సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అధికార పార్టీలో జల జగడం మొదలైంది. నీటి పంపకాలు, వాటాల విషయంలో ప్రజాప్రతినిధుల మధ్య భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఆధిపత్యం కోసం కోవూరు ఎమ్మెల్యే పాకులాడుతుంటే.. అన్ని ప్రాంతాలకూ సమ న్యాయం పేరుతో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మెట్టు దిగనంటున్నారు. ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ద్వారా ఎమ్మెల్యేతో మధ్యవర్తిత్వం నడిపారు. తొలుత అందుకు అంగీకరించిన ఎమ్మెల్యే రైతుల ప్రయోజనాలంటూ చివరకు అడ్డం తిరగడం వివాదాస్పదంగా మారింది. రాజకీయంగా మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ మధ్య పెరిగిన దూరం కాస్తా బుచ్చిరెడ్డిపాళెం ఇరిగేషన్ సబ్ డివిజన్ విభజన వ్యవహారంతో రసకందాయంలో పడింది.
జీఓ వచ్చాక..
వివరాల్లోకి వెళితే.. బుచ్చిరెడ్డిపాళెం ఇరిగేషన్ సబ్ డివిజన్‌ను రెండు సబ్ డివిజన్లుగా విభజిస్తూ ప్రభుత్వం రెండు రోజుల క్రితం ఉత్తర్వులు జారీ చేసింది. సబ్ డివిజన్ల పునర్వ్యవస్థీకరణ విషయమై తొలుత కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మంత్రి సోమిరెడ్డితో పలు దఫాలుగా చర్చలు జరిపారు. బుచ్చిరెడ్డిపాళెం సబ్ డివిజన్ పరిధిలోని సాగు భూమికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సబ్ డివిజన్ల పునర్విభజన చేయాలని అంతా కలిసి నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా మంత్రి సోమిరెడ్డి కసరత్తు చేశారు. ఇరిగేషన్ సబ్ డివి జన్‌ను రెండుగా విభజించారు. బుచ్చి రెడ్డిపాళెం సబ్ డివిజన్‌లో ఉండే కొడవలూరు, విడవలూరు మండలాలను కోవూరు మండలంలో కలిపారు. దీనిపై రైతు సంఘాలు అప్పటికే అభ్యంతరం లేవనెత్తి ముఖ్యమంత్రికి లేఖలు రాశాయి. విభజన పేరుతో కొడవలూరు మండలంలోని ఇఫ్కోకు కనిగిరి రిజర్వాయర్ నుంచి 10 ఎంజీడీ నీటిని కేటాయించారు. కోకో కోలా సంస్థకు 8 నుంచి 9 టీఎంసీల నీటిని విక్రయించడానికి వీలుగా ఒప్పందాలు చేశారు. దీనివల్ల కనిగిరి రిజర్వాయర్ కింద ఉన్న 1.48 లక్షల ఎకరాల భూమిలో సాగుకు విఘాతం కలుగుతుందనేది రైతు సంఘాల వాదన.
ముందుగా విభజనకు మంత్రి సోమిరెడ్డి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ అంగీకరించారు. ఇప్పుడు కోవూరు ఎమ్మెల్యే విభజన సరికాదనడంపై చర్చ మొదలైంది. అధికార పార్టీలో ఆధిపత్యం నేపథ్యంలోనే ముఖ్యుల మధ్య వివాదాలు తలెత్తాయి. ఈ ప్రభావం కెనాల్ సబ్‌డివిజన్ పునర్విభజనపై పడటంతో గందరగోళం మొదలైంది. గతంలో ఆత్మకూరును కొత్త రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటుచేసే సమయంలోనే ఇరిగేషన్ కొత్త డివిజన్ ప్రతిపాదనలు ప్రభుత్వానికి చేరాయి. అయితే, గత నెలలో ఇరిగేషన్ కొత్త డివిజన్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మొదట్లో ఎవరూ అభ్యంతరాలు చెప్పలేదు. దీంతో మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వం కొత్త డివిజన్ ఏర్పాటుకు, పాత డివిజన్‌లోని మార్పులు, చేర్పులకు జీఓ విడుదల చేశారు. జీఓను అనుసరించి బుచ్చిరెడ్డిపాళెం డివిజన్‌ను విడదీయాల్సి వచ్చింది.
