సాగునీటి విషయమై కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డిని నిలదీస్తున్న చివరి ఆయకట్టు రైతులు
నెల్లూరు, విడవలూరు: చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే విషయంలో జోక్యం చేసుకోవాలని విడవలూరు మండలంలోని రామతీర్థం, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన రైతులు కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని శుక్రవారం అడ్డుకున్నారు. మండలంలోని రామతీర్థంలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి రైతులంతా కలసి తమ చివరి ఆయకట్టు 6500 ఎకరాలకు రబీ వరిసాగుకు సాగునీరు అందించాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ సమయంలో చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. అయితే నోటి మాటతో కాదని, అధికారికంగా హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు.
దీంతో టీడీపీ నాయకులు కలుగజేసుకుని ఈ విషయాన్ని గ్రామదర్శిని సభలో చర్చించుకుందామని తెలిపారు. దీంతో రైతులు తమకు ఇక్కడే సమాధానం చెప్పాలని, ఐఏబీ సమావేశంలో 16.25 మైలు తూము వరకే సాగునీరు వచ్చేలా సంతకాలు పెట్టి, ఇప్పుడు చివరి ఆయకట్టుగా ఉన్న 19.25 మైలు తూము వరకు నీళ్లు ఇస్తామంటూ ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన తెలుగుతమ్ముళ్లు రైతులను పక్కకి నెట్టుకుంటూ ‘మీకు సమాధానం కావాలంటే సమావేశం జరిగే ప్రాంతం వద్దకు రావాలంటూ’ వెళ్లే సమయంలో రైతులు అడ్డుపడ్డారు. దీంతో రైతులకు, తెలుగుతమ్ముళ్లకు కొంత తోపులాట జరిగింది. దీనిని గమనించిన పోలీసులు ఇరువర్గాల వారిని సర్దిచెప్పి అక్కడి నుంచి ఎమ్మెల్యేను తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment