సాక్షి, నెల్లూరు : జిల్లాలోని కోవూరు నియోజకవర్గం టీడీపీలో తీవ్రమైన విభేదాలు నెలకొన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కంటే తానే మంచి అభ్యర్థి అవుతానని టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని పేర్కొన్నారు. ఈ మేరకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనే తనకు హామీ ఇచ్చారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బ్యాలెట్‌లో తన పేరే ఉంటుందని.. కాబట్టి ఈరోజు నుంచే కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. కాగా ఈ విషయంపై పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఏవిధంగా స్పందిస్తారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
పోలంరెడ్డి వర్సెస్ పెళ్లకూరు
మంత్రి సోమిరెడ్డి అనుచరుడిగా 2012లో పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉప ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేశారు. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో టికెట్ ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటంతో పార్టీ కోసం పనిచేశారు. అయితే 2014లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పోలంరెడ్డిని గెలిపిస్తే ఎమ్మెల్సీ కానీ రాష్ట్రస్థాయి నామినేట్ పదవి కానీ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో పోలంరెడ్డి ఎమ్మెల్యేగా గెలవటం కోసం ఖర్చు పెట్టడంతో పాటు తిరిగి ప్రచారం చేశారు. చివరికి పోలంరెడ్డి గెలిచిన 48 గంటల్లోనే ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకానొక సమయంలో.. పెళ్లకూరు దత్తత గ్రామంలో కార్యక్రమాలకు తనను ఆహ్వానించకపోవటం, మినీమహానాడుకు కూడా కనీస ఆహ్వానం అందని పరిస్థితి ఏర్పడటంతో పెళ్లకూరు శ్రీనివాసులు అసమ్మతితో రగిలిపోయారు. ఈ క్రమంలో ఆయన ఈ విధంగా ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
Comments
Please login to add a commentAdd a comment