అడ్డం తిరిగిన పోలంరెడ్డి
పునర్విభజనకు పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మొదట అంగీకరించినా.. తర్వాత అడ్డం తిరిగారు. పార్టీలో తనకు తగ్గిపోతున్న ప్రాభవాన్ని పెంచుకోవడం కోసమే రైతు ప్రయోజనాలంటూ ఎమ్మెల్యే హడావుడి చేస్తున్నారనేది పార్టీలో ఒక వర్గం వాదన. గతంలో ఈ విషయంపై మంత్రి సోమిరెడ్డికి, ఎమ్మెల్యే పోలంరెడ్డికి మధ్య భేదాభిప్రాయాలు రావడంతో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మధ్యవర్తిత్వం నడిపి సర్దుబాటు చేశారు. పోలంరెడ్డి ఇప్పుడు ప్లేటు ఫిరాయించడం వెనుక ఆధిపత్యం కూడా ఉందనేది బలమైన వాదన. సబ్ డివిజన్ పరిధిలో ఎమ్మెల్యే పోలంరెడ్డి భారీగా కాంట్రాక్టులు నిర్వహించడం, గతంలో తనకు అనుకూలంగా ఉండే ఏఈలను, డీఈలను నియమించుకోవడం చేశారు. విభజనతో ఇప్పుడు ఆ పరిస్థితికి గండిపడింది. మరోవైపు డివిజన్‌లో చేసిన పనులకు సంబంధించి బిల్లులు కూడా కొంత పెండింగ్‌లో ఉన్నాయి. దీనిని ఎమ్మెల్సీ, మంత్రులు పట్టించుకోకపోవడం, కనీస ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో తిరుగుబావుటా ఎగరవేశారు. గతంలో నియోజకవర్గంలోని ఇఫ్కో, కిసాన్ సెజ్‌లకు అనుమతి ఇచ్చే విషయంలో ఆయన నోరు మెదపలేదు. పెన్నా డెల్టా రైతులకు రావాల్సిన నీరు తెలుగుగంగకు పంపిణీ చేస్తున్నా ఒక్క మాట కూడా అడగలేదు. దీనికితోడు నీరు–చెట్టు పనుల్లో కోవూరు నియోజకవర్గంలో జరిగినంత అవినీతి మరే నియోజకవర్గంలో జరగలేదు. తరచూ వివాదాలు వస్తున్న ఈ డివిజన్‌లో అధికారులను ఆయనే వెనకేసుకొచ్చిన సందర్భాలున్నాయి.
కోర్టుకెళ్లండి..
డీఈ స్థాయి అధికారి నియామకం తనకు అనుకూలంగా జరగకపోవడం, కోట్లాది రూపాయల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో సబ్ డివిజన్‌ను విడదీయడాన్ని పోలంరెడ్డి వ్యతిరేకిస్తున్నారని పార్టీ ముఖ్యనేతల వాదన. ఈ క్రమంలో ఈ వ్యవహారం సీఎం దృష్టికి వెళ్లింది. మరోవైపు కొందరు రైతులు డివిజన్‌ను విభజించవద్దని మంత్రి సోమిరెడ్డిని కలిసిన క్రమంలో జీఓ వచ్చాక ఏమీ చేయలేమని.. కోర్టుకు వెళ్లాలని సలహా ఇచ్చినట్లు తెలుస్తోంది. మొత్తం మీద సబ్ డివిజన్ రగడ అధికార పార్టీలో ఎలాంటి మలుపు తిరుగుతుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment