సాక్షి ప్రతినిధి, నెల్లూరు : కోవూరు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి సొంత గూటికి చేరుకునేందుకు రంగం సిద్ధమైంది. ముహూర్తం మాత్రమే ఖరారు కావాల్సి ఉంది. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్రతో పాటు పలువురు నాయకులతో చర్చించి ముహూర్తం నిర్ణయించనున్నారు.
ఈయన ఆదివారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయినట్లు విశ్వసనీ యంగా తెలిసింది. ఈ భేటీలో ముహూర్తం ఖరారు కాలేదని పోలంరెడ్డి అనుచరులు చెబుతున్నారు. దీంతో కోవూరు టీడీపీతో పాటు జిల్లాలోని ఆ పార్టీలోనూ రసవత్తర రాజకీయానికి అంకురార్పణ జరగనుందనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
కోవూరు అసెంబ్లీ నియోజకవర్గానికి గత ఏడాది జరిగిన ఉప ఎన్నికల ముందు నుంచి పోలంరెడ్డి సొంతగూటికి చేరుకుంటారనే ప్రచారం విసృ్తతంగా సాగింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగానే పోటీ చేశారు. ఎన్నికల అనంతరం పోలంరెడ్డి ‘దేశం’లోకి వెళ్తారనే ప్రచారం జరిగింది. 2014 ఎన్నికల్లో తనకు టికెట్ ఖాయంగా ఇస్తానంటేనే పార్టీలో చేరుతానని మాజీ ఎమ్మెల్యే షరతు విధించారు.
అప్పటికే తన వ్యాపార భాగస్వామి అయిన పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి టికెట్ ఇప్పిస్తానని చంద్రమోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆ మేరకు పెళ్లకూరును కోవూరు నియోజకవర్గంలో సోమిరెడ్డి తిప్పుతున్నారు. ఈ విషయం పసిగట్టిన పోలంరెడ్డి టీడీపీలోకి వెళ్లేందుకు వెనకడుగు వేశారు. దీంతో టీడీపీ అభ్యర్థిత్వం సందేహంలో పండింది. ఒక దఫా పార్టీలో చేరేందుకు నిర్ణయించిన ముహూర్తానికి కూడా పోలంరెడ్డి వెళ్లకుండా తప్పించుకున్నాడు. ఈ నేపథ్యంలో వారం రోజులుగా జరిగిన పరిణామాల్లో పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి చంద్రబాబుతో ఆదివారం సాయంత్రం భేటీ కావడం పార్టీ వర్గాల్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షుడు కంభంపాటి రామ్మోహన్‌రావు పోలంరెడ్డిని వెంటపెట్టుకుని చంద్రబాబును ఆయన నివాసంలో కలిసినట్లు సమాచారం. ఈ సమావేశం సమయానికి పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర అందుబాటులో లేకపోవడంతో పోలంరెడ్డిని ఎప్పుడు పార్టీలో చేర్చుకోవాలనే తేదీ ఖరారు కాలేదు.
సుమారు అర్ధగంటపాటు చంద్రబాబుతో మాజీ ఎమ్మెల్యే మంతనాలు జరిపారు. ఏది ఏమైనా ఈ భేటీ తరువాత పోలంరెడ్డి టీడీపీలోకి వెళ్లడం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు భేటీ విషయాన్ని పోలంరెడ్డి అనుచరులు ధ్రువీకరించారు. దీంతో ఇప్పటికే కోవూరు టికెట్‌పై ఆశలు పెట్టుకున్న పెళ్లుకూరు శ్రీనివాసులురెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డితో పాటు వారి అనుచరులు ఆందోళనలో పడ్డారు.
‘దేశం’లోకి పోలంరెడ్డి
Published Mon, Dec 23 2013 3:01 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement