polam reddy
-
కౌలుకు తీసుకుని కబ్జా
కోవూరు: టీడీపీ నేతల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ భూములను సైతం కబ్జా చేస్తున్నారు. కౌలు పేరిట తీసుకుని భూ యజమానులను బెదిరించి స్వాహా చేస్తున్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రధాన అనుచరుడిగా చలామణి అవుతున్న బుచ్చిరెడ్డిపాళెం మండలానికి చెందిన ఓ వ్యక్తి ఇలాంటి నిర్వాకానికి పాల్పడ్డాడు. రూ.1.25 కోట్ల విలువైన ఐదెకరాలను కౌలుకు తీసుకుని ఆక్రమించాడు. బాధితులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించడంతో సదరు నేత కబ్జా పర్వం వెలుగులోకి వచ్చింది. వివరాలు..బుచ్చిరెడ్డిపాళెం మండలం కట్టుబడిపాళేనికి చెందిన కాకుమాను కృష్ణకుమారి, కాకుమాను మాధురిదేవికు వవ్వేరు రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లలో 1023–ఏ,బీ, 1024–ఏ,బీ, 512–1బీ,బీలో ఐదెకరాల భూమి ఉంది. వంశపారంపర్యంగా వచ్చిన ఈ భూమిని అదే ప్రాంతానికి చెందిన నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి కౌలుకు ఇచ్చారు. పొలం యజమానులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇదే అదనుగా నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి ఎలాగైనా భూమిని సొంతం చేసుకోవాలని భావించాడు. రెవెన్యూ అధికారులను బ్లాక్మెయిల్ చేసి రెవెన్యూ రికార్డుల్లో తన తల్లి నెల్లూరు మీనాక్షమ్మ పేరుపై భూమిని నమోదు చేయించుకున్నాడు. గత మూడేళ్లుగా కౌలు చెల్లించలేదు. భూమిని సైతం అప్పగించలేదు. దీంతో భూయజమానులు గట్టిగా నిలదీయగా పొలం తనదని, మీకు కౌలు చెల్లించాల్సిన అవసరం లేదని బెదిరించాడు. దీంతో భూయజమానులు రెవెన్యూ అధికారులను ఆశ్రయించగా మీనాక్షమ్మ పేరుపై భూములు నమోదై ఉన్నాయి. దీంతో తహసీల్దార్ ఈ నెల 16న భూ హక్కు పత్రాలతో విచారణకు హాజరుకావాలని నెల్లూరు ప్రభాకర్‌రెడ్డికి నోటీసులు జారీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు బుచ్చిఎస్సై వీరప్రతాప్ చీటింగ్ కేసు నమోదు చేశారు. -
75.లక్షల విలవైన భూమి కబ్జా
కోవూరు/బుచ్చిరెడ్డిపాళెం: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రధాన అనుచరుడిగా చలామణి అవుతున్న నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి ఆక్రమణలకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ఇద్దరు మహిళలకు వంశపారంపర్యంగా వచ్చిన రూ.75 లక్షల విలువైన మూడెకరాల భూమిని లీజుకు తీసుకుని ఆక్రమించాడు. బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించడంతో చీటింగ్ కేసు నమోదు చేశారు. వివరాలు..బుచ్చిరెడ్డిపాళెం మండలం కట్టుబడిపాళేనికి చెందిన కాకుమాను కృష్ణకుమారి, కాకుమాను మాధురిదేవికు సర్వే నంబర్ 1023–ఏ,బీ, 1024–ఏ,బీ, 512–1బీ,బీ సర్వే నంబర్లలో మూడెకరాల భూమి ఉంది. వంశపారంపర్యంగా వచ్చిన ఈ భూమిని అదే ప్రాంతానికి చెందిన నెల్లూరు ప్రభాకర్‌రెడ్డికి కౌలుకు ఇచ్చారు. గత కొన్నేళ్లుగా పొలం యజమానులు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఇదే అదనుగా భావించిన నెల్లూరు ప్రభాకర్‌రెడ్డి భూమిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని కౌలు