భవిష్యత్తేమిటో?
సాక్షి, విజయవాడ బ్యూరో: రాజధాని ప్రాంతంలోని రైతులు, రైతు కూలీలు, కౌలుదారులను ఇప్పుడు భవిష్యత్ భయం పట్టుకుంది. రకరకాల ఒత్తిళ్లు, బెదిరింపులకు పాల్పడటం ద్వారా ప్రభుత్వం భూములు లాగేసుకున్న.. రైతు కుటుంబాలు, ఆ భూములనే నమ్ముకున్న కౌలుదారులు, వ్యవసాయంపై ఆధారపడిన కూలీల కుటుంబాలన్నీ తమ బతుకులు అతలాకుతలమవుతాయని ఆందోళన చెందుతున్నాయి. మాయమాటలు, మభ్యపెట్టడాలకు తోడు భవిష్యత్‌లో రంగుల ప్రపంచాన్ని చూపడంతో కొందరు ఇష్టపూర్వకంగానే భూములను అప్పగించినప్పటికీ.. తమ భవిష్యత్తేమిటో తెలియని అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. మెజారిటీ రైతుల్లో ఎంతోకాలంగా నమ్ముకున్న పంట భూములను కోల్పోయామనే ఆవేదన, ఆందోళన నెలకొంది.
సమీకరణ పేరుతో తీసుకున్న భూముల్లో వచ్చే ఏప్రిల్ నుంచి పంటలు వేసుకోవద్దని ప్రభుత్వం హుకుం జారీ చేయడంతో.. తరతరాలుగా భూములనే నమ్ముకుని బతుకుతున్న అనేక కుటుంబాలు రోడ్లపై పడనున్నాయన్న భయాందోళన వారిని వేధిస్తోంది. రాజధాని నిర్మాణం ఎప్పుడు ప్రారంభమై ఎన్నటికి పూర్తవుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారడంతో.. తాము అప్పగించిన భూమికి గాను ఎకరానికి ఇచ్చే పరిహారమైనా ఏటా సక్రమంగా అందే పరిస్థితి ఉంటుందా? రాజధాని నిర్మాణం పూర్తి కాకపోతే తమకు వాటాగా ఇచ్చిన భూమికి ఇప్పటికంటే ఎక్కువ ధర వస్తుందా? అనే ఆందోళన రైతులను వెంటాడుతోంది. ఈ పరిస్థితుల్లో వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు, తాము అండగా
ఉన్నామని భరోసానిచ్చేందుకు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాజధాని గ్రామాల్లో మంగళవారం పర్యటించనున్నారు.
రకరకాల వేధింపులు..
రాజధాని నిర్మాణానికి భూ సమీకరణ పేరుతో ప్రభుత్వం గత కొంతకాలంగా రైతులు, కౌలుదారులు, రైతు కూలీల కుటుంబాలను ముప్పుతిప్పలు పెడుతోంది. భూ సమీకరణకు అంగీకరించని రైతులను రకరకాలుగా వేధింపులకు గురిచేస్తోంది. గుంటూరు జిల్లాలో తుళ్లూరు ప్రాంతంలో రాజధానిని నిర్మిస్తామని ప్రకటన చేసిన రోజు నుంచి ఈరోజు వరకు భూ సమీకరణ కోసం ప్రభుత్వం చేయని ప్రయత్నమంటూ లేదు. రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) చట్టాన్ని అమలులోకి తెచ్చి ఆయా గ్రామాల్లో రకరకాల ఒత్తిళ్లు, బెదిరింపులతో రైతాంగాన్ని లొంగదీసుకోవడానికి అనేక ఎత్తుగడలను అనుసరించింది. కొందరు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు పార్టీ నేతలందరినీ ఆయా గ్రామాల్లో మోహరింపజేసి సమీకరణ ప్రక్రియలో అప్రజాస్వామిక పద్దతుల్లో నానా రభస సృష్టించింది.
ప్రధానంగా సమీకరణను వ్యతిరేకించిన రైతు కుటుంబాలపై రకరకాలుగా వేధింపులకు పాల్పడింది. గ్రామాల్లో కర్ఫ్యూ వాతావరణం సృష్టించి మరీ సమీకరణ ప్రక్రియను పూర్తి చేశామని చెప్పుకుంది. రాజధాని నిర్మాణానికి 50 వేల ఎకరాల పంట భూములను నాశనం చేయాల్సిన అవసరం లేదనీ, ముఖ్య కార్యాలయాల కోసం అవసరమైన మేరకు భూములు సేకరించి మిగిలిన భూములను రైతులకే వదిలేయాలన్న ప్రతిపక్ష డిమాండ్‌ను ప్రభుత్వం ఖాతరు చేయకుండా ప్రక్రియను కొనసాగించింది. గ్రామాల్లో భయానక వాతావరణాన్ని సృష్టించడం ద్వారా భూ సమీకరణ చేయడమేమిటని ప్రశ్నిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తొలి నుంచీ రైతుల పక్షాన నిలిచింది. సమీకరణకు ఉన్న చట్టబద్ధతను ఆ పార్టీ ప్రశ్నించింది. అయినప్పటికీ ప్రభుత్వం బెదిరింపులు, ఒత్తిళ్లతో అంగీకార పత్రాలను తీసుకున్న నేపథ్యంలో.. ఇప్పుడు అనేక కుటుంబాల్లో భవిష్యత్తు ఏమిటనే ఆందోళన నెలకొంది. వచ్చే ఏప్రిల్ నుంచి పంటలు వేసుకోవడానికి వీల్లేదని స్వయంగా సీఎం చంద్రబాబు ప్రకటించిన దరిమిలా ఏడాదిలో మూడు పంటలు పండించుకునే భూములను ప్రభుత్వం కబ్జా చేస్తే, తాము హక్కులు కోల్పోతే.. భవిష్యత్తేమిటని ఆయా కుటుంబాలు పునరాలోచనలో పడ్డాయి. నిజానికి ఈ విషయాలన్నింటినీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటినుంచో ఎత్తిచూపుతోంది. ఇటు అసెంబ్లీలోనూ అటు పార్లమెంట్ వేదికగా ప్రశ్నించడమే కాకుండా పార్టీ పక్షాన ప్రతినిధి బృందాలుగా రాజధాని గ్రామాల్లో పర్యటించి రైతులు పడుతున్న బాధలను తెలుసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అనునిత్యం రైతుల వెంట ఉండి మరీ అధికారులు, మంత్రుల నిర్బంధ ప్రక్రియను ఎప్పటికప్పుడు ప్రశ్నించడమే కాకుండా ప్రభుత్వ తీరును ఎండగట్టారు. పార్టీ ఆందోళనలకు కొనసాగింపుగానే వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు.
