వడ్డీ వ్యాపారుల బారిన రైతులు
ఆంధ్రప్రదేశ్లో రైతులకు బ్యాంకులేవీ రుణాలు ఇవ్వట్లేదని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి అన్నారు. దాంతో ఇప్పుడు పంటల సీజన్ కావడంతో రైతులు పెట్టుబడుల కోసం వడ్డీ వ్యాపారుల బారిన పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతు రుణాలు మాఫీ చేయడంపై సమగ్రంగా అధ్యయనం చేసిన అనుభవంతోనే రుణమాఫీపై హామీ ఇచ్చానన్న చంద్రబాబు.. ఇప్పుడు షరతులు విధించడం సరికాదని అన్నారు.
రైతులు ఎవ్వరూ రుణాలు చెల్లించే పరిస్థితి లేదని ఎన్నికల సమయంలో చెప్పి, అందుకే రుణాలు మాఫీ చేస్తానని.. ఇప్పుడు మళ్లీ స్థోమత ఉన్న రైతులు రుణాలు కట్టాలనడం సరికాదని రఘువీరారెడ్డి అన్నారు. డ్వాక్రా మహిళలపై కూడా రుణాల చెల్లింపు కోసం అధికారులు ఒత్తిడి చేస్తున్నారని, కట్టకపోతే సంఘాలు రద్దు చేస్తామంటున్నారని ఆయన తెలిపారు. రుణాల మాఫీపై కేబినెట్ నిర్ణయాలకు విలువలేకుండా పోయిందని చెప్పారు.