కన్నీటి కష్టాలు
Published Fri, Feb 28 2014 2:46 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
అమలాపురం, న్యూస్‌లైన్ :ఎసరు పెట్టేందుకు నీరు లేకపోతే ఎంత నాణ్యమైన బియ్యం ఉన్నా.. నోటికి అన్నం అందదు. అలాగే ఎంత కష్టపడి నాట్లు వేసినా, పైరును పసిబిడ్డను సాకినట్టు సాకినా, అదనుకు నీరు అందకపోతే చేతికి పంట రాదని వాపోతున్నారు అన్నదాతలు. గోదావరి డెల్టాలో రబీ వరిసాగు సగంలో ఉండగానే ఎదురవుతున్న నీటి ఎద్దడి వారిని కలవరానికి గురి చేస్తోంది. ముఖ్యంగా తూర్పు, మధ్య డెల్టాల్లోని శివారు ప్రాంతాల్లో పొలాలు నీటి తడి లేక బీటలు తీస్తున్నాయి. చేలు పొట్ట దశలో ఉన్న ప్రస్తుత సమయంలో నీరు పూర్తి స్థాయిలో అందక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తీరంలోని శివారు భూముల్లో అయితే చౌడుబారి చేలు ఎండిపోతున్నాయి.
నీరు లేక చేలల్లో కలుపు, ఎలక్కొట్టుడు పెరిగిపోతున్నాయి. తెగుళ్లు ముప్పేట దాడి చేస్తున్నాయి. ఈ కారణంగా దిగుబడి తగ్గే ప్రమాదముందని రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి కోసం, తెగుళ్ల నివారణ కోసం, కలుపు తీసే కూలీల కోసం అదనంగా ఖర్చు చేయాల్సి వస్తోంది. దీంతో పెట్టుబడి తడిసి మోపెడవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఖరీఫ్ పంట నష్టపోయి రబీపై ఆశలు పెట్టుకున్న రైతులను ఈ పరిణామాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి.జిల్లాలోని గోదావరి డెల్టాలో ఈ ఏడాది 3.60 లక్షల ఎకరాల్లో రబీ వరి సాగు జరుగుతోంది. వాతావరణం ఆశాజనకంగా ఉండడంతో ఎకరాకు 45 నుంచి 55 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే శివారులో నీటి ఎద్దడి ఆ అంచనాను తలకిందులు చేసే ముప్పుంది.
మోటార్లు, నత్తగుల్లలే దిక్కు
పంటబోదెలు, చానళ్లలో నీరు అడుగంటి చేలకు నేరుగా పారడం లేదు. దీంతో బోదెలు, మురుగు కాలువల నుంచి రైతులు మోటార్లు, నత్తగుల్లలతో నీరు తోడుకుంటున్నారు. కొన్ని చానళ్లలో నీరు పూర్తిగా అడుగంటింది. విధిలేని పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న చెరువులు, మురుగునీటి గుంటల నుంచి రైతులు నీటిని తోడుతున్నారు. ఇది తమకు అదనపు భారంగా మారిందని వారు వాపోతున్నారు. నత్తగుల్లతో నీరు తోడించేందుకు కూలీకి రోజుకు రూ.400 నుంచి రూ.500 వరకూ ఇవ్వాల్సి వస్తోందని చెబుతున్నారు. మోటార్లతో చేలకు నీరు తోడాలంటే ఒకసారి తడి పెట్టేందుకు గంటకు రూ.100 చొప్పున ఎకరాకు నాలుగు గంటల చొప్పున రూ.400 అవుతోంది. కాలువల ద్వారా పూర్తి స్థాయిలో నీరు అందించకుంటే ముందుముందు పెట్టుబడి మరింత పెరుగుతుందని రైతులు కలవరపడుతున్నారు.
నీటి ఎద్దడితో పెరుగుతున్న కలుపు
నీటి ఎద్దడి కారణంగా డెల్టాలోని పంట చేలల్లో కలుపు విపరీతంగా పెరుగుతోంది. చేలల్లో పది పదిహేను మంది కూలీలు కలుపు తీస్తున్న దృశ్యాలు పలుచోట్ల కనిపిస్తున్నాయి. ఎకరా కలుపు తీసేందుకు కూలీలకే రూ.రెండు మూడు వేలు ఖర్చు పెట్టాల్సి వస్తుందని రైతులు చెబుతున్నారు. శివారు చేలల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. బురద నేలల్లో సాధారణ కలుపుతోపాటు ఫిస్టియా కలుపు ఎక్కువగా వస్తోంది. చేలల్లోని ఉదర భాగం, నీటిమీద వస్తున్న ఈ కలుపు తీయించడం రైతులకు ఇబ్బందిగా మారుతోంది. చేలల్లో జల్లే ఎరువులు, పురుగు మందులను వరి మొక్కకన్నా ముందు ఈ ఫిస్టియా సంగ్రహించడం రైతులకు శాపంగా మారుతోంది. పంటకు చెరుపు.. రైతుకు వెరపు.. ఈ కలుపు : కాజులూరు మండలం కోలంకలో వరి చేలో అల్లుకుపోయిన ఫిస్టియా
Advertisement
Advertisement