పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికార తెలుగుదేశం పార్టీలో అసమ్మతి భగ్గుముంటుంది. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండి, అధికార పార్టీలో కొనసాగుతున్న నేతలు అంతా ఒక్కొక్కరుగా రాజీనామాలకు సిద్ధమవుతున్నారు. పార్టీలో కీలక పదవుల్లో ఉన్న నేతలు వ్యక్తిగత లాభాలే ఏజెండాగా పనిచేస్తూ కార్యకర్తలను కనీసం పట్టించుకోకపోవడం లేదు. రూ.కోట్లు ఖర్చు పెట్టి పనిచేసిన నేతలకు సీఎం చంద్రబాబు అనేక హామీలు ఇచ్చినా ఒక్కటీ నిలుపుకోకపోవటం, అధిష్టానాన్ని అనేక పర్యాయాలు కలిసినా ఎలాంటి ప్రయోజనం లేకపోవటంతో మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి తిరుగుబాటు బాటలో పయనించనున్నారు. అదే తరహాలో కోవూరులో అధికార పార్టీ నేతగా ఉన్న పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి రాజీనామాకు సిద్ధం కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
అధికార పార్టీలో హవా సాగిస్తున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి శ్రీనివాసులరెడ్డి ముఖ్య అనుచరుడు కావటంతో పార్టీలో ఏం జరగుతుందోననేది హాట్‌టాపిక్‌గా మారింది. జిల్లా టీడీపీలో అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది. జిల్లాలో పార్టీ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది నేతలు అందరు సమన్వయంతో ముందుకు సాగాలని సీఎం చంద్రబాబునాయుడు క్లాస్‌లు ఇచ్చినా జిల్లా నేతలు పట్టించుకోవటం లేదు. పార్టీ అంతర్గత వేదికలు, ఇతర సభలో నేతల మధ్య గ్రూపు, గొడవలు హాట్‌టాపిక్ అవుతున్నాయి. గత నెల రోజుల వ్యవధిలో ఇవి మరింత ముదిరి పాకనా పడ్డాయి. ప్రధానంగా నియోజకవర్గ మహానాడులు, జిల్లా మహానాడులో విభేదాలు సృష్టంగా కనిపించాయి.
నెల్లూరు పార్లమెంట్, కోవూరు వెంకటగిరి, నెల్లూరు సిటీ, ఆత్మకూరు, ఉదయగిరి నియోజక వర్గాల్లో కొందరు నేతలు ముఖం చాటేయగా మరికొందరికి ఆహ్వానం లేదని అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఇక ఆత్మకూరు ఇన్‌చార్జి, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అయితే నేరుగా ప్రజాప్రతినిధుల తీరును, వస్తున్న ఆరోపణలపై తీవ్రంగా ధ్వజమెత్తారు. ఎర్రచందనం నుంచి ఇసుక వరకు అక్రమ రవాణాలో కీలకంగా మనమే ఉన్నామని అందరూ విమర్శిస్తున్నా ఎందుకు మాట్లాడటం లేదని మంత్రి సోమిరెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. దీని కొనసాగింపుగా నెల్లూరురూరల్‌లో జరిగిన మినీమహానాడులోనూ ముఖ్య నేతల తీరుపై మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాగా, మరో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డి సున్నిత విమర్శలు చేశారు. ఆనం వ్యాఖ్యలు తదనంతరం పరిణమాల నేపథ్యంలో ఆయన పార్టీ వీడుతున్నట్లు బలంగా ప్రచారం సాగుతుంది. ఈ క్రమంలో ఆనం బాటలో కోవూరు టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి కూడా పయనిస్తున్నారు.
పోలంరెడ్డి వర్సెస్ పెళ్లకూరు
మంత్రి సోమిరెడ్డి అనుచరుడిగా 2012లో పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉప ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేశారు. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో టికెట్ ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటంతో పార్టీ కోసం పనిచేశారు. అయితే 2014లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పోలంరెడ్డిని గెలిపిస్తే ఎమ్మెల్సీ కానీ రాష్ట్రస్థాయి నామినేట్ పదవి కానీ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో పోలంరెడ్డి ఎమ్మెల్యేగా గెలవటం కోసం ఖర్చు పెట్టడంతో పాటు తిరిగి ప్రచారం చేశారు. చివరికి పోలంరెడ్డి గెలిచిన 48 గంటల్లోనే ఇద్దరి మధ్య దూరం పెరిగింది. పెళ్లకూరు దత్తత గ్రామంలో కార్యక్రమాలకు అయన్ను ఆహ్వానించకపోవటం, మినీమహానాడుకు కూడా కనీస ఆహ్వానం అందని పరిస్థితి.
జిల్లా నేతకే ఇలాంటి పరిస్థితి ఉంటే పార్టీలో కార్యకర్తల పరిస్థితి ఏంటనేది చర్చ కొనసాగింది. సీఎం చంద్రబాబునాయుడు నియోజకవర్గాల సమీక్షలో ఎమ్మెల్యే పోలంరెడ్డికి క్లాస్ తీసుకున్నారు. అయినా పరిస్థితిలో మార్పు రాలేదు. మరో వైపు రెండు పర్యాయాలు పెళ్లకూరు పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఆశించారు. గత ఏడాది మంత్రి అమరనాథ్‌రెడ్డికి జిల్లా అధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించాలని డిమాండ్‌తో లేఖ రాయటం పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జిల్లా అధ్యక్షుడిగా బీద రవిచంద్ర నియామకం కూడా కొంత కాలం పెండింగ్‌లో పడింది. దీంతో పెళ్లకూరు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మధ్య వైరం పెరిగింది. ప్రతి పరి ణామం మంత్రికి తెలుస్తున్నా ఆయన కూడా సరైన రీతిలో స్పందించకపోవటంతో ఇక పార్టీ వీడటమే సరైన చర్య అని నిర్ణయించుకున్నారు. వచ్చే వారంలో శ్రీనివాసులురెడ్డి ముఖ్య అనుచరులతో సమావేశం నిర్వహించి పార్టీ మారనున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment