వట్టిపోయిన పట్టిసీమ ఆవిరి
పులిచింతలలోనూ నీరు లేదు
కృష్ణాడెల్టాలో తాగునీటికి కటకటే
రబీ అంటేనే భయపడుతున్న రైతాంగం
విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన పట్టిసీమ ప్రాజెక్టు పడకేసింది. ప్రస్తుతం గోదావరి జలాలు పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణానదిలో కలవడం పూర్తిగా నిలిచిపోయింది. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పడిపోవడంతో గోదావరి నదులపై ఉన్న ఎత్తిపోతల పథకాలను ఆపివేయాలంటూ అక్కడి చీఫ్ ఇంజినీర్ ఆదేశించడంతో తాడిపత్రి, పట్టిసీమ వద్ద ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పథకాలను ఇటీవల నిలుపుదల చేశారు. ప్రస్తుతం గోదావరి నీరు కేవలం గోదావరి డెల్టాకు మాత్రమే సరిపోతుందని, కృష్ణాడెల్టాకు పట్టిసీమ ద్వారా చుక్క నీరు రావడం కష్టమేనని మన ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ సీజన్‌కు పట్టిసీమ ద్వారా వచ్చిన నీరు ఇక ఆగిపోయినట్లేనని అంటున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఒక్కరోజు కూడా 1500 క్యూసెక్కులకు మించి నీరు కృష్ణానదికి రాలేదనేది నిష్టుర సత్యం.
రబీ ఆశలూ గల్లంతేనా!
ఖరీఫ్‌లో ప్రభుత్వం నీరివ్వకుండా చేతులెత్తేయడంతో కృష్ణాడెల్టా రైతులు రబీపై ఆశలు వదులుకున్నారు. బందరు, పెనమలూరు, గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో వ్యవసాయాధికారులు మినుము, పెసర విత్తనాలను సరఫరా చేస్తూ రైతుల్ని రబీవైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వానలు కూడా లేనందున మినుము, పెసర విత్తనాలు ఏమేరకు మొలుస్తాయనే అనుమానాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయామని, ఇప్పుడు అపరాల వల్ల నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. కనీసం ఐదు టీఎంసీల నీరును వదిలిపెట్టాలంటూ కృష్ణా నీటి యాజమాన్య బోర్డును అధికారులు కోరుతున్నారు. ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ నీరు వచ్చి జిల్లాలోని చెరువులు నింపితే రాబోయే మూడు, నాలుగు నెలల్లో కొంతమేరకు నీటి ఎద్దడి తగ్గుతుందని, లేకపోతే గ్రామాల్లో రైతులు, పశువులు నీటి కోసం కూడా విలవిల్లాడాల్సి వస్తుందని ఇంజినీర్లే అంగీకరిస్తున్నారు.
కాల్వల మరమతులపై దృష్టి..
ప్రస్తుతం నీరు అందుబాటులో లేకపోవడంతో కాల్వల మరమతులపై ఇరిగేషన్ అధికారులు దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది ఆపివేసిన కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. బోర్డు నీరిస్తే ఒక విడత చెరువులు నింపి ఆ తర్వాత పనులు ప్రారంభిస్తే ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.
పులిచింతల సంగతి సరేసరి..
ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీరు అడుగంటింది. పులిచింతల జలాశయంలో కేవలం 0.3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎనిమిది అడుగుల నీరు మాత్రమే ఉండడంతో ఎన్టీటీపీఎస్‌కు అవసరమయ్యే నీరు కూడా అందడం లేదు. దీంతో అధికారులు మోటార్లతో నీటిని తోడుకుని ప్లాంట్‌ను నడుపుతున్నారు. ఈ దశలో ప్రకాశం బ్యారేజీ దిగువకు నీరు వదలడం
కష్టమని ఇరిగేషన్ ఇంజినీర్లు
చెబుతున్నారు.