గజపతినగరం రూరల్ : ఉత్తరాంధ్రలోని రైతు బజార్లను దశల వారీగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనర్ , డెరైక్టర్ పి. మల్లికార్జునరావు అన్నారు. గురువారం స్థానిక వ్యవసాయ శాఖ మార్కెట్ కార్యాలయంలో ప్రారంభమైన మామిడి క్రయ, విక్రయ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో ఉన్న రైతుబజార్లను స్వయంగా పరిశీలించి అభివృద్ధి చేయనున్నట్లు చెప్పారు. చీపురుపల్లి, ఎచ్చెర్ల, విశాఖపట్నంలో ఉన్న మూడు రైతుబజార్లలో ఎంత వ్యాపారం జరుగుతుందీ తెలుసుకుంటున్నట్లు తెలిపారు.
50 బజార్ల ఆధునీకరణ
రాష్ట్ర వ్యాప్తంగా 80 రైతు బజార్లుండగా అందులో 50 ఆధునీకరించామని, మరో పదింటిని జూన్ నెలాఖరులోగా ఆధునీకరిస్తామని మల్లికార్జునరావు చెప్పారు. ‘పొలం నుంచి ఇంటికి’ నినాదంలో భాగంగా విశాఖపట్నం, ఆనందపురం, చోడవరంలో ప్రత్యేక స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
మామిడితో పాటు పలు రకాల కూరగాయలను స్టాల్స్‌లో పెట్టి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తామన్నారు. ఇందుకోసం ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ ప్రాంతీయ సంచాలకుడు కె.శ్రీనివాసరావు,ఉపసంచాలకుడు పి.వి.సుధాకర్, ఎ.డి. బి.శ్రీనివాసరావు, బొండపల్లి జెడ్పీటీసీ సభ్యుడు బండారు బాలాజీ, మార్కెట్‌యూర్డు సెక్రటరీ ఆర్.ప్రభాకర్,సూపర్‌వైజర్ అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.
రైతుబజార్ల అభివృద్ధికి చర్యలు
Published Fri, Apr 22 2016 12:02 AM | Last Updated on Mon, Oct 1 2018 2:27 PM
Advertisement