krsnadelta
-
వరుణుడే దిక్కు!
విజయవాడ : పట్టిసీమ నుంచి జూన్ మొదటివారానికే కృష్ణాడెల్టాకు నీరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటనలు అమలుకు నోచుకోలేదు. జూన్ ముగిసిపోతున్నా సర్కారు నీటి మాటే ఎత్తడం లేదు. మరోపక్క ఏరువాక కార్యక్రమాలు మాత్రం ఆర్భాటంగా నిర్వహించేశారు. వాస్తవంలో రైతులు ఇంకా నీటి కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. నీటిమట్టం 14 మీటర్లు ఉంటేనే... పట్టిసీమ వద్ద నీటిమట్టం 14 మీటర్ల కంటే ఎక్కువ ఉంటేనే కృష్ణాడెల్టాకు లిఫ్టు చేయాల్సి ఉంది. ప్రస్తుతం అక్కడున్నది 13.5 మీటర్లు మాత్రమే. గోదావరి డెల్టాలో ముమ్మరంగా వరినాట్లు సాగుతున్నాయి. అందువల్ల అక్కడి కాల్వలకు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి నదిలో 13.5 మీటర్ల కంటే నీరు తగ్గే పరిస్థితి ఉందే తప్ప పెరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో నీటిమట్టం 13.5 మీటర్లను దాటాలంటే వర్షాలే ఆధారం. గోదావరి డెల్టాకు 13 వేల క్యూసెక్కుల నీరు అవసరం. ప్రస్తుతం 5,500 క్యూసెక్కుల నీరు మాత్రమే వస్తోందని, అది 13 వేల క్యూసెక్కులను దాటిన తరువాతే పట్టిసీమ గురించి ఆలోచించాల్సి ఉంటుందని ఇంజనీర్లు చెబుతున్నారు. శబరి నది ప్రాంతం, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసి.. ఆ నీరు గోదావరికి చేరితే నది నీటిమట్టం పెరుగుతుంది. లేదా గోదావరి డెల్టాలో భారీ వర్షాలు కురిస్తే.. రైతులు కాల్వల ద్వారా నీటిని తీసుకోవడం మానేస్తారు. అప్పుడు పైనుంచి వచ్చే నీటితో గోదావరి నది నీటిమట్టం పెరుగుతుంది. ఆ పరిస్థితులు ఉంటేనే కృష్ణాడెల్టాకు నీరివ్వగలమని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. పట్టిసీమ వద్ద ఒక్కసారి 14 మీటర్ల నీటిమట్టానికి చేరుకున్నా నీరొదిలే అవకాశం లేదు. క్రమంతప్పకుండా వస్తేనే పట్టిసీమకు నీరు వదలాలని ఇంజనీర్లు భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత వర్షాల ఆధారంగా మరో పక్షం రోజుల్లో కృష్ణాడెల్టాకు నీరిచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ ఇంజనీర్లు చెబుతున్నారు. ప్రాజెక్టు పూర్తికాకుండానే.. పట్టిసీమ కుడికాల్వ పనులు ఇంకా జరుగుతున్నాయని, విద్యుత్ పనులు పూర్తికాకుండానే పూర్తయినట్లు ప్రభుత్వం చెబుతోందని ఆంధ్రా మేధావుల ఫోరం కన్వీనర్ చలసాని శ్రీనివాస్ ఇటీవల ఆరోపించారు. ప్రాజెక్టును నిర్దిష్ట ఏడాదిలోపు పూర్తి చేస్తే 20 శాతం బోసన్ ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం, పనులు పూర్తికాకపోయినా డబ్బులు ఇచ్చేసిందని విమర్శించారు. -
వట్టిపోయిన పట్టిసీమ ఆవిరి