మొదటి నుంచీ మాయమాటలే...
గుంటూరు జిల్లాలోని మంగళగిరి, తాడేపల్లి, తుళ్లూరు మండలాల పరిధిలోని 29 గ్రామాల పరిధిలో రైతులకు చెందిన 30 వేల ఎకరాల భూములను తొలి విడతగా సమీకరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఏడాదిలో మూడు పంటలు పండే పచ్చని భూములను నాశనం చేసి వాటిని తీసుకున్నందుకు ఏటా ఎకరాకు కేవలం రూ.30 వేల చొప్పున పదేళ్లు పరిహారం ఇస్తామనీ, దీన్ని ఏడాదికి 5 శాతం చొప్పున పెంచుతామని ప్రభుత్వం ప్రకటించింది. ఎకరానికి వెయ్యి గజాల నివాస స్థలం, వాణిజ్య జోన్‌లో 200 గజాలు కూడా రైతులకు వాటాగా ఇస్తామని చెప్పింది. ప్రభుత్వ ప్రకటనపై రైతుల్లో తీవ్ర నిరసన వ్యక్తమైంది. ‘‘ మేము తెలుగుదేశం పార్టీ కార్యకర్తలం, సానుభూతి పరులం. అంతమాత్రాన మా భూములిచ్చి వీధిన పడాలా?’’ అని అధికార పార్టీకి చెందిన వారే బహిరంగంగా ధ్వజమెత్తారు. సమీకరణ ప్రక్రియ కొనసాగినన్ని రోజులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన నిలిచి ప్రభుత్వ దౌర్జన్యాలను ప్రశ్నించింది. అన్యాయం జరుగుతుందని ఆందోళనకు దిగిన నేపథ్యంలోనే ప్రభుత్వం తన ప్యాకేజీని 100 నుంచి 150 గజాల వరకు పెంచింది.
మంత్రి మంత్రాంగం
భూ సమీకరణ గ్రామాల్లో రైతులకు మద్దతుగా అనేక రాజకీయ పార్టీలతో పాటు, స్వచ్ఛంద సంస్థలు, హక్కుల సంఘాలు, సామాజిక వేత్తలు పోరాటానికి దిగారు. ఆలస్యం చేస్తే ఈ సమస్య తీమ్రవుతుందని ఆందోళన చెందిన సీఎం మంత్రి నారాయణను రంగంలోకి దించారు. రేయింబవళ్లు ఆయన్ను భూ సమీకరణ గ్రామాల్లోనే ఉంచి, అధికారులంతా ఆయన చెప్పినట్లు చేయాలనే ఆదేశాలు ఇచ్చారు. సమీకరణకు వ్యతిరేకంగా ఉన్న రైతులపై పోలీసు కేసులు పెట్టించడం, పోలీస్‌స్టేషన్లకు తీసుకుని వెళ్లి కొట్టించడం లాంటి పనులు కూడా చేయించింది. దీంతో రైతులు బెంబేలెత్తారు. ఫిబ్రవరి 28వ తేదీతో సమీక రణ ముగుస్తుందనీ, తర్వాత భూములకు పరిహారం కూడా కొన్నేళ్లకు గానీ రాదనే బెదిరింపులతో రైతులను ఆందోళనకు గురిచేశారు. చివరకు శనివారం సాయంత్రంతో ముగియాల్సిన సమీకరణను సోమవారం ఉదయం వరకు కూడా శనివారం నాటి తేదీతోనే కానిచ్చేశారు. 37,624.15 ఎకరాల పట్టా భూముల సమీకరణకు నోటిఫికేషన్ ఇవ్వగా సోమవారం నాటికి 32,300 ఎకరాలను అప్పగించడానికి రైతులు పత్రాలు ఇచ్చారని అధికార వర్గాలు చెప్పాయి. అయితే ఇందులో సుమారు 8 వేల ఎకరాల భూములకు సంబంధించి వివాదాలున్నాయి. అధికారులు మాత్రం 3,200 ఎకరాల భూముల్లోనే వివాదాలున్నాయని అంటున్నారు.