విజయవాడ : పట్టిసీమ నుంచి జూన్ మొదటివారానికే కృష్ణాడెల్టాకు నీరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలు అమలుకు నోచుకోలేదు. జూన్ ముగిసిపోతున్నా సర్కారు నీటి మాటే ఎత్తడం లేదు. మరోపక్క ఏరువాక కార్యక్రమాలు మాత్రం ఆర్భాటంగా నిర్వహించేశారు. వాస్తవంలో రైతులు ఇంకా నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది.
నీటిమట్టం 14 మీటర్లు ఉంటేనే...
పట్టిసీమ వద్ద నీటిమట్టం 14 మీటర్ల కంటే ఎక్కువ ఉంటేనే కృష్ణాడెల్టాకు లిఫ్టు చేయాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడున్నది 13.5 మీటర్లు మాత్రమే. గోదావరి డెల్టాలో ముమ్మరంగా వరినాట్లు సాగుతున్నాయి. అందువల్ల అక్కడి కాల్వలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి నదిలో 13.5 మీటర్ల కంటే నీరు తగ్గే పరిస్థితి ఉందే తప్ప పెరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో నీటిమట్టం 13.5 మీటర్లను దాటాలంటే వర్షాలే ఆధారం. గోదావరి డెల్టాకు 13 వేల క్యూసెక్కుల నీరు అవసరం. ప్రస్తుతం 5,500 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని, అది 13 వేల క్యూసెక్కులను దాటిన తరువాతే పట్టిసీమ గురించి ఆలోచించాల్సి ఉంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు. శబరి నది ప్రాంతం, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసి.. ఆ నీరు గోదావరికి చేరితే నది నీటిమట్టం పెరుగుతుంది. లేదా గోదావరి డెల్టాలో భారీ వర్షాలు కురిస్తే.. రైతులు కాల్వల ద్వారా నీటిని తీసుకోవడం మానేస్తారు. అప్పుడు పైనుంచి వచ్చే నీటితో గోదావరి నది నీటిమట్టం పెరుగుతుంది. ఆ పరిస్థితులు ఉంటేనే కృష్ణాడెల్టాకు నీరివ్వగలమని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. పట్టిసీమ వద్ద ఒక్కసారి 14 మీటర్ల నీటిమట్టానికి చేరుకున్నా నీరొదిలే అవకాశం లేదు. క్రమంతప్పకుండా వస్తేనే పట్టిసీమకు నీరు వదలాలని ఇంజనీర్లు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత వర్షాల ఆధారంగా మరో పక్షం రోజుల్లో కృష్ణాడెల్టాకు నీరిచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ ఇంజనీర్లు చెబుతున్నారు.
ప్రాజెక్టు పూర్తికాకుండానే..
పట్టిసీమ కుడికాల్వ పనులు ఇంకా జరుగుతున్నాయని, విద్యుత్ పనులు పూర్తికాకుండానే పూర్తయినట్లు ప్రభుత్వం చెబుతోందని ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఇటీవల ఆరోపించారు. ప్రాజెక్టును నిర్దిష్ట ఏడాదిలోపు పూర్తి చేస్తే 20 శాతం బోసన్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, పనులు పూర్తికాకపోయినా డబ్బులు ఇచ్చేసిందని విమర్శించారు.