పులిచింతలలోనూ నీరు లేదు కృష్ణాడెల్టాలో తాగునీటికి కటకటే రబీ అంటేనే భయపడుతున్న రైతాంగం విజయవాడ : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన పట్టిసీమ ప్రాజెక్టు పడకేసింది. ప్రస్తుతం గోదావరి జలాలు పోలవరం కుడికాల్వ ద్వారా కృష్ణానదిలో కలవడం పూర్తిగా నిలిచిపోయింది. ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పడిపోవడంతో గోదావరి నదులపై ఉన్న ఎత్తిపోతల పథకాలను ఆపివేయాలంటూ అక్కడి చీఫ్ ఇంజినీర్ ఆదేశించడంతో తాడిపత్రి, పట్టిసీమ వద్ద ఏర్పాటుచేసిన ఎత్తిపోతల పథకాలను ఇటీవల నిలుపుదల చేశారు. ప్రస్తుతం గోదావరి నీరు కేవలం గోదావరి డెల్టాకు మాత్రమే సరిపోతుందని, కృష్ణాడెల్టాకు పట్టిసీమ ద్వారా చుక్క నీరు రావడం కష్టమేనని మన ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ సీజన్‌కు పట్టిసీమ ద్వారా వచ్చిన నీరు ఇక ఆగిపోయినట్లేనని అంటున్నారు. పట్టిసీమ ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ఒక్కరోజు కూడా 1500 క్యూసెక్కులకు మించి నీరు కృష్ణానదికి రాలేదనేది నిష్టుర సత్యం. రబీ ఆశలూ గల్లంతేనా! ఖరీఫ్‌లో ప్రభుత్వం నీరివ్వకుండా చేతులెత్తేయడంతో కృష్ణాడెల్టా రైతులు రబీపై ఆశలు వదులుకున్నారు. బందరు, పెనమలూరు, గుడివాడ, గన్నవరం నియోజకవర్గాల్లో వ్యవసాయాధికారులు మినుము, పెసర విత్తనాలను సరఫరా చేస్తూ రైతుల్ని రబీవైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వానలు కూడా లేనందున మినుము, పెసర విత్తనాలు ఏమేరకు మొలుస్తాయనే అనుమానాన్ని రైతులు వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్‌లో వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయామని, ఇప్పుడు అపరాల వల్ల నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. కనీసం ఐదు టీఎంసీల నీరును వదిలిపెట్టాలంటూ కృష్ణా నీటి యాజమాన్య బోర్డును అధికారులు కోరుతున్నారు. ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఈ నీరు వచ్చి జిల్లాలోని చెరువులు నింపితే రాబోయే మూడు, నాలుగు నెలల్లో కొంతమేరకు నీటి ఎద్దడి తగ్గుతుందని, లేకపోతే గ్రామాల్లో రైతులు, పశువులు నీటి కోసం కూడా విలవిల్లాడాల్సి వస్తుందని ఇంజినీర్లే అంగీకరిస్తున్నారు. కాల్వల మరమతులపై దృష్టి.. ప్రస్తుతం నీరు అందుబాటులో లేకపోవడంతో కాల్వల మరమతులపై ఇరిగేషన్ అధికారులు దృష్టిసారిస్తున్నారు. ముఖ్యంగా గత ఏడాది ఆపివేసిన కృష్ణాడెల్టా ఆధునికీకరణ పనులు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించారు. బోర్డు నీరిస్తే ఒక విడత చెరువులు నింపి ఆ తర్వాత పనులు ప్రారంభిస్తే ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. పులిచింతల సంగతి సరేసరి.. ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీరు అడుగంటింది. పులిచింతల జలాశయంలో కేవలం 0.3 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఎనిమిది అడుగుల నీరు మాత్రమే ఉండడంతో ఎన్టీటీపీఎస్కు అవసరమయ్యే నీరు కూడా అందడం లేదు. దీంతో అధికారులు మోటార్లతో నీటిని తోడుకుని ప్లాంట్‌ను నడుపుతున్నారు. ఈ దశలో ప్రకాశం బ్యారేజీ దిగువకు నీరు వదలడం కష్టమని ఇరిగేషన్ ఇంజినీర్లు చెబుతున్నారు. -
‘కృష్ణా బోర్డు’తో డెల్టాకు లబ్ధి చేకూరేనా?