చెల్లించలేదు. భూమిని అప్పగించాలని కోరిన భూ యజమానులను బెదిరింపులకు గురిచేయసాగాడు. మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి అనుచరుడిగా చెలామణి అవుతూ రెవెన్యూ అధికారులను బ్లాక్మెయిల్ చేసి రెవెన్యూ రికార్డు ల్లో సైతం తన తల్లి నెల్లూరు మీనాక్షమ్మ పేరును నమోదు చేయించుకున్నారు. ఇదేమి అన్యాయం అని ప్రశ్నించిన బాధితులను బెదిరించ డంతో బాధితులు ఇటీవల రెవెన్యూ అధికారులను ఆశ్రయించారు. దీంతో బుచ్చిరెడ్డిపాళెం తహసీల్దార్ ఈ నెల 16న విచారణకు హాజరుకావాలని నెల్లూరు ప్రభాకర్‌రెడ్డికి శనివారం నోటీసులు జారీ చేశారు. అలాగే బాధితుల ిఫిర్యాదు మేరకు బుచ్చిరెడ్డిపాళెం ఎస్సై వీరప్రతాప్ సైతం చీటింగ్ కేసు నమోదు చేశారు. -
‘బ్యాలెట్లో నాపేరే ఉంటుంది.. బాబు హామీ ఇచ్చారు’
సాక్షి, నెల్లూరు : జిల్లాలోని కోవూరు నియోజకవర్గం టీడీపీలో తీవ్రమైన విభేదాలు నెలకొన్నాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి కంటే తానే మంచి అభ్యర్థి అవుతానని టీడీపీ నేత పెళ్లకూరు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం ఖాయమని పేర్కొన్నారు. ఈ మేరకు టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలోనే తనకు హామీ ఇచ్చారని తెలిపారు. రానున్న ఎన్నికల్లో బ్యాలెట్లో తన పేరే ఉంటుందని.. కాబట్టి ఈరోజు నుంచే కోవూరు నియోజకవర్గంలో పర్యటిస్తానన్నారు. కాగా ఈ విషయంపై పోలంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఏవిధంగా స్పందిస్తారనే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పోలంరెడ్డి వర్సెస్ పెళ్లకూరు మంత్రి సోమిరెడ్డి అనుచరుడిగా 2012లో పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉప ఎన్నికల్లో టీడీపీ కోసం పని చేశారు. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో టికెట్ ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వటంతో పార్టీ కోసం పనిచేశారు. అయితే 2014లో కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి టికెట్ కేటాయించారు. ఈ క్రమంలో ఎన్నికల్లో పోలంరెడ్డిని గెలిపిస్తే ఎమ్మెల్సీ కానీ రాష్ట్రస్థాయి నామినేట్ పదవి కానీ ఇస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దీంతో పోలంరెడ్డి ఎమ్మెల్యేగా గెలవటం కోసం ఖర్చు పెట్టడంతో పాటు తిరిగి ప్రచారం చేశారు. చివరికి పోలంరెడ్డి గెలిచిన 48 గంటల్లోనే ఇద్దరి మధ్య దూరం పెరిగింది. ఒకానొక సమయంలో.. పెళ్లకూరు దత్తత గ్రామంలో కార్యక్రమాలకు తనను ఆహ్వానించకపోవటం, మినీమహానాడుకు కూడా కనీస ఆహ్వానం అందని పరిస్థితి ఏర్పడటంతో పెళ్లకూరు శ్రీనివాసులు అసమ్మతితో రగిలిపోయారు. ఈ క్రమంలో ఆయన ఈ విధంగా ప్రకటన చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. -
పోలంరెడ్డిని అడ్డుకున్న రైతులు
నెల్లూరు, విడవలూరు: చివరి ఆయకట్టుకు సాగునీరు అందించే విషయంలో జోక్యం చేసుకోవాలని విడవలూరు మండలంలోని రామతీర్థం, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన రైతులు కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డిని శుక్రవారం అడ్డుకున్నారు. మండలంలోని రామతీర్థంలో జరిగిన గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డికి రైతులంతా కలసి తమ చివరి ఆయకట్టు 6500 ఎకరాలకు రబీ వరిసాగుకు సాగునీరు అందించాలని వినతిపత్రం ఇచ్చారు. ఈ సమయంలో చివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. అయితే నోటి మాటతో కాదని, అధికారికంగా హామీ ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. దీంతో టీడీపీ నాయకులు కలుగజేసుకుని ఈ విషయాన్ని గ్రామదర్శిని సభలో చర్చించుకుందామని తెలిపారు. దీంతో రైతులు తమకు ఇక్కడే సమాధానం చెప్పాలని, ఐఏబీ సమావేశంలో 16.25 మైలు తూము వరకే సాగునీరు వచ్చేలా సంతకాలు పెట్టి, ఇప్పుడు చివరి ఆయకట్టుగా ఉన్న 19.25 మైలు తూము వరకు నీళ్లు ఇస్తామంటూ ఎలా చెబుతారని ప్రశ్నించారు. దీంతో రెచ్చిపోయిన తెలుగుతమ్ముళ్లు రైతులను పక్కకి నెట్టుకుంటూ ‘మీకు సమాధానం కావాలంటే సమావేశం జరిగే ప్రాంతం వద్దకు రావాలంటూ’ వెళ్లే సమయంలో రైతులు అడ్డుపడ్డారు. దీంతో రైతులకు, తెలుగుతమ్ముళ్లకు కొంత తోపులాట జరిగింది. దీనిని గమనించిన పోలీసులు ఇరువర్గాల వారిని సర్దిచెప్పి అక్కడి నుంచి ఎమ్మెల్యేను తరలించారు. -
టీడీపీలో జల జగడం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అధికార పార్టీలో జల జగడం మొదలైంది. నీటి పంపకాలు, వాటాల విషయంలో ప్రజాప్రతినిధుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఆధిపత్యం కోసం కోవూరు ఎమ్మెల్యే పాకులాడుతుంటే.. అన్ని ప్రాంతాలకూ సమ న్యాయం పేరుతో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మెట్టు దిగనంటున్నారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ద్వారా ఎమ్మెల్యేతో మధ్యవర్తిత్వం నడిపారు. తొలుత అందుకు అంగీకరించిన ఎమ్మెల్యే రైతుల ప్రయోజనాలంటూ చివరకు అడ్డం తిరగడం వివాదాస్పదంగా మారింది. రాజకీయంగా మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య పెరిగిన దూరం కాస్తా బుచ్చిరెడ్డిపాళెం ఇరిగేషన్ సబ్ డివిజన్ విభజన వ్యవహారంతో రసకందాయంలో పడింది. జీఓ వచ్చాక.. వివరాల్లోకి వెళితే.. బుచ్చిరెడ్డిపాళెం ఇరిగేషన్ సబ్ డివిజన్‌ను రెండు సబ్ డివిజన్లుగా విభజిస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. సబ్ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ విషయమై తొలుత కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మంత్రి సోమిరెడ్డితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. బుచ్చిరెడ్డిపాళెం సబ్ డివిజన్ పరిధిలోని సాగు భూమికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సబ్ డివిజన్ల పునర్విభజన చేయాలని అంతా కలిసి నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా మంత్రి సోమిరెడ్డి కసరత్తు చేశారు. ఇరిగేషన్ సబ్ డివి జన్ను రెండుగా విభజించారు. బుచ్చి రెడ్డిపాళెం సబ్ డివిజన్లో ఉండే కొడవలూరు, విడవలూరు మండలాలను కోవూరు మండలంలో కలిపారు. దీనిపై రైతు సంఘాలు అప్పటికే అభ్యంతరం లేవనెత్తి ముఖ్యమంత్రికి లేఖలు రాశాయి. విభజన పేరుతో కొడవలూరు మండలంలోని ఇఫ్కోకు కనిగిరి రిజర్వాయర్ నుంచి 10 ఎంజీడీ నీటిని కేటాయించారు. కోకో కోలా సంస్థకు 8 నుంచి 9 టీఎంసీల నీటిని విక్రయించడానికి వీలుగా ఒప్పందాలు చేశారు. దీనివల్ల కనిగిరి రిజర్వాయర్ కింద ఉన్న 1.48 లక్షల ఎకరాల భూమిలో సాగుకు విఘాతం కలుగుతుందనేది రైతు సంఘాల వాదన. ముందుగా విభజనకు మంత్రి సోమిరెడ్డి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ అంగీకరించారు. ఇప్పుడు కోవూరు ఎమ్మెల్యే విభజన సరికాదనడంపై చర్చ మొదలైంది. అధికార పార్టీలో ఆధిపత్యం నేపథ్యంలోనే ముఖ్యుల మధ్య వివాదాలు తలెత్తాయి. ఈ ప్రభావం కెనాల్ సబ్‌డివిజన్ పునర్విభజనపై పడటంతో గందరగోళం మొదలైంది. గతంలో ఆత్మకూరును కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేసే సమయంలోనే ఇరిగేషన్ కొత్త డివిజన్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. అయితే, గత నెలలో ఇరిగేషన్ కొత్త డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొదట్లో ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు. దీంతో మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం కొత్త డివిజన్ ఏర్పాటుకు, పాత డివిజన్లోని మార్పులు, చేర్పులకు జీఓ విడుదల చేశారు. జీఓను అనుసరించి బుచ్చిరెడ్డిపాళెం డివిజన్‌ను విడదీయాల్సి వచ్చింది. అడ్డం తిరిగిన పోలంరెడ్డి పునర్విభజనకు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మొదట అంగీకరించినా.. తర్వాత అడ్డం తిరిగారు. పార్టీలో తనకు తగ్గిపోతున్న ప్రాభవాన్ని పెంచుకోవడం కోసమే రైతు ప్రయోజనాలంటూ ఎమ్మెల్యే హడావుడి చేస్తున్నారనేది పార్టీలో ఒక వర్గం వాదన. గతంలో ఈ విషయంపై మంత్రి సోమిరెడ్డికి, ఎమ్మెల్యే పోలంరెడ్డికి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మధ్యవర్తిత్వం నడిపి సర్దుబాటు చేశారు. పోలంరెడ్డి ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం వెనుక ఆధిపత్యం కూడా ఉందనేది బలమైన వాదన. సబ్ డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే పోలంరెడ్డి భారీగా కాంట్రాక్టులు నిర్వహించడం, గతంలో తనకు అనుకూలంగా ఉండే ఏఈలను, డీఈలను నియమించుకోవడం చేశారు. విభజనతో ఇప్పుడు ఆ పరిస్థితికి గండిపడింది. మరోవైపు డివిజన్లో చేసిన పనులకు సంబంధించి బిల్లులు కూడా కొంత పెండింగ్‌లో ఉన్నాయి. దీనిని ఎమ్మెల్సీ, మంత్రులు పట్టించుకోకపోవడం, కనీస ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో తిరుగుబావుటా ఎగరవేశారు. గతంలో నియోజకవర్గంలోని ఇఫ్కో, కిసాన్ సెజ్‌లకు అనుమతి ఇచ్చే విషయంలో ఆయన నోరు మెదపలేదు. పెన్నా డెల్టా రైతులకు రావాల్సిన నీరు తెలుగుగంగకు పంపిణీ చేస్తున్నా ఒక్క మాట కూడా అడగలేదు. దీనికితోడు నీరు–చెట్టు పనుల్లో కోవూరు నియోజకవర్గంలో జరిగినంత అవినీతి మరే నియోజకవర్గంలో జరగలేదు. తరచూ వివాదాలు వస్తున్న ఈ డివిజన్లో అధికారులను ఆయనే వెనకేసుకొచ్చిన సందర్భాలున్నాయి. కోర్టుకెళ్లండి.. డీఈ స్థాయి అధికారి నియామకం తనకు అనుకూలంగా జరగకపోవడం, కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో సబ్ డివిజన్‌ను విడదీయడాన్ని పోలంరెడ్డి వ్యతిరేకిస్తున్నారని పార్టీ ముఖ్యనేతల వాదన. ఈ క్రమంలో ఈ వ్యవహారం సీఎం దృష్టికి వెళ్లింది. మరోవైపు కొందరు రైతులు డివిజన్‌ను విభజించవద్దని మంత్రి సోమిరెడ్డిని కలిసిన క్రమంలో జీఓ వచ్చాక ఏమీ చేయలేమని.. కోర్టుకు వెళ్లాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద సబ్ డివిజన్ రగడ అధికార పార్టీలో ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి. -
‘దేశం’లోకి పోలంరెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సొంత గూటికి చేరుకునేందుకు రంగం సిద్ధమైంది. ముహూర్తం మాత్రమే ఖరారు కావాల్సి ఉంది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతో పాటు పలువురు నాయకులతో చర్చించి ముహూర్తం నిర్ణయించనున్నారు. ఈయన ఆదివారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయినట్లు విశ్వసనీ యంగా తెలిసింది. ఈ భేటీలో ముహూర్తం ఖరారు కాలేదని పోలంరెడ్డి అనుచరులు చెబుతున్నారు. దీంతో కోవూరు టీడీపీతో పాటు జిల్లాలోని ఆ పార్టీలోనూ రసవత్తర రాజకీయానికి అంకురార్పణ జరగనుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు. కోవూరు అసెంబ్లీ నియోజకవర్గానికి గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల ముందు నుంచి పోలంరెడ్డి సొంతగూటికి చేరుకుంటారనే ప్రచారం విసృ్తతంగా సాగింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే పోటీ చేశారు. ఎన్నికల అనంతరం పోలంరెడ్డి ‘దేశం’లోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. 2014 ఎన్నికల్లో తనకు టికెట్ ఖాయంగా ఇస్తానంటేనే పార్టీలో చేరుతానని మాజీ ఎమ్మెల్యే షరతు విధించారు. అప్పటికే తన వ్యాపార భాగస్వామి అయిన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి టికెట్ ఇప్పిస్తానని చంద్రమోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు పెళ్లకూరును కోవూరు నియోజకవర్గంలో సోమిరెడ్డి తిప్పుతున్నారు. ఈ విషయం పసిగట్టిన పోలంరెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు వెనకడుగు వేశారు. దీంతో టీడీపీ అభ్యర్థిత్వం సందేహంలో పండింది. ఒక దఫా పార్టీలో చేరేందుకు నిర్ణయించిన ముహూర్తానికి కూడా పోలంరెడ్డి వెళ్లకుండా తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా జరిగిన పరిణామాల్లో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చంద్రబాబుతో ఆదివారం సాయంత్రం భేటీ కావడం పార్టీ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు కంభంపాటి రామ్మోహన్రావు పోలంరెడ్డిని వెంటపెట్టుకుని చంద్రబాబును ఆయన నివాసంలో కలిసినట్లు సమాచారం. ఈ సమావేశం సమయానికి పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర అందుబాటులో లేకపోవడంతో పోలంరెడ్డిని ఎప్పుడు పార్టీలో చేర్చుకోవాలనే తేదీ ఖరారు కాలేదు. సుమారు అర్ధగంటపాటు చంద్రబాబుతో మాజీ ఎమ్మెల్యే మంతనాలు జరిపారు. ఏది ఏమైనా ఈ భేటీ తరువాత పోలంరెడ్డి టీడీపీలోకి వెళ్లడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు భేటీ విషయాన్ని పోలంరెడ్డి అనుచరులు ధ్రువీకరించారు. దీంతో ఇప్పటికే కోవూరు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న పెళ్లుకూరు శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డితో పాటు వారి అనుచరులు ఆందోళనలో పడ్డారు.