మట్టి మీదొట్టు.. మా కష్టమే తీసికట్టు
Published Sun, Dec 29 2013 2:47 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
అమలాపురం, న్యూస్‌లైన్ :నాలుగు దశాబ్దాల్లో ప్రపంచం ఎంతో మారిపోయింది. ఆధునిక, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఎన్నో మార్పులొచ్చాయి. వస్తు విని యోగం భారీగా పెరిగింది. అదేస్థాయిలో వాటి ధరలు సైతం భారీగా పెరిగాయి. ఉద్యోగులు, ప్రజా ప్రతినిధుల జీతాలు, బంగారం ధరలు రెండు వందలకు పైగా రెట్లు పెరిగాయి. అయితే ఈ నలభై ఏళ్లలో పెరగాల్సిన స్థాయిలో పెరగనివి ఏమైనా ఉన్నాయంటే అవి వ్యవసాయ ఉత్పత్తుల ధరలేనని రైతులు ఘోషిస్తున్నారు. ఇదే సమయంలో సాగుకు అవసరమైన ఎరువులు, పురుగుమందులు, ఇతర సామగ్రి ధరలు, కూలి రేట్లు మాత్రం వందకు పైగా రెట్లు పెరిగాయని, ధాన్యం ధర 20 రెట్లు, కొబ్బరి ధర ఎనిమిదిన్నర రెట్లు మాత్రమే పెరిగాయని ఆక్రోశిస్తున్నారు. ఇదే ప్రస్తుత వ్యవసాయ సంక్షోభానికి కారణమని మట్టి మీద ఒట్టేసి చెపుతున్నారు. ‘లాభసాటి ధర, న్యాయమైన పరిహారం తక్షణం ఇవ్వాలి’ అని ఎలుగె త్తుతున్నారు. ఇందుకు ఎన్నోసార్లు ఉద్యమించినా ప్రభుత్వం స్పందించకపోవడంతో విసుగుచెందిన రైతులు మరో ఆందోళనకు శ్రీకారం చుట్టారు. ఈసారి వినూత్న పంథాను ఎంచుకున్నారు. తమది.. ఎవరో సిరిసంపదలతో తులతూగుతూ, సుఖసంతోషాలతో తేలియాడుతున్నారన్న దుగ్ధ కాదని, తాము దుఃఖపు కోరల నుంచి విముక్తం కావాలన్నదే తమ ధ్యేయమని స్పష్టం చేస్తున్నారు.
నలభై ఏళ్లలో ఎమ్మెల్యేలకు, ఉపాధ్యాయులకు పెరిగిన జీతాలు, పుత్తడి ధరలు.. వరి, కొబ్బరికి పెరిగిన ధరల మధ్య వ్యత్యాసాన్ని వివరించే కరపత్రాలు ముద్రించి ప్రచారం చేయడమే కాక మరో ఉద్యమానికి సన్నద్ధమయ్యారు. కోనసీమ కేంద్రమైన అమలాపురంలో సోమవారం ‘రైతుల మహాధర్నా’ నిర్వహించనున్నారు. అమలాపురంలోని సుబ్బారాయుడు చెరువు నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేసి, కార్యాలయం ఎదుట మహాధర్నా నిర్వహించనున్నారు. భారతీ కిసాన్ సంఘ్ (బీకేఎస్) ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలో సమైక్యాంధ్ర కోనసీమ రైతు జేఏసీ, కోనసీమ రైతు పరిరక్షణ సమితితోపాటు పలు రైతు, రైతు అనుబంధ సంఘాలు పాలు పంచుకుంటున్నాయి.
పార్లమెంట్ ముఖం చూడని స్వామినాథన్ నివేదిక
వరి, కొబ్బరితో పోల్చుకుంటే చెరకు ధర 46 రెట్లు, పాల ధర 100 రెట్లు పెరిగింది. జీతాలు, బంగారం స్థాయిలో కాకున్నా కనీసం పంటకు పెట్టిన పెట్టుబడికి 50 శాతం పెంచి లాభసాటి ధర కల్పించాలని రైతులు కొన్నేళ్లుగా డిమాండ్ చేస్తున్నా ఫలితం లేదు. ఎన్డీఏ హయాంలో వాజ్‌పాయ్ ప్రభుత్వం నియమించిన ఎం.ఎస్.స్వామినాథన్ కమిటీ సిఫారసూ ఇదే అయినా ఆ నివేదిక ఇప్పటి వరకు పార్లమెంట్ ముఖమే చూడలేదు. పంటకు లాభసాటి ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నా... ప్రకృతి విపత్తుల వల్ల పంట దెబ్బతినడంతో కనీసం గిటుబాటు ధర దక్కినా చాలనుకుంటారు. అయితే ప్రభుత్వం ఈ విషయాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. ఖరీఫ్‌లో క్వింటాల్ ధాన్యం పండించడానికి రూ.1,142 పెట్టుబడి అవుతుంటే మద్దతు ధర రూ.1,310 కావడం గమనార్హం. దీని ప్రకారం క్వింటాల్‌కు రూ.168 మాత్రమే మిగులుతుంది. అయితే విపత్తుల వల్ల అంచనాలో సగం కూడా దిగుబడిగా రాకపోవడం, వచ్చిన ధాన్యం రంగుమారడంతో రైతులు మరింంగా నష్టపోతున్నారు. పంట నష్టానికి తక్షణం ఇవ్వాల్సిన ఇన్‌పుట్ సబ్సిడీ (పెట్టుబడి రాయితీ), బీమా పరిహారం చెల్లింపుల్లో ప్రభుత్వం ఆలస్యం చేస్తుండడం వల్ల వ్యవసాయం దండగ వ్యవహారంగా మారింది. ఒక్క వరే కాదు. కొబ్బరి, అరటి, చెరకు, మిగిలిన పంటలు సాగు చేసినా పరిస్థితి ఆశాజనకంగా లేకపోవడంతో రైతులు ఈ ఆందోళనకు సిద్ధమవుతున్నారు.
40 ఏళ్లలో జీతాలు, వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల (రూపాయిల్లో) :
సం ఎమ్మెల్యేల జీతాలు ఉపాధ్యాయల సగటు జీతం బంగారం (10గ్రా.) కూలి ధర
1970 250 90 120 1.50 2013 55,000 25,000 29,000 200
ఎన్నిరెట్లు : 220 278 242 130
సం ధాన్యం (75 కేజీలు) చెరకు (టన్ను) పాలు (లీటరు) కొబ్బరి వెయ్యికాయలు
1970 50 50 0.25 650 2013 1,000 2,300 25 5,500
ఎన్నిరెట్లు : 20 46 100 8.50
రైతులు డిమాండ్ చేస్తున్న పరిహారం ఇలా (ఎకరాకు)
వరి రూ.10 వేలు
కొబ్బరి రూ.40 వేలు
అరటి రూ.75 వేలు
కూరగాయలు రూ.25 వేలు
Advertisement
Advertisement