విజయవాడలో బోర్డు ఏర్పాటుకు ఇరిగేషన్ శాఖ ప్రతిపాదన ఉపయోగం ఉండదంటున్న నిపుణులు సాక్షి, విజయవాడ : కృష్ణానదీ జలాల బోర్డును విజయవాడలో ఏర్పాటుచేయాలని ఇరిగేషన్ శాఖ పంపిన ప్రతిపాదనలపై నిపుణులు మల్లగుల్లాలు పడుతున్నారు. కృష్ణాడెల్టాకు దీనివల్ల ఏమేరకు లబ్ధి చేకూరుతుందనేది చర్చనీయాంశమైంది. కృష్ణానదిపై అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్నందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు పరిమితమయ్యేలా బోర్డు ఏర్పాటు చేయడం వల్ల ఉపయోగం ఉండదని నిపుణులు చెబుతున్నారు. కృష్ణా యాజమాన్య బోర్డు నీటి లభ్యతను బట్టి రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపు, వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది. బోర్డు విధివిధానాలు, పరిధి, నీటి లెక్కింపు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సాంకేతిక అనుమతులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పర్యవేక్షణ, వరద నిర్వహణ, నీటి యాజమాన్యానికి సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్నతాధికారులు కృష్ణాడెల్టా అవసరాలు, సాగర్ నుంచి ఎంత నీటిని విడుదల చేయాలి, దిగువన ఎంత నీరు వస్తుందన్న అంశాలపై లెక్కలు తీసుకుంటున్నారు. ఇప్పటికే సంక్షోభంలో కృష్ణా డెల్టా... 13 లక్షల ఎకరాల్లో వరి సాగవుతూ దక్షిణ భారతదేశపు అన్నపూర్ణగా పేరొందిన కృష్ణాడెల్టా.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోతోంది. ఒక్క చుక్క కూడా ఉపయోగపడని మునేరు, పాలేరు జలాలను నికర జలాలుగా బ్రిజేష్ ట్రిబ్యునల్ లెక్కల్లో చూపించిన సంగతి తెలిసిందే. నాగార్జునసాగర్ దిగువ భాగంలోని పరీవాహక ప్రాంతంలో మునేరు, పాలేరు నదుల నుంచి వచ్చే 50 టీఎంసీల నీటిని నికర జలాలుగా లెక్కగట్టారు. కృష్ణా నదిలో వరదలు వచ్చే సమయంలోనే మునేరు, పాలేరు ఉపనదుల నుంచి వరద ప్రవాహం కృష్ణానదిలో చేరుతుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద మూడు టీఎంసీల కన్నా ఎక్కువ నీరు నిల్వ చేసే అవకాశం లేకపోవడం వల్ల వచ్చిన నీటిని వచ్చినట్లు సముద్రంలోకి వదలడం మినహా డెల్టాకు ఉపయోగించిన దాఖలాలు లేవు. ఈ నేపథ్యంలో పులిచింతలలో 40 టీఎంసీల నీటిని నిల్వ చేస్తేనే కృష్ణాడెల్టాకు జూన్, జూలై నెలల్లో నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల్లో పులిచింతలలో పూర్తిస్థాయిలో నీటి నిల్వ ఉంచాలంటే మరో రెండేళ్లు ఆగాల్సిందే. మిగులు జలాలపై పూర్తి హక్కు ఉన్నప్పుడే 2002, 2003 సంవత్సరాల్లో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో 20 లక్షల ఎకరాల్లో పంట పండని పరిస్థితి ఏర్పడింది. ఆల్మట్టి ఎత్తు పెంచడం కృష్ణా డెల్టా రైతాంగ ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. 2003-04లో వర్షాలు లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆల్మట్టిలో 137 టీఎంసీల నీరు ఉన్నా 10 టీఎంసీలు కూడా ఇవ్వలేదు. భవిష్యత్‌లో కూడా ఇదే పరిస్థితి ఉండదని గ్యారెంటీ లేదు. పైనుంచి నీరు రాకపోతే ఇక్కడ బోర్డు ఉన్నా నీటిని సర్దుబాటు చేయడం సాధ్యం కాదనే భావన అధికారుల్లో వ్యక్తమవుతోంది. -
సాగునీటి వాటాపై సందిగ్ధతే!
