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి హయాంలోనే రైతులకు సంతోషంగా కాలం గడిచిపోయింది. మిర్చికి చిన్న మచ్చ వచ్చినా తాలుకింద తీసేస్తున్నారు., రైతు ఎలా బతకాలి. -సదాశివారెడ్డి, పోలూరు, కర్నూలు జిల్లా