
రైతు సమస్యలు పరిష్కరించాలి: రోశయ్య
సాక్షి, హైదరాబాద్: రైతుల సమస్యల పరిష్కారానికి ప్రస్తుతం జరుగుతున్న కృషి చాలదని, రాజకీయ నేతలు సహా అందరూ మరింత నిబద్ధతతో కృషి చేయాలని తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య అన్నారు. ‘రైతునేస్తం’ మాసపత్రిక తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా గురువారం జూబ్లిహాల్‌లో ఏర్పాటు చేసిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రైతాంగ సమస్యల గురించి తాను చిన్నప్పటి నుంచి వింటున్నానని రోశయ్య అన్నారు. నాబార్ద్ విశ్రాంత అధ్యక్షుడు కోటయ్య అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అధికార భాషా సంఘం అధ్యక్షులు మండలి బుద్ధప్రసాద్ మాట్లాడుతూ ఇప్పటికీ మనకు సమగ్రమైన జలవిధానం లేకపోవడం ఆందోళన కలిగిస్తోందన్నారు.
సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి డి.కె.అరుణ మాట్లాడుతూ వచ్చే ఏడాది నుంచి ఉత్తమ వ్యవసాయ విలేకరులకు ప్రభుత్వం తరఫున అవార్డులు అందజేయనున్నట్లు ప్రకటించారు. శాసన మండలి చైర్మన్ చక్రపాణి, కాంగ్రెస్ కిసాన్ సెల్ అధ్యక్షులు కోదండ రెడ్డి తదితరులు ప్రసంగించారు. ‘రైతునేస్తం’ ఎడిటర్ వై.వెంకటేశ్వరరావు వందన సమర్పణ చేశారు. పలువురు రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పాత్రికేయులను ఈ సందర్భంగా రోశయ్య సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఎన్జీరంగా వ్యవసాయ యూనివర్సిటీ వీసీ డాక్టర్ అల్లూరి పద్మరాజును ‘జీవిత సాఫల్య’ పురస్కారంతో సత్కరించారు. ‘సాక్షి’ కడప వ్యవసాయ విలేకరి ఎం.ప్రభాకరరెడ్డిని సత్కరించారు.