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన కృష్ణాడెల్టాపై ప్రభావం చూపనుందని రైతుల్లో ఆందోళన నెలకొంది. తెలంగాణను విభజిస్తున్నట్లు కాంగ్రెస్ అధి ష్టానం ప్రకటించిన నేపథ్యంలో కృష్ణాడెల్టాకు నీటి విడుదలపై రైతులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే డెల్టాకు సాగునీటిని విడుదల చేయకుండా తెలంగాణ వాదులు అడ్డుకున్నారని గుర్తు చేస్తున్నారు. ఆగస్టు వచ్చినా డెల్టాకు సాగునీటి విడుదలను చేయలేదు. సాగునీటి సంగతి అలా ఉంచితే సముద్రతీరంలోని అనేక గ్రామాలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నాయి. డెల్టాకు తాగునీటి విడుదల కోసం ప్రభుత్వం వద్ద ప్రత్యేక జీవో లేకపోవడంతో తాగునీటి సమస్యలు తలెత్తుతాయనే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. 130 టీఎంసీల నీరు అవసరం కృష్ణాడెల్టాలో దాదాపు 10 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగుకు ఏటా ఖరీఫ్‌లో 85 టీఎంసీలు, రబీలో 45 టీఎంసీల నీరు అవసరం. నాగార్జునసాగర్ నుంచి ప్రకాశం బ్యారేజీకి నీరు చేరితే ఒక క్రమపద్ధతిలో కాలువలకు వదలడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఆనవాయితీ గత ఏడాది నుంచి తప్పింది. నాగార్జునసాగర్‌లో నీటి మట్టం 510 అడుగులకు చేరితే డెల్టాకు నీటి విడుదల చేయకూడదని తెలంగాణవాదులు హైకోర్టును ఆశ్రయిం చారు. ఈ సమయంలోనే డెల్టాకు తాగునీటి కోసమైనా నీటిని విడుదల చేయాలని కోరితే ప్రత్యేక జీవో లేదనే విషయం బయటపడింది. గత ఏడాది డెల్టాకు సాగునీటిని అక్టోబర్‌లో విడుదల చేశారు. ఈలోపుగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షపునీటినే డెల్టాకు విడుదల చేశారు. రబీ సీజన్ వచ్చే సరికి నాగార్జునసాగర్‌లో నీరు అందుబాటులో లేదనే కారణం చూపి నీటి విడుదలను నిలిపివేశారు. ఈ ప్రక్రియ రెండేళ్లుగా కొనసాగుతూనే ఉంది. పోలవరం పూర్తవ్వడానికి ఐదేళ్లు తెలంగాణ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం సీమాంధ్ర నీటి అవసరాలను తీర్చేం దుకు పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని జాతీయ హోదా కల్పిస్తామని సూచన ప్రాయంగా చెప్పారు. ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలంటే చత్తీస్ఘడ్, ఒరిస్సా రాష్ట్రాల అనుమతి తప్పనిసరి. రూ.15 వేల కోట్లతో నిర్మించ తలపెట్టిన ఈ ప్రాజెక్టుకు ఎప్పటిలోగా పూర్తవతుందనే అంశంపై అనేక అనుమానాలు ఉన్నాయి. దివంగత వైఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోల వరం ప్రాజెక్టుకు సంబంధించి కాలువ పనులు జరిగాయి. అనంతరం ఈ ప్రాజెక్టును పట్టించుకునే వారే కరువయ్యారు. కోస్తాతీరంలో సముద్రంలో కలిసే గోదావరి, కృష్ణానదులు రెండూ తెలంగాణ ప్రాంతంలో నుంచే ప్రవహిస్తున్నాయి. తెలంగాణ విడిపోతే కర్ణాటక మాది రిగా ప్రాజెక్టులు నిర్మించేందుకు ప్రయత్నిస్తే డెల్టాకు సాగునీటి విడుదల పరిస్థితి ఏమిటనేది అర్థంకాని ప్రశ్న. రాష్ట్ర విభజనలో నదీ జలాల వ్యవహారంపై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకుంటే కృష్ణాడెల్టా ఎడారిగా ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నీ సక్రమంగానే చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చెబుతున్నా ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు తలెత్తిన సమస్యలను సకాలంలో పరిష్కరించలేదు. ఇక రాష్ట్రం విడిపోతే నదీ జలాల వాటాల విషయంలో తప్పించుకునే ధోరణితో వ్యవహరిస్తే కృష్ణాడెల్టా రైతులకు కష్టషకాలం ప్రారంభం కావటం ఖాయం.