పంటలకు దెబ్బ
చేగుంట: మండలంలో కురిసిన అకాల వర్షానికి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు పలు గ్రామాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురిశాయి. గొల్లపల్లి తండాలోని కాశీరాం, దన్ను, సోమ్లా, రవి రాంపూర్‌లోని భూషణం, శ్రీను, సిద్దిరాములు, చిన్నశివునూర్‌లో కనకయ్య, రుక్మాపూర్‌లో పంచాక్షరి, చేగుంటలో దివాకర్‌కు చెందిన మొక్కజొన్న పంట నేలకొరిగింది. దీంతో పాటు మక్కరాజిపేట, పోతాన్‌పల్లి, బి.కొండాపూర్, నార్సింగి గ్రామాల్లోనూ మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. భారీ వర్షం కారణంగా అనంతసాగర్ ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణ నీటితో నిండిపోయింది. పంట నష్టంపై అధికారులు విచారణ జరిపి పరిహారం అందించాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు.
మిరుదొడ్డిలో వడగళ్ల వాన
మిరుదొడ్డి: మండలంలోని ఆరెపల్లి, లక్ష్మీనగర్, కొండాపూర్, కాసులాబాద్, లింగుపల్లి, మల్లుపల్లిలో శనివారం సాయంత్రం వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. ఈదురు గాలులతోపాటు వడగ ళ్లతో కూడిన వర్షం కురవడంతో పొలాల వద్ద చెట్లు విరిగి పడ్డాయి. రోడ్లపై అడ్డంగా పడడంతో వాహనాల రాకపోకలకు ఆటంకం కలిగింది. పలు గ్రామాల్లో ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపడ్డాయి. పలు ప్రాంతాల్లో బీర్నిస్ పంట దెబ్బతినే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఆరుతడి పంటలకు నష్టం
కొండాపూర్: ఈదురు గాలులతో కూడిన వర్షం కురవడంతో మండలంలో ఆరుతడి పంటలకు నష్టం వాటిల్లింది. గోధుమ, ఉల్లి, పశువుల పచ్చిమేత పంటలు నేలకొరిగాయి. చేతికందే సమయంలో వానకు తడవడంతో పసుపు పంటకు మొలకలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. మామిడి చెట్లకు పూతకాత చూసి మురిసి పోయిన రైతులు అకాల వర్షంతో కన్నీరు పెడుతున్నారు. మండలంలోని గొల్లపల్లి, తేర్పోలు, మునిదేవునిపల్లి, ఎదురుగూడెం, హరిదాస్‌పూర్ తదితర గ్రామాల్లో ఆరుతడి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కౌలు రైతుల పరిస్థితి వేరే చెప్పనక్కరలేదు. దెబ్బతిన్న పంటలను వెంటనే గుర్తించి పరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరుతున్నారు.
అకాల వర్షం..రైతుకు నష్టం
Published Sat, Mar 1 2014 11:56 PM | Last Updated on Sat, Sep 2 2017 4:14 AM
Advertisement
Advertisement